Nov 17,2023 11:05
  • ఐఅండ్‌పిఆర్‌ కమిషనర్‌కు ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నేతల వినతి

ప్రజాశక్తి - విజయవాడ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జిఒకు సవరణలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) ఆధ్వర్యాన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానించి జిఒ జారీ చేయడం పట్ల ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.కలిమిశ్రీ, ఎం.బి.నాథన్‌ కమిషనర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం జారీ చేసిన జిఒలో నిబంధనలను సవరించాలని కోరారు. అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భార్య/భర్తకు ఇంటి స్థలం ఉన్నా, గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉన్నా ప్రస్తుతం ఇవ్వకూడదన్న నిబంధన ఎత్తేయాలని కోరారు. స్థలం ఖరీదులో 60/40 రేషియోను సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించాలని, ఆ స్థలంలో నిర్మాణం చేపట్టే వారికి రుణ సదుపాయం కల్పించాలని కోరారు. 1/70 చట్టం కారణంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర జర్నలిస్టులు స్థానికంగా ఇంటి స్థలం పొందే అవకాశం లేకుండా పోతుందని, వారికి సమీపంలోని మైదాన ప్రాంతంలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.