
విజయ్, జలజ వసంత క్లినిక్‌కి వెళ్లేసరికి కుర్చీలన్నీ నిండిపోయి, కొందరు పేషెంట్లు నిలబడి కూడా ఉన్నారు.
'ఈరోజు కుదరదు సార్, రేపటికి అపాయింట్‌మెంట్ తీసుకోండి' అన్నాడు అటెండర్ దగ్గరికొచ్చి.
'మేడమ్ రమ్మన్నారయ్యా, ఇది చూపించు' అని విజిటింగ్ కార్డు తీసిచ్చాడు విజయ్.
అటెండర్ లోనికెళ్లొచ్చి 'లోపలున్న పేషెంటు వెళ్లగానే మిమ్మల్ని రమ్మన్నారు.. తలుపు దగ్గర నిల్చోండి' అన్నాడు.
కొద్దిసేపట్లోనే లోపలికెళ్లారు.
వసంత నవ్వుతూ 'రండి రండి! ఆదివారం ఇంటికొస్తే బాగుండేది, హడావుడి పడిపోతున్నావని క్లినిక్కి రమ్మన్నాను. చూశావుగా, ఎందరు వెయిటింగ్‌లో ఉన్నారో' అంది.
'తప్పలేదు' అన్నాడు విజయ్.
'కొన్నాళ్లుగా ఇద్దరికీ మనసు మనసులో లేదు. ఏం చేయాలో తోచని తరుణంలో సైకియాట్రిస్టుని కలిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడిక ఎవరో బయటి డాక్టరు కంటే నువ్వయితే మంచిదనిపించింది' అంది జలజ.
'ఎక్కువసేపు కూర్చుని నిన్ను ఇబ్బంది పెట్టం. సమస్య రెండు ముక్కల్లో చెప్తాను, ఒక చిన్న సలహా ఇస్తే..'
'సొల్యూషన్లేమైనా ఇన్‌స్టంట్ కాఫీనా క్షణాల్లో ఇవ్వడానికి?' అని నవ్వి 'చెప్పు చెప్పు.. ఏంటి సమస్య? కొంపతీసి మందు మానలేకపోతున్నావా, కౌన్సిలింగ్ కావాలా?' అంది.
'అలాంటి చెత్త అలవాట్లుంటే విడాకులిచ్చేస్తానని పెళ్లప్పుడే చెప్పింది.'
'ఓహో పెళ్లినాటి ప్రమాణాలా? ఇంతకీ విషయమేంటి?'
'వాణి రోజురోజుకీ నీరసంగా తయారవుతోంది. దేనిమీదా శ్రద్ధాసక్తుల్లేకుండా విరక్తిగా ఉంటోంది. సమస్య ఏమిటో చెప్పదు.'
'ఈ వయసులో ఇంకేముంటుంది, లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు.'
'మనమ్మాయని చెప్పడం కాదుగానీ వసంతా! మగపిల్లలతో రాసుకుపూసుకు తిరగదు, పొందిగ్గా ఉంటుంది.'
'ఇలాంటివాళ్లే మరీ డేంజర్. పీకల్లోతు ప్రేమించేస్తారు.'
'సరే, ఒకవేళ ఇష్టపడిందే అనుకుందాం! వాడెవడో చెప్పి అఘోరిస్తే తగినవాడో కాదో చూస్తాంగా!'
'పరువు హత్యల గురించి పేపర్లలో చదివి భయపడిందేమో!' నవ్వింది వసంత.
'చాలా బాధేస్తోంది, చిరాకేస్తోంది. ఏం చేయాలో తోచక అయోమయంగా ఉంది.'
'వాణిని తీసుకురావాల్సింది, తనతో మాట్లాడకుండా నేనేం చెప్పగలను?'
'కానీ, సైకియాట్రిస్టు పేరెత్తితే 'నేనేం పిచ్చిదాన్నా?' అని ఏడవదూ?!'
