Oct 31,2023 17:35

ప్రజాశక్తి -కలక్టరేట్‌ (కృష్ణా): రాబోయే వేసవిలో జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే వేసవి నాటికి చెరువులను, పైపులైన్‌, చేతిపంపుల మరమ్మతులు పూర్తిచేయాలని చెప్పారు. సమగ్ర మంచినీటి రక్షిత పథకం, మంచినీటి రక్షిత పథకం ద్వారా తాగునీరు అందించడంలో తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలోని పంచాయితీ చెరువులను జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నింపే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. గతంలోని నీటి సమస్యలను దఅష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. గ్రామాలలో త్రాగునీటిని శుద్ధి చేసే ఫిల్టర్‌ బెడ్స్‌ ను గుర్తించి రీప్లేస్‌ చేయాలని, అందుకు నాణ్యమైన ఇసుకను ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఫిల్టర్‌ బెడ్స్‌ ను క్లీన్‌ చేయడానికి ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. నీటిని పంపింగ్‌ చేయడానికి ఉపయోగించే విద్యుత్‌ మోటార్లకు ప్రత్యామ్నాయంగా మరొక మోటారు కొనుగోళ్లకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.గతంలో అవనిగడ్డలోని ఒక చెరువులో మనిషి చనిపోయాడన్న కారణంగా, ఆ గ్రామ ప్రజలు చెరువు నీటిని ఉపయోగించడం మానేశారని అధికారులు కలెక్టర్‌ దఅష్టికి తీసుకువచ్చారు. అయితే ఆ చెరువులోని నీటిని పూర్తిగా బయటకు తోడేసి చెరువును ఎండగట్టాలని, కొత్త నీరును నింపి చెరువు నీటిని ఉపయోగించుకునే విధంగా గ్రామస్తులను సంసిద్ధం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ ఈ, రమణ, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.