Oct 27,2023 10:27

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మాచెల్‌ వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సాయుధులు మృతి చెందారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్త్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. మాచెల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు జమ్ముకాశ్మీర్‌ అదనపు డిజి విజరు కుమార్‌ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.