
కొందరి కవిత్వం కోసం ప్రత్యేకించి ఆసక్తిగా ఎదురుచూసే నాలాంటి పాఠక కవులుంటారు. కవిత్వాన్ని ఇబ్బడి ముబ్బడిగా రాసేసి పాఠకుల కోసం ఆత్రంగా ఎదురు చూసే కవులూ మరి కొందరు ఉంటారు. ఎవరో కోరుకుంటున్నారని, రాసేస్తే కొన్ని అవకాశాలు అందుకోవచ్చు గదా అని, మరెవరి మెప్పుకోసమో వెనక్కి తిరిగి చూసుకోకుండా రాసే కవులూ ఉన్నారు. ఇవాళ ఇక్కడి భూమిలోంచొ ఓ నిశ్శబ్ద కవితా వీచిక మాట్లాడుతోంది. రాయకుండా ఉండలేని ఒకానొక మానసిక బలహీనతలోంచి అనివార్యంగా ఓ కవయిత్రి మాట్లాడుతోంది. నేను కూడా ఆమె కవిత్వాన్ని అభిమానిస్తాను. ఆమె వ్యక్తిత్వ సంస్కార శోభిత గుణాన్ని, కవిత్వం పట్ల వారికున్న నిబద్ధతను అభిమానిస్తాను. ఆ కవయిత్రి శిలాలోలిత. ఆమెది అరుదైన భావుకత, గాఢమైన అభివ్యక్తి, సూక్ష్మ పరిశీలన, సరళ సాత్విక మృదుత్వం కలగలిసిన సృజనాత్మకత.
పి.లక్ష్మి 1988లో శిలాలలితగా జన్మనెత్తిన తర్వాత నుంచి వారి కవిత్వంతో నాకు పరిచయమే. తన్ను తాను అన్వేషించుకొనే క్రమంలో తనదైన శుద్ధ, తాత్విక అంతచ్ఛేదనే కవిత్వమై వెలికి వస్తూ ఉంటుంది. 1993లో వచ్చిన వీరి ఎంఫిల్ గ్రంథం 'కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు' నాకెంతగానో నచ్చిన గ్రంథం. ఆ దశకంలో అది స్త్రీవాద దక్పథంలోంచీ వచ్చిన, మంచి రిఫరెన్స్ గ్రంథం.
''నేను మరణించను.. అవును
ఈ నెత్తుటిలో కొత్త పుట్టుక నాది
ఈ పుట్టుక నా సొంతం
జనన మరణాల పట్టికను
నేనే తయారు చేసుకోగలను
పంజరాన్ని నేనే, పక్షిని నేనే,'' అంటూ ఎలుగెత్తి పాతికేళ్ళు దాటింది. .
''నేను ఇక్కడి భూమిని /వందల ఏళ్ళ అనుబంధం నాది
ఈ పేరుతో నా సంభాషణ/ ఈ నేల అంతా పాతది
ఈ ప్రకృతిలో నేనూ ఒక భాగం
ఈ గాలి గుసగుసల్లో ఈ చెట్టూ చేమా పచ్చదనంలో
ఈ ఆకాశపు ఆత్మీయులతో
నేను ఓ భాగం నా ఉనికి ఇదే
నేనే ఈ భూమిని ఇక్కడి భూమిని! (నేను ఇక్కడి భూమిని - 2022) అంటూ పాతికేళ్ళు గడిచిపోయినా ఏమాత్రం తడబాటు లేని స్వరంతో వచ్చిన ఇవాళ్టి వారి కవిత్వం గొప్పగా ఉంది.
మొదటి కవితలో బొబ్బలెక్కిన అరికాళ్ళ మంటలతో, మొక్కవోని ధైర్యంతో, ఎర్ర సంతకమై కదిలిన రక్తం మెతుకులను ఆర్ద్రంగా పరామర్శిస్తారు కవయిత్రి.
''పండించిన గింజ మీద చెరిగిపోయిన సంతకం/ ఎవరు చెరిపేశారో, చెరిపేస్తున్నారో అందరికీ తెలుసు'' అంటూ నిక్కచ్చిగా ప్రకటించారు. నడుస్తున్న శవాల మధ్య దవాఖానలో ఒక రోజును గడిపిన వైనాన్ని, అక్కడ చావుకు ముందు ఖరీదైన దోపిడీని కళ్ళారా చూసిన దృశ్యాలను కళ్ళ ముందు నిలిపారు.
''నినాదాలన్నీ చరిత్రలైతే..
బేటీ బచావో, బేటీ పఢావో
అయేషా నుంచీ అసిఫా దాకా
సబ్ టీక్ హై .. అని ప్రశ్నిస్తోంది.
ఎవరీ లేలేత నవ్వుల మృదులలు? అమ్మా నాన్నల ఈ భవిష్యత్ విత్తనాల్ని ఇక్కడ దాచాలి? వావి వరుసలు మరిచిన మానవ మృగాల బారి నుండి ఈ లేలేత ప్రపంచాల్ని ఎక్కడ ఏ సొరంగాల్లో దాచాలి? పాలు తాగాల్సిన నోళ్ళు వీర్యాన్ని కక్కుతుంటే ఎక్కడికి పారిపోవాలి? ఈ వేదన ఒక్క ఈ కవయిత్రిదే కాదు; ఈ భూమ్మీద సకల తల్లుల వేదన. అమ్మ కడుపులోంచే ఆత్మహత్యలు మొదలౌతుంటే మనకు మనమే ఆయుధాలం, ఆత్మగౌరవ పతాకాలం కావాలి తప్పదంటారు కవయిత్రి. మన కళ్లెదుటే మనుషుల ముసుగులు జారిపోతున్నప్పుడు, ఆత్మలు విరుగుతున్న శబ్దాలను గుర్తుపట్టడమే జీవితమంటారు. వరవర రావు గురించి చెబుతూ.. అది సృజనకారుడి చూపుడు వేలుగా, రెపరెపలాడే జెండాగా అభివర్ణిస్తారు.