'చదువుకుందిగా! బైపోలార్ డిసీజ్‌లూ, పార్కిన్‌సన్‌లే కాదు, స్ట్రెస్సు, లాక్ ఆఫ్ కాన్‌సన్‌ట్రేషన్, ఇంబాలెన్సింగ్, ఫోబియాల్లాంటి చిన్నచిన్న ఇబ్బందులక్కూడా మమ్మల్ని సంప్రదిస్తారని తనకి తెలీదా ఏంటి?'
'నిజమే కానీ, అది చాలా సెన్సిటివ్. లేకపోతే నేనే గద్దించేవాణ్ణి! ఈ తరం పిల్లల గురించి నీకు చెప్పాల్సిందేముంది? మార్కులు తగ్గాయని కోప్పడినా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొబైల్ కొనివ్వలేదని అలిగి ఇంట్లోంచి వెళ్లిపోవడం, తమ్ముడంటేనే ఎక్కువిష్టమని తిండిమానేసి భీష్మించుక్కూర్చోవడం లాంటివి ఎన్ని చూడటంలేదు?!'
'పోనీ, క్లినిక్కి కాకుండా ఇంటికి తీసుకురండి!'
'అలా అయినా గ్రహిస్తుంది. నువ్వే వీలుచేసుకుని ఇంటికి రావాలి.'
'ఒకసారయితే వస్తాను, కానీ తర్వాతయినా..!'
'అప్పటి సంగతి చూద్దాం! ఆదివారం భోజనానికి వచ్చేయండి! కారు పంపిస్తాను, మీ ఆయన్ని తీసుకుని రా!' అన్నాడు విజరు.
'నువ్వెందుకు కారు పంపడం, మేమొస్తాంలే!' అంది వసంత.
'ప్లీజ్ వసంతా! వాణిని నువ్వే బాగుచేయాలి!' అని లేచింది జలజ, భర్తతోపాటు.
వసంత, రాఘవలను చూసి విజరు తల్లిదండ్రులు 'ఎన్నాళ్లకొచ్చారు?!' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.
యాంత్రికత్వంలో పడి, కలుసుకోవడం తగ్గిందంటూ వాళ్లూ నొచ్చుకున్నారు.
విజరు కొడుకు వరుణ్ కలుపుగోలుగా ఉన్నాడు.
దిగులుగా కనిపించిన వాణిని చూసి 'వాట్ ప్రిన్సెస్! నువ్వేం మాట్లాడవా?' అంటూ దగ్గరికెళ్లింది వసంత.
వాణి నవ్వింది. కానీ అందులో కళాకాంతీ లేదు. అదేం పట్టించుకోనట్టు 'నువ్వు సీఏలో చేరావని విన్నాను, ఎంతవరకొచ్చింది?' అంది.
'లాస్ట్ సెమిస్టర్ ఉందాంటీ!'
'అదెంత?! చిటికెలో అయిపోతుంది! అంకులూ నేనూ కలిసి నీకు బోల్డంతమంది కస్టమర్లను అప్పజెప్తాంలే!'
మళ్లీ అదే పేలవమైన నవ్వు.
'సరేగానీ, నేనీమధ్య గార్డెనింగ్ మొదలెట్టాను.. చాలా మొక్కలు కొంటున్నాను, సేకరిస్తున్నాను. మీ పెరట్లో ఏమున్నాయో చూపించు' అంటూ వసంత బయటకు నడుస్తోంటే.. వాణి అనుసరించింది.
'అదేం చెట్టు, ఇదేం మొక్క? అదెప్పుడు పూలు పూస్తుంది, ఇదెన్ని కాయలు కాస్తుంది' లాంటి చొప్పదంటు ప్రశ్నలడుగుతూనే మధ్యలో వాణి కాలేజీ విషయాలన్నీ కూపీ లాగింది. వసంత మాట్లాడిందంటే గూఢచారులయినా నోరు విప్పాల్సిందే! ఎలాగోలా కొంత సమాచారం రాబట్టింది. వసంత ఊహించినట్టు ప్రేమవైఫల్యమే కారణమని తేలింది. కానీ పూర్తి వివరాలు తెలిస్తేనేగానీ పరిష్కరించలేదు.
జలజ ఏమీ తెలీనట్టు వచ్చి 'కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చులే, ముందు తినడానికి రండి!' అంది.
