
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న హామీని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జిపిఎస్ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామంటూ తాజాగా ప్రకటించారు. సిపిఎస్ మాదిరిగానే జిపిఎస్ కూడా ఉద్యోగి కంట్రిబ్యూషన్ చెల్లించాల్సిందే కనక ఇది 'కొత్త సీసాలో పాత సారా' మాత్రమే ! జిపిఎస్ ప్రకారం చివరి బేసిక్ పేలో 33 శాతం గ్యారంటీడ్ పెన్షన్‌గా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి ప్రభుత్వోద్యోగి తన జీతంలో 10 శాతం కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి 14 శాతం చొప్పున గాని చెల్లిస్తే 40 శాతం పెన్షన్ గ్యారెంటీగా ఇస్తామని చెబుతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో ఎటువంటి కంట్రిబ్యూషన్ చెల్లించకుండానే చివరి వేతనంలో 50 శాతం వరకూ పెన్షన్ లభిస్తుంది. ఒపిఎస్‌లో రిటైర్ అయినా, మరణించినా మొత్తం గ్రాట్యూటీ చెల్లిస్తే, జిపిఎస్‌లో 37 శాతం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి, మిగిలిన 63 శాతం యాన్యుటీలు కొనుగోలు చేస్తారు. ఒపిఎస్‌లో కమ్యుటేషన్, ఫ్యామిలీ పెన్షన్, హెల్త్‌కార్డులు వస్తే, జిపిఎస్‌లో యాన్యుటీల ఎంపికను బట్టే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది.
నయా ఉదారవాద విధానాల అమలు పర్యవసానంగా ఉద్యోగుల పెన్షన్ హక్కు వారు తమ కష్టార్జితం నుంచి కొనుక్కునే సరుకుగా దిగజారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఈ విధానాలపై పెద్దఎత్తున పోరాడుతున్నారు. మనదేశంలో 1956లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్‌ను మొదట ప్రవేశపెట్టారు. ఉద్యోగులు తమ జీవితాల్లోని అతి ముఖ్యమైన కాలం ప్రభుత్వ సేవలకు అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాలు సవ్యంగా సాగిపోయేలా చూడటం తమ బాధ్యత అని అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తరువాత రాష్ట్రాలూ అదేబాటలో నడిచాయి. 1991 తర్వాత వచ్చిన నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన కాంగ్రెస్ పాలనలో అందుకు ప్రాతిపదిక ఏర్పడగా, వాజ్‌పారు నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2003లో సిపిఎస్‌ను తీసుకొచ్చింది. ఆ తరువాత వచ్చిన మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం దానిని కొనసాగించింది. మన రాష్ట్రంలో 2004లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలులోకి తీసుకొచ్చారు. ఈ విధానాలపై నాటి నుంచి ఉద్యోగులు పోరాడుతూనే ఉన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాజస్తాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ కింద కేంద్ర పిఎఫ్‌ఆర్‌డిఎకు చెల్లించిన మొత్తాన్ని తిరిగివ్వాలని కోరాయి. పంజాబ్ ప్రభుత్వం సిపిఎస్ స్థానే పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకసహా పలు రాష్ట్రాలు పాత పెన్షన్ వర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రప్రభుత్వాలు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టం ప్రకారం, పిఎఫ్‌ఆర్‌డిఎ నిబంధనలు 2015 ప్రకారం గాని ఒకసారి కేంద్రం వద్ద జమచేసిన పెన్షన్ నిధులను వెనక్కి ఇచ్చే అవకాశం ఏదీ లేదని పార్లమెంట్ సాక్షిగా గత ఏడాది కేంద్రం ప్రకటించింది. 2003లో సిపిఎస్‌ను తీసుకొచ్చిందీ, ఒకసారి ఆ స్కీమ్‌లో తలదూర్చాక మళ్లీ వెనక్కిపోలేని విధంగా నిబంధనలు 2015లో జారీ చేసిందీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలే. లక్షల కోట్ల ధనాన్ని స్టాక్ మార్కెట్‌లో జూదానికి వాడుకునేందుకు, బడా కార్పొరేట్లకు ఉద్యోగుల కష్టార్జితాన్ని సర్కారు దోచిపెడుతోంది. పెన్షన్ యజమాని ఇష్టాన్ని బట్టి ఇచ్చేది కాదని, దయాదాక్షిణ్యాలను బట్టి చేసే దానం కాదని, అది ఒక సామాజిక సంక్షేమ చర్య అని, వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకుండా వదిలేయబోమన్న హామీ మేరకే ఆ ఉద్యోగులు ఆ విధంగా సేవలందించారని సుప్రీంకోర్టు 1982లో తీర్పునిచ్చింది. కేంద్రం విధానాలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతుండగా, పూర్తి లొంగుబాటును ప్రదర్శిస్తూ, తూచా తప్పక అమలు చేస్తోన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దిగజారింది. 'సిపిఎస్' రద్దు చేసి, ఒపిఎస్‌ను తీసుకొస్తామన్న హామీని అమలు చేయాల్సిన జగన్ సర్కారు అందుకు భిన్నంగా 'జిపిఎస్'ను ముందుకుతేవడం సమంజసం కాదు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలి. అలా చేయని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం తమ హక్కుల సాధనకు, ప్రయోజనాల పరిరక్షణకు ఉద్యమించడం తప్ప వేరే మార్గం లేదు.