Sep 29,2022 06:17
  • '' మందుల కంపెనీలు అవలంబించే వివిధ మార్కెటింగ్‌ విధానాలు ఒక అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతేగాక అసంబద్ధమైన, అనైతిక విధానాల ద్వారా తమ అమ్మకాలను, తద్వారా లాభాలను పెంచుకోవడానికి అవి నిరంతరం పోటీ పడుతూంటాయి. ఇటువంటి అనైతిక మార్కెటింగ్‌ కోసం అయ్యే విపరీతమైన ఖర్చు మందుల ధరలపై పడి మందుల ధరలు విపరీతంగా పెరగడానికి కూడా కారణం అవుతున్నాయి. ఇటువంటి వాటిని నివారించాలి''.

మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా వార్షిక అమ్మకాలను సాగిస్తూ గణనీయమైన లాభాలను మూటగట్టుకుంటూ, ప్రపంచ దేశాలన్నింటికీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ భారతీయ మందుల పరిశ్రమ ఏటేటా వృద్ధి చెందుతోంది. అయితే -ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ముఖ్య పాత్ర వహించే మందుల ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండట్లేదనీ, అందువలన మందుల ధరలను తగ్గించాలనీ, అత్యవసర, ప్రాణ రక్షక మందులపై జిఎస్‌టిని ఎత్తివేయాలనీ, మన దేశ ప్రజానీకానికి అత్యంత నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించగలిగే ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను వ్యాక్సిన్‌ కంపెనీలను పునరుద్ధరించాలనీ...ప్రజారోగ్య అవసరాల కోసం కృషి చేసే ప్రజారోగ్య వేదిక, జన స్వాస్థ్య అభియాన్‌ వంటి సంస్థలతో పాటు ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఎఐ) ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి.
అలాగే మన దేశ ప్రజల ఆరోగ్య స్థాయి సూచికలు అత్యంత అందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయనీ వీటిని మెరుగుపర్చాలంటే, స్థూల జాతీయాదాయంలో 5 శాతాన్ని బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయించాలనీ, అలాగే ఒక హేతుబద్ధమైన (రేషనల్‌) డ్రగ్‌ పాలసీ ఉండాలనీ కూడా ఇటువంటి సంస్థలు కోరుతున్నాయి. తమ మందుల అమ్మకాలను పెంచుకోవడానికిగాను తమ కంపెనీ మందులనే పేషెంట్లకు సిఫారసు చేయాలని ఆయా కంపెనీలు వైద్యులను కోరుతూ ఉంటాయి. ''మందుల కంపెనీలు అవలంబించే వివిధ మార్కెటింగ్‌ విధానాలు ఒక అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతేగాక అసంబద్ధమైన, అనైతిక విధానాల ద్వారా తమ అమ్మకాలను, తద్వారా లాభాలను పెంచుకోవడానికి అవి నిరంతరం పోటీ పడుతూంటాయి. ఇటువంటి అనైతిక మార్కెటింగ్‌ కోసం అయ్యే విపరీతమైన ఖర్చు మందుల ధరలపై పడి మందుల ధరలు విపరీతంగా పెరగడానికి కూడా కారణమవుతున్నాయి. ఇటువంటి వాటిని నివారించాలి. మందుల మార్కెటింగ్‌లో నైతికమైన విధానాలు అవలంబించాలి. అందుకోసం ఒక నియమావళిని రూపొందించి అమలు చేయాలి'' అని కూడా వివిధ అభ్యుదయకర ప్రజా సంఘాలు, పౌర సంస్థలు ఎప్పటి నుండో కోరుతున్నాయి.