భోజనాలయ్యాక 'నేను టెర్రస్ గార్డెన్ పెంచే పనిమీదున్నాను, వాణీ రామ్మా, నాకు కొమ్మలూ విత్తనాలూ ఇద్దుగాని' అంటూ వాణిని తీసుకుని వెళ్లింది.
గన్నేరు, మందార ముదురు కొమ్మలు తెంపబోతే నార సాగుతున్నాయి.
'ప్రేమ కబుర్లు చెప్తూ వెంటపడి వేధించే జులాయిలు కూడా ఇంతే, ఒకపట్టాన వదిలిపెట్టరు. ఇప్పుడు చెప్పరా తల్లీ, నిన్ను విసిగిస్తున్న రోమియో ఎవరు? ఏసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడా ఏంటి?' అంది.
వాణి ఆశ్చర్యంగా చూసింది.
'చూడూ, దిగులుపడుతూ కూర్చుంటే సమస్యలు తీరవు. అంకుల్ డీజీపీ అని మర్చిపోయావా? వాడెవరో చెప్పు! ఇక జన్మలో ఏ ఆడపిల్లనీ కన్నెత్తి చూడడు.'
వాణి అలా చూస్తుండిపోయింది.
'కొన్ని విషయాలు అమ్మానాన్నలతో చెప్పలేకపోవచ్చు. కానీ నాతో చెప్పడానికేం?'
ఆమెకి దు:ఖం ఆగలేదు.
'అబ్బా ఈ కొమ్మలు తెగడంలేదు, తర్వాత నాన్నతో తెంపించుకోవచ్చు గానీ, కాసేపు డాబామీదికి వెళ్దాం పద' అంటూ వాణి చేయందుకుని పైకి తీసికెళ్లింది వసంత.
డాబా మీద బోల్డన్ని మొక్కలున్నాయి. విశాలంగా ఉన్న మెట్లగదిలో ఫోల్డబుల్ కుర్చీలూ మంచాలూ ఉన్నాయి. డిసెంబరు నెల కనుక ఎక్కడా ఎండపొడ లేకుండా వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పిట్టగోడకు దగ్గరగా రెండు కుర్చీలు వాల్చింది వాణి. ఇద్దరూ కూర్చున్నారు.
'ఇంతకీ నిన్నింతగా బాధపెట్టిన శాల్తీ ఎవరు? క్లాస్‌మేటా?'
అవునన్నట్లు తల పంకించింది.
'నువ్వు ఒక్కో మాట చెప్పడానికి మీనమేషాల్లెక్కపెట్టావనుకో.. మనిద్దరం ఏమైపోయామోనని అంతా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారిక్కడికి.. అప్పుడిక ప్రైవసీ లేదూ పిప్పర్‌మెంటూ లేదు.. నాతో చెబితే నీ దిగులూ దు:ఖాల్ని క్షణంలో దులిపి చెత్తబుట్టలో గుమ్మరించేస్తా! ఆనక నీ ఇష్టం, చెప్పాలనిపిస్తే చెప్పు లేదంటే ఆ టన్నుడు చెత్తనీ చచ్చినట్టు మోస్తూ ఇలాగే ఈసురోమంటూ గడుపు' అంది.
'చెప్తానాంటీ, నాక్కూడా విరక్తిగా ఉంది. ఏం చేయాలో తెలీక పిచ్చెక్కిపోతోంది. బాధ భరించలేక చచ్చిపోతున్నాను. వాడి పేరు సాగర్. ఒకే క్లాసులో ఉన్నా ఫస్టియర్‌లో వాడి ముఖం కూడా చూసిన గుర్తులేదు. రెండో సంవత్సరంలో పరిచయం చేసుకున్నాడు. ఇక అక్కణ్ణించీ ఏదో వంకన మాట్లాడేవాడు. పక్కపక్కనే తిరిగేవాడు. పొద్దునపూట నా రాకకోసం మాటువేసి ఉండటం, నన్ను చూడగానే కళ్లు మెరవడం, ఎప్పుడూ నన్నే గమనించడం, లైబ్రరీకెళ్లినా అనుసరించడం.. ఇవన్నీ అతనికి నాపట్ల ఉండే ప్రేమని చాటేవి. అతడి మాటలూ చేతలూ ప్రేమలో ముంచి, ఇష్టంలో నానబెట్టి, ఆరాధనలో వేయించినట్టుండేవి.'
