
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన గొప్పలను ప్రచారం చేసుకునేందుకు ఉద్దేశించిన 'వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్ర'కు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ ఈ యాత్రను నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లో యాత్ర చేపట్టరాదని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. యాత్ర ప్రయాణానికి వినియోగించే వాహనాలను రథాలుగా పిలవడాన్ని కూడా ఎన్నికల సంఘం తప్పుబట్టింది. దీంతో రథాలుగా పిలవడాన్ని విరమించుకుంటున్నట్లు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అధికారుల పేరును జిల్లా 'రథప్రభరిమార్' నుంచి నోడల్ అధికారిగా మార్చారు. నవంబరు 20 నుంచి జనవరి 25 వరకు జరిగే యాత్రలో కేంద్ర ఉద్యోగులను చేర్చుకోవాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ అధికారులను జిల్లా రథసారథులుగా నియమించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహించాయి. దీంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.