నియామె : నైజర్ మిలటరీలోని వివిధ వర్గాలు ఆధిపత్యం కోసం గత కొద్దిరోజులుగా ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితుల్ని పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ గ్రూపు ఎకొవాస్ తీవ్రంగా ఖండించింది. ఆదివారం 15 పశ్చిమాఫ్రికా దేశాల గ్రూపు అత్యవసర సమావేశం జరిగింది. నైజర్‌లో జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న సైనిక నాయకులపై ఆంక్షలు విధించేందుకు ఎకోవాస్ అంగీకరించింది. ఈ సందర్భంగా నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు మాట్లాడుతూ... 'ఎకోవాస్ యొక్క అథారిటీ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఛైర్మన్ ఈ తిరుగుబాటును ఖండించారు. రాజ్యాంగం కూడా ఈ సైనిక తిరుగుబాటును తిరస్కరించింది. ఈ క్రమంలో పరిస్థితులు సద్దుమణిగి నిలకడగా ఉంచేందుకు, అక్కడ పురోగతిని పెంపొందించడం ఆఫ్రికన్ నేతలుగా మా బాధ్యత. ఈ తిరుగుబాటును నివారించడానికి సహకార ప్రయత్నాలను ఎకోవాస్ సమర్థిస్తుంది' అని ఆయన అన్నారు.
కాగా, నైజర్‌లోని మిలటరీ జుంటా ఒక వారంలో తన అధ్యక్ష పదవిని వదులుకోవాలని, ఆ దేశం ఎన్నుకోబడిన అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను వెంటనే విడుదల చేసి తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని ఎకోవాస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దేశంలో తిరుగుబాటు నేపథ్యంలో రాజ్యాంగం రద్దు చేయబడింది. తిరిగి రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలను ఎకోవాస్ చేపట్టనున్నదని ప్రకటన వెల్లడించింది. అలాగే తిరుగుబాటులో పాల్గొన్న నైజర్ సైనిక నాయకులపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షల్ని విధించేందుకు ఎకోవాస్ నాయకులు అంగీకరించారు. ఎకోవాస్ దేశాల్లోని కేంద్ర, వాణిజ్య బ్యాంకుల్లో నైజర్ ఆస్తులను స్తంభింపజేయాలని కూడా ఎకోవాస్ నాయకులు నిర్ణయించారు. నైజర్ సైనిక బృందం బుధవారం రాత్రి దేశంలో తిరుగుబాటును ప్రకటించింది. రాజ్యాంగాన్ని నిలిపివేస్తున్నట్లు, కర్ఫ్యూ విధిస్తున్నట్లు, అంతర్జాతీయ సరిహద్దుతను మూసివేస్తున్నట్లు సైనిక బృందం టెవిజన్‌లో ప్రకటించింది.