'వామ్మో, కవిత్వం కూడానా? ఇంతకీ చదువులో చురుకేనా?'
'అన్నీ బ్యాక్‌లాగ్సే!'
'అంత మొద్దుమొహం గురించి ఇంత చింతనా? అందుకే లవ్ ఈజ్ బ్లైండ్ అనేది.'
'నేనంటే పిచ్చిప్రేమని చెప్పేవాడు. కాదంటే హుస్సేన్‌సాగర్‌లో దూకుతాననేవాడు.'
'దూకమనాల్సింది, ఎలాగూ ప్యూరిఫై చేస్తున్నారు, దాంతోబాటు ఈ చెత్తా కొట్టుకుపోయేది.'
'అంత భక్తి చూపిస్తుంటే ఎగతాళి చేయగలనా?'
'కూసిని సినిమా డైలాగులు వల్లిస్తే పడిపోవడమేనా? సరే, తర్వాతేమైంది? వ్యసనాలున్నాయా?'
'అది తెలీదుగానీ, అమ్మాయిల పిచ్చి జాస్తి!'
'ఎవరైనా చెప్పారా?'
'ఎవరో చెప్తే నమ్మకపోదును, ప్రత్యక్షంగా చూస్తుంటా! ఫ్రీలవ్ లాంటి వికారమైన మాటలు పుస్తకాల్లో చూస్తేనే అసహ్యమేస్తుంది. అలాంటిది వాడిని ప్రత్యక్షంగా చూస్తోంటే జుగుప్స.. చంపాలా, పాతేయాలా అన్నంత కసి..'
'నీది ఒకవేళ అనుమానమేమో?!'
'లేదాంటీ, నా చెవులతో విన్నాను. నాతో మాట్లాడినట్లే వేరే వాళ్లతోనూ మాట్లాడ్తాడు.. చూస్తే అసహ్యమేస్తుంది. ఒకేసారి చాలామందితో ప్రేమలూ వ్యామోహాలూ ఉంటాయా? కుక్కలు కూడా అంత వికారంగా ఉండవేమో! పోనీ ఒకళ్లు చచ్చిపోతేనో, ఏదో పేచీ వచ్చి బ్రేకప్ అయితేనో..'
'అలా అయితే మాత్రం అంత క్షణాల్లో మనసు మారిపోతుందా?'
'అందుకే ఆంటీ, భరించలేకపోతున్నా. వాణ్ణి చూస్తేనే కంపరమేస్తోంది.'
'ఒకవేళ కలుపుగోలు తత్వమేమో!'
'వాడలాగే వాదిస్తాడు. పైగా నువ్వు మాట్లాడవా? పరపురుషులంటూ పారిపోతావా అంటూ వితండవాదాలు చేస్తాడు. ఇదెంత అరాచకం? కష్టపడి ఆర్జించేదీ.. దుర్మార్గంగా, దౌర్జన్యంగా సంపాదించేదీ ఒకటా? ఏదైనా డబ్బేగా అంటాడు. నేను క్లాస్‌మేట్సే కాదు సీనియర్లతోనూ బ్రహ్మాండంగా మాట్లాడ్తాను. కానీ ఎక్కడా వెకిలితనం ఉండదు, ఎవ్వరూ హద్దులు దాటరు. నా మాటతీరు కానీ, డ్రెసింగ్ స్టయిల్ కానీ వాళ్లకా అవకాశం ఇవ్వదు.'
'అతనూ అలాగే అనుకుంటున్నాడేమో!'
'అంత నీతీ నిజాయితీ ఉంటే నాకింత క్షోభ ఎందుకు? అందర్నీ ఆబగా చూస్తాడు. ఐ లవ్‌యూ, ఐ మిస్‌యూ డైలాగులు వదుల్తాడు. ఆడకోతికైనా ఎట్రాక్టయిపోతాడు! ఆ కళ్లలోంచి కాముకత్వం కారిపోతుంటే, గుండెల్లోంచి పైత్యం తన్నుకొస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నా!'
