ప్రజల పక్షం ఉన్న వారినే ఎన్నుకోండి : ప్రజా రక్షణభేరి బస్సు యాత్రలో వి.శ్రీనివాసరావు

- బిజెపికి జనసేన తాకట్టు
- పరస్పరం దూషణలకే వైసిపి, టిడిపి పరిమితం
- విజయవాడలో ముగిసిన యాత్ర
ప్రజాశక్తి- కృష్ణా, విజయవాడ ప్రతినిధులు : ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారినే ఎన్నుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని, జనసేన పార్టీని పవన్ కల్యాణ్ బిజెపికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పార్వతీపురం జిల్లా సీతంపేటలో గత నెల 30న ప్రారంభమైన సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర బుధవారం ఏలూరు మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో ముగిసింది. ఈ సందర్భంగా విజయవాడ, హనుమాన్ జంక్షన్, గన్నవరంల్లో జరిగిన సభల్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగానే భవిష్యత్తులో జనసేన పార్టీని పవన్ కల్యాణ్ బిజెపిలో విలీనం చేయడం ఖాయమన్నారు. 'రాష్ట్రానికి మోడీ ఒక వెన్నుపోటు పొడిస్తే, నీవు కూడా మరోపోటు పొడుద్దామని అనుకుంటున్నావా?' అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించాలని సవాల్ విసిరారు. బిజెపి రోడ్డు మ్యాప్‌లో చిక్కుకున్న పవన్ గురించి తెలుసుకోకుండా ఆయనే తమ బలం అంటూ టిడిపి నేతలు జబ్బలు చరుచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. వైసిపి, టిడిపి నేతలు ఒకరినొకరు తిట్టుకోవడానికే పరిమితమయ్యారని, అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. వ్యవసాయం చేస్తామన్న కుటుంబాలకు రెండెకరాల భూమి ఇస్తామనిగానీ, కార్మికులు, స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామనిగానీ వైసిపి, టిడిపిలు తమ మ్యానిఫెస్టోల్లో చెప్పడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన కోనేరు రంగారావు కమిటీ భూ పంపిణీపై చేసిన సిఫార్సులను వైసిపి ప్రభుత్వం ఎందుకు చెత్తబుట్టలో వేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో ప్రజలకు లక్షలాది రూపాయలు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి చెబుతున్నారని, అయితే, పన్నుల పేరుతో వారి జేబుల నుంచి లాగుతున్నది ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల మాదిరిగానే అంగన్‌వాడీ, ఆశా, తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ సీతంపేట మండలంలో ప్రారంభమై అల్లూరి సీతారామరాజు నడియాడిన నేలపై పర్యటన పూర్తి చేసుకుని పుచ్చలపల్లి సుందరయ్య నడియాడిన నేలమీదకు యాత్ర రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర మాట్లాడుతూ కేంద్రం సామాన్యులకు ఉపయోగపడే 500 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి డబ్బులున్న వారి కోసం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిందన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం.నాగమణి, రైతు సంఘం నాయకులు ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రైతుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని విమర్శించారు. ఈ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, సిపిఎం కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాల కార్యదర్శులు వై.నరసింహారావు, డివి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజారక్షణ భేరికి వినతులు
ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర బృందానికి హనుమాన్ జంక్షన్లో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ముఠా కార్మికులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అసైన్‌మెంట్ భూములకు హక్కులు కల్పించాలని ఎలుకపాడులో, తమ వేతనాల పెంపుదలకు కృషి చేయాలని పంచాయతీ వర్కర్లు గన్నవరంలో వినతిపత్రాలు అందించారు. యాత్ర బృందంపై ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతోపాటు మహిళలు పూలవర్షం కురిపించారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న వి.శ్రీనివాసరావు మూడు ప్రాంతాల్లో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్దకు యాత్ర బృందం చేసుకొనే సరికి భారీ వర్షం కురిసింది. అయినా, వెరవకుండా ప్రజలు యాత్రకు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా విజయవాడలోని లెనిన్ సెంటర్‌కు తోడ్కొని వచ్చారు.