
'మనం విజయం కోసం పెట్టే ఖర్చు...ఆ విజయంకన్నా ఎక్కువే' అంటారు. 'ఈ లోకంలో మంచీ, చెడూ అనేది ఏదీ లేదు. మన ఆలోచనలే వాటిని అలా కనిపించేట్టు చేస్తాయి' అంటాడు షేక్స్‌పియర్. 'ఒక వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలైతే వుంటాయో...అతను అలాగే రూపొందుతాడు' అంటాడో రచయిత. 'ఆలోచనలే ఈ ప్రపంచాన్ని పాలిస్తాయని గొప్ప మనీషి అయినవాడు గ్రహిస్తాడు' అంటాడు 'పారడైజ్ లాస్ట్' అనే మహాకావ్యంలో మిల్టన్. ప్రేరణ, ప్రోత్సాహం, వ్యక్తిగత ఎదుగుదలకు అవసరం. ప్రోత్సాహం...అనేది ఎదురుదెబ్బలను అధిగమించడానికి, నిరుత్సాహం నుంచి బయటపడటానికి ఒక భరోసానిస్తుంది. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే...ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ వుండదు. ఇది వ్యక్తిగత, సామూహిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. 'అడుగుల్లాంటివే ప్రగతిశీలి ఆలోచనలు/ అవరోధాలెదురయితే అవి అక్కడే ఆగిపోవు/ పురోగమనమే వాటి నిరంతశీలం/ ప్రలోభాలను కాళ్ల మునివేళ్లతో పక్కకు తోసి/ ముందుకు సాగే నిశ్చల చిత్తవృత్తి ఆ అడుగులది' అంటారు సినారె. మనం ఇతరులను ప్రోత్సహించినప్పుడు సవాళ్లను ఎదుర్కోడానికి, లక్ష్యాలను సాధించడానికి, అడ్డంకులను అధిగమించడానికి ఆ ప్రోత్సాహం వారికి శక్తినిస్తుంది. ప్రోత్సాహం అనేది కేవలం ఒక పదం కాదు... ఇది వ్యక్తిలోని ధైర్యాన్ని, దృఢనిశ్చయాన్ని రగిలించే శక్తి. ఆ ప్రోత్సాహ శక్తి అడుగడుగునా వెన్నంటే వుంటుంది. మునుముందుకు నడుపుతుంది.
కాలంతోపాటు కొత్త ఆలోచనలు చిగురిస్తూనే వుంటాయి. ఆ ఆలోచనలకు సరైన ప్రోత్సాహం లభిస్తే... ఆ ఆచరణ అప్పుడే విచ్చుకున్న తొలిపొద్దులా మనోహరంగా వుంటుంది. ఆచరణకు, పురోగమనానికి ప్రోత్సాహం కీలకం. విజయానికి కావాల్సింది... పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ' అంటాడు థామస్ అల్వా ఎడిసన్. ఒక కుర్రాడికి ఫుట్‌బాల్ అంటే చచ్చేంత ఇష్టం. హైస్కూలుకి వచ్చీరాగానే ఫుట్‌బాల్ టీంలో చేరాలని తెగ ఉబలాటపడిపోయేవాడు. అయితే, ఆ కుర్రాడు పీలగా, పొట్టిగా ఉండటంతో ఎవరూ అతడ్ని పట్టించుకోలేదు. కానీ, ఆ కుర్రాడి తండ్రి అతని వెన్నంటే ఉండి ప్రోత్సహించేవాడు. ఎప్పటికైనా నీకు జట్టులో చోటు దొరుకుతుందంటూ వెన్ను తట్టేవాడు. ఆ కుర్రాడి శ్రమ, ప్రాక్టీసులో అతని ఆటతీరు చూసిన జట్టు సభ్యులు ఓ అవకాశం ఇవ్వాలనుకుంటారు. అన్నట్టుగానే అవకాశం వస్తుంది. ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తాడా కుర్రాడు. కానీ, ఆ తర్వాత ఆ కుర్రాడు కనబడకపోవడంతో...జట్టు కోచ్ వెదుక్కుంటూ... అతనుండే ఓ చిన్న పాకలోకి వెళతాడు. తన తండ్రి ఫొటోకు దండవేసి వుండటం చూసి, ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. 'మన మ్యాచ్ జరిగిన రోజు తెల్లవారుజామున' అని చెబుతాడా కుర్రాడు. దీంతో కోచ్ ఆ కుర్రాడిపై కోప్పడతాడు ఎందుకు చెప్పలేదని. 'ఫుట్‌బాల్ అద్భుతంగా ఆడాలని నా తండ్రి ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ఆయన బతికుండగా అవకాశం దొరకలేదు. ఆయన చనిపోయిన రోజునైనా నేనా లక్ష్యాన్ని సాధించడం చూసి, ఆయన సంతోషిస్తాడనుకున్నా. మైదానంలోని వేలమంది జనంలో ఓ మూలన కూర్చుని ఉండే మా నాన్నే నా మనసులో ఉన్నాడు. ఆయన తప్తి కోసమే ఆడాను' అంటాడా కుర్రాడు. ప్రోత్సాహం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. లక్ష్యాన్ని సాధించేందుకు బాసటగా నిలుస్తుంది.
'సమస్యలొస్తే గందరగోళ పడకు...నువ్వు విజయం సాధించవలసిన పరీక్షలుగా భావించి వాటిని అధిగమించు' అంటాడు కారల్‌మార్క్స్. పిల్లలకు చదువుతో పాటు వారికి ఇష్టమైన వ్యాపకాలలో ప్రోత్సహిస్తే... తమ శక్తియుక్తులను ప్రతిభావంతంగా ప్రదర్శించగలుగుతారు. అలాగే, రైతులకు సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే... మట్టిని బంగారంగా మార్చగలరు. 'నీకేం తెలుసు?' అని కించబరిచే మహిళలకు...ఒక్క అవకాశం ఇస్తే ఆకాశం అంచులను తాకిరాగలరు. అలాగే, ఉత్పాదక రంగంలో ప్రోత్సాహం కీలకపాత్ర వహిస్తుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 12న జరుపుకునే 'జాతీయ ప్రోత్సాహక దినం'... పాలకులు సృష్టిస్తున్న నైరాశ్యం నుంచి బయటపడేందుకు చిరు ప్రోత్సాహం. ఈ చిరు ప్రోత్సాహం కొండంత అండ.