'అంత చవకబారు వాడని తెలిశాక ఇక అతడి గురించి ఆలోచనెందుకు?'
'మనసు కాగితం కాదుగా ఆంటీ, రాసిందంతా గబుక్కున చెరిపేయడానికి!'
'ఈ రాయడాలూ, తుడవడాలూ కష్టమనే కంప్యూటర్లు కనిపెట్టారు. ఆ పిచ్చిప్రేమ ప్రోగ్రామ్‌ని డిలీట్ చేసి పారేరు!'
'అది సాధ్యంకాకనే ఈ బాధ!'
'చూడు వాణీ! ఆ బడుద్ధాయికి నీకంటే సుందరాంగులు కనిపించక నీ చుట్టూ తిరిగాడు. ఈ వ్యవహారం ఇంకొంత ముందుకు పాకి పెళ్లయ్యిందనుకుందాం! తీరా అప్పుడు పక్కింట్లోనో వెనకింట్లోనో ఆఫీసులోనో షాపింగ్‌మాల్‌లోనో అందగత్తెలెదురై అప్పుడు వేషాలేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు! తోడూనీడగా ఉండాల్సినవాడు వెర్రి తిరుగుళ్లు తిరిగితే..'
'అమ్మో! మాటవరసక్కూడా అలా అనొద్దు ఆంటీ! కొండల మీంచి లోయల్లోపడి దిక్కూమొక్కూ లేకుండా అల్లాడేదాన్ని.'
'కదా?! కథ అంతదూరం వెళ్లకుండా మొదట్లోనే తెలిసిపోవడం ఎంత అదృష్టం?! లేనిపోని భ్రమల్లో పడి కొట్టుకుపోకుండా ముందే నీ కళ్లు తెరుచుకుని వాడి విశ్వరూపం అర్థం కావడం మంచిదైంది!'
'నిజమే ఆంటీ! కానీ, నన్నింత ప్రలోభపెట్టాడు, మోసం చేశాడూ అనేది జీర్ణించుకోలేకపోతున్నాను. ఆశల ఆకాశాల్లోకి ఎత్తేసి, అక్కణ్ణించి తోసేశాడు. నేనంటే ఇష్టమని డ్రామాలాడినవాడు ఇతర్లతోనూ అలాగే ఉంటే చూడలేకపోతున్నా.'
'మళ్లీ మళ్లీ అదే మాటనకు! నిన్ను మాత్రమే ప్రేమించేవాడూ పూజించేవాడు నీకు దూరమైతే, అతడికోసం నువ్వు బాధపడినా అర్థముంది. ప్రతి ఆడపిల్ల కోసమూ వెంపర్లాడే ఒక నీతిలేని వాడికోసం ఇంత దు:ఖమేంటి? వాడొక ఈగ అనుకో! '
'ఈగను ఎంత బాగా చూపారాంటీ సినిమాలో?! చచ్చిపోయి కూడా ఆమెకోసం తపిస్తాడు!'
'వాటికేమొచ్చెలే, ఎన్ని భ్రమలైనా కల్పించొచ్చు, వికారాల్ని, విస్ఫోటనాల్ని కూడా అందంగా అద్భుతంగా చూపొచ్చు. అసలు పునర్జన్మలు ఉంటాయా? ఈగలూ బొద్దింకలుగా పుడితే దగ్గరకు తీసుకుని ముద్దెట్టుకుంటామా? అసహ్యమేయదూ?!'
వాణి అంత దు:ఖంలోనూ ఆ మాటకు నవ్వకుండా ఉండలేకపోయింది.
'చూడు వాణీ, వాడు మాయమాటలు చెప్పాడే అనుకో.. అది గ్రహించకపోవడం నీ తెలివితక్కువతనం కాదా?!'
వాణి అయోమయంగా చూసింది.