అనైతికమైన విధానాలను విడనాడాలని 1981 లోనే ఎఫ్‌ఎంఆర్‌ఎఐ తమ ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో పేర్కొని నైతికపరమైన విధానాల కోసం పలుమార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించింది. అంతేగాక మందుల మార్కెటింగ్‌కు సంబంధించి ఒక ''సార్వత్రిక నియమావళి''ని రూపొందించి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని వివిధ అభ్యుదయకర ప్రజా సంఘాలతో కలిసి కృషి చేస్తోంది. అనైతిక మార్కెటింగ్‌ విధానాలు కొన్ని రుజువులు, సాక్ష్యాలతో సహా పలు సందర్భాలలో బహిర్గతమయ్యాయి. అయినప్పటికీ 2008వ సంవత్సరంలో ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా''లో వచ్చిన కథనం మాత్రం సంచలనమైంది. అప్పటి రాజ్యసభ సభ్యులు తపన్‌సేన్‌ ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖకు కూడా దీనికి సంబంధించి కొన్ని పత్రాలు సమర్పించారు. పైన ఉదహరించిన సంస్థలు, సంఘాలలో పాటు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (భారతీయ వైద్య మండలి) వివిధ కెమిస్ట్స్‌ డ్రగ్గిస్ట్స్‌ సంఘాలు పలు మార్లు ఇటువంటి కోడ్‌ ఆవశ్యకతను వ్యక్తపరిచాయి. ఏతావాతా ఇన్ని సంవత్సరాల పోరాటాలు, ఒత్తిళ్ళ దరిమిలా కేంద్ర ప్రభుత్వం కూడా మందుల మార్కెటింగ్‌కు సంబంధించి ఒక యూనిఫామ్‌ కోడ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ మార్కెటింగ్‌ ప్రాక్టీసెస్‌ (యుసిపిఎంపి) పేరిట ఒక నియమావళిని 2015 జనవరి 1 నుండి అమలు లోకి వచ్చేలా రూపొందించింది.

  • యుసిపిఎంపి కోడ్‌లో ఏముంది ?

మందుల పరిశ్రమ ఈ కోడ్‌ను 2015 జనవరి 1వ తారీకు నుండి 6 నెలల పాటు స్వచ్ఛందంగా అమలు చేయాలనీ, 6 నెలల తర్వాత సమీక్ష జరిపి, ఈ కోడ్‌ అమలు సరిగ్గా జరగలేదని తేలితే దీనిని స్టాట్యుటరీ కోడ్‌గా రూపొందిస్తామని (చట్టబద్ధత కల్పిస్తామని) మొదటి పేరా లోనే పేర్కొన్నారు. ఈ కోడ్‌ ప్రకారం తమ మందులు సిఫారసు చేయాల్సిందిగా డాక్టర్లకు కానీ, మందులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లు, రిటైలర్లకు కానీ ఎటువంటి బహుమతులూ (వస్తు, ధన రూపంలో) ఇవ్వరాదు. డాక్టర్లను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ వినోద విహారాల కోసం కంపెనీల ఖర్చులతో తీసుకెళ్ళ రాదు. సెలవలు గడపడానికి కానీ, మెడికల్‌ సెమినార్లు, వర్క్‌షాపులు, కాన్ఫÛరెన్సులు, మీటింగ్‌లకు హాజరవడానికి చేసే దేశ, విదేశీ పర్యటనలకు అయ్యే రైలు, విమాన, ఓడ ప్రయాణాలకయ్యే ఖర్చును కంపెనీలు భరించరాదు. అటువంటి ఖర్చును మెడికల్‌ ప్రాక్టీషనర్లు తమకు తామే భరించాలి. ఏ కారణానైనా సరే డాక్టర్లకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ హోటళ్లలో ఉండటానికయ్యే ఖర్చులను కంపెనీలు భరించరాదు. మెడికల్‌ రంగంలో పరిశోధనలకు, అధ్యయనాలకు అయ్యే ఖర్చులకు గాను నిధులను నిర్దిష్ట చట్టాలకు, నిబంధనలకు లోబడి ఆమోదించబడిన సంస్థల ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. ఇవేగాక ప్రమోషనల్‌ మెటీరియల్‌ ఏవిధంగా ఉండాలి? మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల పాత్ర ఏవిధంగా ఉండాలి? మందుల శాంపిళ్లు ఎలా ఇవ్వాలి? అనే అంశాలు కూడా ఈ కోడ్‌లో పొందుపర్చారు. ఈ కోడ్‌ను మందుల కంపెనీలు స్వచ్ఛందంగా పాటించాలి కాబట్టి ప్రతి కంపెనీ ఈ కోడ్‌ను పాటిస్తాననీ డిక్లరేషన్‌ ''ఎ''నూ, ఆర్థిక సంవత్సరం పిదప కోడ్‌ను అమలు జరిపినట్లు డిక్లరేషన్‌ ''బి''ను సమర్పించాలి. మందుల కంపెనీలు కోడ్‌ను పాటించేలా చూడడానికి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు.