''ఆమె ఒక కొత్త దేహపటం, మిణుకు మిణుకుమంటున్న దీప స్తంభం, ఒక నిప్పుల కుంపటి, ఒక రక్త సిక్త నిఘంటువు. ఇప్పుడామె ఆడది కాదు మనిషి, ఇవాళ్టి మానవి'' అంటూ వర్తమాన మహిళకు ఒక వినూత్న నిర్వచనమిచ్చిన కవయిత్రి. ఇప్పుడు స్త్రీ అంటే కొలతల సమూహం కానే కాదు.. నిర్భయ సాధికారిక స్వరం.
''దేహానికి ప్రేమలేఖ కాదురా, దేశానికి రాయండి / అది మన ఉనికికే పోరాట మౌతుందం''టారు. నాన్న జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తడుముకున్నారు, తలపోసుకున్నారు. తన మనసు గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. ''నాన్న నాలోనే నాతోనే ఉన్నారు. నాన్నతో ఇలా అప్పుడప్పుడు సంభాషిస్తూనే ఉంటాను'' అంటూ 2008లో తన్ను వీడి వెళ్ళిపోయిన నాన్న పురిటిపాటి రామిరెడ్డి గారిని మళ్లీ మళ్లీ తలుచుకుంటూ ఆ జ్ఞాపకాలతో కళ్ళు తడిపేసుకుంటూ ఉంటారు కవయిత్రి.
ఓడిన ప్రతిసారీ కూడదీసుకుని బతకడం మన కలవాటే నంటారు. మనిషి ఏక వచనం కావచ్చు, మనిషితనం మాత్రం బహువచనమే అంటారు.
''శరీరమున్నది హింసకేనా?/ కులం ఉన్నది కూల్చడానికేనా?/ మతం ఉన్నది ముంచడానికేనా?/ ఈ భూస్థలమంతా రాలి పడుతున్న ప్రాణాల చప్పుడు.. / భయాన్ని జయించినప్పుడే / నిర్భయ జీవితం మిగులుతుంది.'' అని విస్పష్టంగా ప్రకటిస్తారు.
''మనది అనివార్య నిర్భంధ జీవనం/ స్వయం నిర్మిత జైలు గోడల మధ్యే ఉన్నాం/ మనమందరం ఇప్పుడు జైళ్లల్లోనే ఉన్నాం తాళాలు మన దగ్గరే ఉన్నా తీయలేం/ స్వయం నిర్మిత ఊచల మధ్య మనం, మన జీవితం.
ఇక్కడ స్త్రీని సింబాలిక్‌గా తీసుకొని నవ నవోన్మేష రూపిణీగా చిత్రించారని పిస్తోంది నాకు.
''ఆమె ఒక హిమాలయమై/ ఘనీభవించగలదు ద్రవించగలదు/ తాను గడ్డిపువ్వు కాదు/ సరసరసరమని కోసే మొగలి పువ్వు / ఆమె ఆత్మాభిమాన, ఆత్మవిశ్వాసాల / నిలువెత్తు ప్రేమమూర్తి / అమ్మ కడుపులో ఆదమరిచిన/ నిద్ర తరువాత శాశ్వత నిద్రలో/ దొరికే విశ్రాంతి మినహా .. కంటి నిండా, కడుపారా హాయిగా నిద్దురపోవాలని ఉన్న పసిపాప/ పసిపాపగా ఆమె తనకు పుట్టినప్పుడు తెలీదు నేనే ఇల్లయి పోతానని, తనది అనుకుంటున్న ఇల్లు తనది కాదని తర్వాతనే తెలిసింది.
నవ్వుతూ బతకాలని ఆమె కోరిక / ఆమె వెన్నొక వంచిన విల్లు / మోదుగు పూలే కంటి ఇల్లు/ ఒక్కొక్క నయా పైసా ముడు లేసి ఇంటిని భుజానమోస్తున్న ఆర్థిక మంత్రులు వాళ్ళు..
ఇలా నవ స్త్రీలను, నవ్య స్త్రీలుగా చెక్కిన కవితా శిల్పాలు ఈ కవితలు. ఇలా కవిత కవితని పరామర్శిస్తోంటే కొన్ని గరుకుగా, కొన్ని మార్ధవంగా, లాలిత్యంగా, మదు మధురంగా,ఆత్మ విశ్వాసంగా, సత్య సౌందర్యంగా మహిళల ప్రతిరూపాలుగా నాకు వారి ప్రతి భావన లోనూ, నాకు దర్శనమిచ్చారు. ఇలా సంపూర్ణ స్త్రీత్వాన్ని ఆవిష్కరించిన కవయిత్రిగా శిలాలోలిత గారిని మనః పూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కవిత్వంలో నిరాడంబరతను ప్రేమించే శిలాలోలిత ''నేను ఇక్కడి భూమిని'' అంటూ ఈసారి కాస్త స్వరం పెంచి కటువుగానూ మాట్లాడారు. ఏమైతేనేం, మంచి కవిత్వాన్ని చదివిన అనుభూతి కలిగించిన కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.
- డాక్టర్ రాధేయ
99851 71411