'ఒక కుందేలునో, రామచిలకనో చూసి ముచ్చటపడ్డావంటే అర్థముంది. ఈగను చూసి కూడా మురిసిపోయావంటే తప్పు నీదే! మనింటిని ఎంత డెట్టాలేసి తుడిచినా ఒక్కోసారి ఇలాంటి జీవాలొస్తాయి కాదనను. కానీ అదేదో అపురూపమైన జీవి నీకోసం వచ్చిందని మురిసిముక్కలై, మరెక్కడికో పోతోందని బాధపడ్డానికి సిగ్గులేదూ? వాడొక హీనుడని అర్థమయ్యాక్కూడా ఏడిస్తే నీకు ఆత్మవిశ్వాసమే కాదు, ఆత్మాభిమానం కూడా లేనట్టే! నిన్నెవరు కాపాడగలరు?'
'మీ సైకియాట్రిస్టులున్నారుగా ఆంటీ!'
'హమ్మయ్య దార్లోకి వచ్చావు.. కనుక విధి, కర్మ లాంటి చెత్త ఆలోచన్లు మానేసి ఎంచక్కా వాస్తవంలోకి రా! నీక్కొంచెం టెక్నికల్‌గా కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఇంకెప్పుడన్నా వాడు కనిపిస్తే ఇంత హీనుడికోసమా నేను బాధపడింది అని నవ్వుకుంటావే తప్ప చెత్తగా కన్నీళ్లు కార్చవు!' అంటూ నవ్వింది.
'వాడు తనెంత హీనంగా ఉన్నాడో గ్రహించకపోగా ''ఇప్పుడే ఇంత పొజెస్సీవ్‌గా ఉన్నావు, పొరపాటున పెళ్లయితే నా జీవితం నాశనమయ్యేది!'' అంటూ ఎదురుదాడి చేశాడాంటీ.'
'పిచ్చిపిల్లా! ఆ దౌర్భాగ్యుడికి అంత అవకాశం ఇవ్వడం నీదే తప్పు. వాడొక పురుగుతో సమానం. ఆ అల్పుడి గురించి బుర్ర పాడుచేసుకుంటారా? ఛీత్కరించుకుని క్షణంలో విదిలించి పారేయక.. నీమీద కామెంట్ చేసేంత అవకాశమెందుకిచ్చావు?'
'నిజమే ఆంటీ, వాడెంత హీనుడో ఇప్పుడే తెలియడం మంచిదే.. కానీ, నా ఎదురుగా వేషాలేస్తోంటే చీదరేస్తోంది!'
'ప్చ్.. ఇంతచెప్పినా నీకర్థంకాలేదా? ఒక గొంగళిపురుగు ఎవరిమీదో పాకిందని ఈర్ష్య పడతావా?'
'అలా కాదాంటీ..!'
'చుప్! వారు ముడు! ఆ ఈగ గురించి ఇంకా మాట్లాడావంటే, నిన్ను ఎడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ మొదలెడ్తా జాగ్రత్త!'
'ఒద్దొద్దు.. అంత మాటనొద్దు ఆంటీ!'
'సరే అయితే ఇవాళ్టికి ఈ డోసేజ్ చాలు గానీ వెళ్దాం పద''
'ఆ క్రీచర్ గురించి అస్సలు ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలాంటీ?' మెల్లగా అడిగింది వాణి.
'నీ చదువు మీద, నీకు ఇష్టమైన వ్యాపకాల మీద కాన్‌సన్‌ట్రేట్ చెయ్యి. మంచి పుస్తకాలు చదువు, సోషల్ సర్వీస్ చెయ్యి. ఈ మొక్కలక్కాసిని నీళ్లు పొయ్యి. నీ కుక్కపిల్లతో ఆడుకో! చెయ్యాలంటే ఎన్ని పనుల్లేవు? ఇన్ని వ్యాపకాలున్నా ఏదో మూల వాడి గురించి ఆలోచన వస్తే.. దిగులుగా అనిపిస్తే నా దగ్గరికి రా.. రెండు సిట్టింగులతో నిన్నెంత మార్చేస్తానో చూడు!' నవ్వింది వసంత.
'థాంక్యూ ఆంటీ!' అంటూ వసంత చేతులను ప్రేమగా అందుకుంది వాణి.
పుష్పలీల
9490099006