ఇటువంటి కోడ్‌ను మందుల కంపెనీలు ఏవిధంగా అమలు చేస్తున్నాయో సంబంధిత మంత్వ్రి శాఖ పలుమార్లు సమీక్ష జరిపింది. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ''డ్రగ్స్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ యాక్ట్‌''ను ఉల్లంఘిస్తూ మందుల ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ను కూడా మందుల కంపెనీలు చేపడ్తున్నాయనీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫÛరెన్స్‌ పేరుతో చేసే ఈ భారీ ఖర్చు, మందుల ధరలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయనీ, ''జాతీయ ఔషధ విధానం''లో దీనికి ఒక పరిష్కారం సూచించాలనీ కేంద్ర ఔషధ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటువంటి కోడ్‌ స్వచ్ఛందంగా అమలు చేయాలనడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, దీనికి చట్టబద్ధత కల్పించి అమలు చేసినప్పుడే తగిన ఫలితం ఉంటుందని కూడా పేర్కొంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ''స్టాట్యుటరీ కోడ్‌'' రూపొందించని కారణంగా, కఠినమైన నిబంధనలతో చట్టబద్ధ యుసిపిఎంపి ని రూపొందించాలనీ, ఉల్లంఘించినవారికి తగిన శిక్షలను కూడా చట్టంలో పొందుపర్చాలని కోరుతూ ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్‌) సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇది జరిగిన 16 నెలల తర్వాత (2022 మార్చి 11వ తేదీన) ప్రభుత్వం తన స్పందనను 25 జులై 2022 నాటికి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ 18 ఆగస్టు 2022 వరకు ప్రభుత్వం నుండి ఏవిధమైన స్పందనా రాలేదని కోర్టు ఆశ్చర్యం వెలిబుచ్చింది. 29 సెప్టెంబరు 2022 కల్లా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతోందో కోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మార్కెటింగ్‌ ఖర్చులన్నీ తడిసి మోపెడై ఆ ఖర్చు కూడా చేరి మందుల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. మందుల మార్కెటింగ్‌ విధానాలు నైతికంగా కొనసాగాలి. నాణ్యమైన, సహేతుకమైన కాంబినేషన్‌ మందులను మాత్రమే అనుమతించాలి. నిర్దేశిత మోతాదుల్లో మాత్రమే మందులను వాడేవిధంగా చూడాలి. ఒక మందును అనుమతించిన ఇండికేషన్‌లో మాత్రమే సూచించేలా చర్యలు చేపట్టాలి. అత్యవసర మందుల జాబితాను ఎటువంటి లొసుగులూ లేకుండా పటిష్టంగా రూపొందించాలి. ఒక మందు పని తీరును వివరించే మెడికల్‌ ఇన్ఫÛర్మేషన్‌, ట్రయళ్ల ఫలితాలు సంబంధిత వైద్యులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు వుండాలి-అని వివిధ ప్రజాసంఘాలు అందోళన వ్యక్తం చేస్తూనే వున్నాయి.
/ వ్యాసకర్త : ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కార్యదర్శి /