హెరాత్ : పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 15మంది మరణించగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడడం, కూలిపోయిన భవనాల కింద బాధితులు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయవ్యంగా 40కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వుందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత ఏడుసార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయని, వాటి తీవ్రత 4.6, 6.3 మధ్య వున్నాయని తెలిపింది. ఉదయం 11గంటల సమయంలో నగరంలోని భవనాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు పరుగులు తీశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. పరిస్థితి చాలా భయంకరంగా వుందని స్థానికులు తెలిపారు. పిల్లలతో బయటకు వచ్చి వీధుల్లో నిలబడ్డామని తెలిపారు. మూడు ప్రావిన్స్‌ల్లో ఈ ప్రకంపంనలు సంభవించాయని, 15మంది మరణించగా దాదాపు 40మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ప్రతినిధి జాన్ సయేక్ ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు.