Aug 28,2023 00:06

ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) ఉమ్మడి జిల్లా జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.యర్రంరెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు కార్యాలయాలు, ఇళ్లల్లో కూడా అమర్చుకోవచ్చునని సంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) ఉమ్మడి జిల్లా జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.యర్రంరెడ్డి తెలిపారు. సాధారణ విద్యుత్‌ ఛార్జీల కంటే తక్కువ ధరలకు సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి కనెక్షన్లు తీసుకుంటే 30 ఏళ్లపాటు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు తెలియజేశారు.
ఇళ్లకు సోలార్‌ కనెక్షన్లు ఎలా పొందాలి?
పెద్ద నివాస భవనాలకు ఐదు కిలో వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు నెడ్‌ క్యాప్‌ సంస్థకు రూ.3.62 లక్షలు చెల్లించాలి. చిన్న నివాస భవనాలకు 3 కిలోవాట్ల ప్లాంట్‌కు రూ.2.29 లక్షలు చెల్లించాల్సి ఉంది. డిడి రూపంలో ఈ సొమ్ము చెల్లిస్తే ప్యానల్స్‌ను మేమే ఏర్పాటు చేస్తాం. సోలార్‌ కనెక్షన్లు ఇస్తామని కొంత మంది ప్రైవేటు వ్యాపారుల ముసుగులో మోసాలు కూడా చేస్తున్నారు. వీరి పట్ల అప్రమత్తతో ఉండాలి. విద్యుత్‌ ఛార్జీల భారం నుంచి ఉపశమనం పొందేందుకు సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవాలి.
ఏ తరగతుల వారికి సోలార్‌ కనెక్షన్లు ఉన్నాయి?
చాలా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుంటూరులో ఇప్పటికే ట్రాఫిక్‌ సిగల్స్‌కు, కలెక్టరేట్‌, నగరపాలక సంస్థ, ఇతర కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉన్నాయి. కలెక్టరేట్‌లో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లాంటు 80 కిలో వాట్ల సామర్ధ్యంతో ప్లాంటు పని చేస్తుంది. ఈ ప్లాంటు 30 ఏళ్లపాటు పనిచేస్తుంది. కొంతమంది వైద్యులు తమ ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంగంజాగర్లమూడి వద్ద కార్పొరేషన్‌ వాటర్‌వర్క్సుకు కూడా సోలార్‌ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికే కొంత మంది ఇళ్లకు కూడా సోలార్‌ కనెక్షన్లు తీసుకున్నారు.
సోలార్‌బల్బుల తయారీ ఇప్పుడు ఉందా?
ఎల్‌ఇడి బల్బులు తయారు చేస్తున్నారు. 2014 నుంచి 2018 మధ్య ప్రతి ఇంటికి ఎల్‌ఇడి బల్బులు పంపిణీ జరిగింది. ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్‌ సెంట్రల్‌ లైటింగ్‌కు అవసరమయ్యే బల్బులు మేమే సరఫరాచేశాం. బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి మున్సిపాల్టీలకు కూడా సోలార్‌ కనెక్షన్లుతోనే వీధి దీపాలు కూడా అమర్చాం.
బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయా?
పిడుగురాళ్ల మున్సిపాల్టీలో కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారు చేసే ప్లాంటు నెలకొల్పాం. 14 కిలోల సామర్ధ్యం కలిగిన 50 సిలిండర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం.
ప్లాంట్లు ఏర్పాటుకు తగినసిబ్బంది ఉన్నారా?
సోలార్‌ విద్యుత్‌, బయోగ్యాస్‌ ఉత్పత్తికి 1200 మంది నిరుద్యోగులకు 9 బ్యాచ్‌లలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల శిక్షణిచ్చాం. ఐటిఐ, ఎలక్ట్రి కల్‌ డిప్లొమా అర్హత కలిగిన వారు శిక్షణ పొందారు. వీరికి ప్రస్తుతం రూ.25వేల వరకు జీతం వస్తుంది.
విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ యూనిట్లు ఉన్నాయా?
జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఛార్జీంగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ఉంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలు కూడా వేగంగానే జరుగుతోంది.