Oct 01,2023 07:04

యు.టి.ఎఫ్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని, సామాజిక దృక్పథం కలిగి ఉంటామని, ఎన్‌.ఇ.పి-2020ని వ్యతిరేకిస్తామని, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాలు బలపరుస్తామని, ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడు కుంటామని, ఒ.పి.ఎస్‌ పునరుద్ధరణకు కృషి చేస్తామని, అందరికి సమానమైన విద్య, నాణ్యమైన విద్య అందేలా పోరాడతామని ప్రతిన పూనవలసి ఉన్నది.

           ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యు.టి.ఎఫ్‌) స్వర్ణోత్సవ సంబరాలు అక్టోబరు 1న విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. 2024 ఆగస్టు 10 వరకు ఈ సంబరాలు కొనసాగుతాయి. 1974 ఆగస్టు 10న కొన్ని చారిత్రక పరిస్థితులలో ఏర్పడిన యు.టి.ఎఫ్‌ గత 50 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోను అగ్రగామి ఉపాధ్యాయ సంఘంగా ఎదిగి సమరశీల పోరాటాలు నిర్వహించింది. ఉపాధ్యాయ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకట స్వామి, మైనేని వెంకటరత్నం, దాచూరి రామిరెడ్డి, సూర్యనారాయణరాజు వంటి వందలాది మంది నాయకుల కృషి, త్యాగాల ఫలితంగా ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానంలో యు.టి.ఎఫ్‌ అప్రతిహతంగా కొనసాగుతున్నది. అధ్యయనం -అధ్యాపకం-సామాజిక స్పృహ నినాదాలతో ఉపాధ్యాయులను నిరంతం చైతన్యపరుస్తూ కొనసాగుతున్నది. అందరికీ విద్య, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం మొదలగు లక్ష్యాలతో యు.టి.ఎఫ్‌ ముందుకి కొనసాగుతున్నది.
 

                                                                              ప్రభుత్వ విద్యారంగం

భారత రాజ్యాంగం అందరికి విద్య, అందరికి చదువుకునే అవకాశం కల్పించాలని నిర్దేశించినది. రాజ్యాంగంలో 14 సంవత్సరాలలోపు బాల, బాలికలందరికి ఉచిత, నిర్బంధ విద్య కల్పించాలని చెప్పింది. 24వ నిబంధన బాలకార్మిక వ్యవ్యస్థ ఉండరాదని పేర్కొన్నది. 29వ నిబంధన అల్ప సంఖ్యాక వర్గాలు భాష, లిపి సంస్కృతి, విద్య అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు, సంస్థలు ఉండాలని చెప్పింది. కొఠారి కమిషన్‌ విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పటమేకాక కామన్‌ స్కూల్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. ఉన్నికృష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, మోహిన్‌ జైన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులలో సుప్రీంకోర్టు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలని చెప్పింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధన రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. దీనిని అమలు చేయడానికి 2009లో జాతీయ విద్యా హక్కు చట్టం రూపొందించగా, 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుంచి 1990 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను తమ బాధ్యతగా స్వీకరించాయి. సమాజంలో పేదలు, అణచివేతకు గురైన వర్గాలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది.
 

                                                                   ఆర్థిక సంస్కరణలు - ప్రైవేటీకరణ

1991లో భారతదేశంలో ప్రారంభించిన ఆర్థిక సంస్కర ణలు-సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై కూడా పడింది. గత మూడు దశాబ్దాలుగా దేశం ఉన్నత, పాఠశాల విద్యా రంగాలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చెందటం ప్రారంభమైంది. విద్యను 'పబ్లిక్‌ గూడ్‌'గా కూకుండా 'ప్రైవేట్‌ గూడ్‌'గా చూడడం ప్రారంభ మైనది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో పోకడలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం లో పెద్దఎత్తున ప్రైవేటీకరణ చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతం పాఠశాల విద్యలో 74 లక్షల మంది పిల్లలు చదువుతుంటే వీరిలో దాదాపు 34 లక్షల మంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్నారు.
             ఇంటర్మీడియట్‌ విద్య 90 శాతం కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఉన్నత విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ యూనివర్శిటీలు, బ్రౌన్‌ఫీల్డ్‌ యూనివర్శిటీల పేరుతో ప్రేవేట్‌ యూనివర్శిటీలను స్థాపిస్తున్నారు. ప్రేవేటీకరణ, కార్పొరేటీకరణ వలన విద్యారంగంలో సామాజిక న్యాయం లోపించటమేకాక, తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయి. విద్యారంగంలో రెండు సమాంతర వ్యవస్థలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవటానికి యు.టి.ఎఫ్‌ ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతిన పూనుతుంది.
 

                                                                          ఎన్‌.ఇ.పి 2020

నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రాలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా జాతీయ విద్యా విధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. ఈ విద్యావిధానంలో జాతీయ రాజ్యాంగ లక్ష్యాలైన సమాఖ్య విధానం, లౌకిక విధానం, సామాజిక న్యాయం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మొదలగు వాటి గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా విద్యా వ్యాపారానికి ఎన్‌.ఇ.పి-2020 తెరతీస్తుంది. విద్యారంగంలో నాణ్యత, ఉపాధి కల్పనకు నైపుణ్యాలు పెంచటమే ప్రధాన లక్ష్యాలుగా ఎన్‌.ఇ.పి-2020 పేర్కొనటం మార్కెట్‌ విధానాలకు మాత్రమే అనుగుణంగా ఉన్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976లో ఉమ్మడి జాబితాలోకి మార్చారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. నిశితంగా పరిశీలిస్తే ఎన్‌.ఇ.పి-2020లో అంతర్లీనంగా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ కనిపిస్తాయి. ఈ జాతీయ విద్యావిధానం జాతి ప్రయోజనాలకు, పేదల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. జాతీయ విద్యా విధానం-2020కి వ్యతిరేకంగా యు.టి.ఎఫ్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.
 

                                                                        ఒ.పి.యస్‌ పునరుద్ధరించాలి

అనేక పోరాటాల ఫలితంగా, సుప్రీంకోర్టు డి.ఎస్‌.నకరా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు ఫలితంగా 1980వ దశకంలో పాత పెన్షన్‌ విధానం (ఒ.పి.యస్‌) ఉద్యోగులు, ఉపాధ్యాయులు పొందారు. పాత పెన్షన్‌ విధానం పదవీ విరమణ చేసిన వారికి సామాజిక భద్రతగా ఉపయోగపడుతున్నది. కానీ ఆర్థిక సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాలలో భాగంగా 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్‌ విధానం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సి.పి.యస్‌ పేరుతో నూతన పెన్షన్‌ విధానం అమలులోకి వచ్చింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సి.పి.యస్‌ పరిధిలో ఉన్నారు. సి.పి.యస్‌ రద్దు చేయాలని, ఒ.పి.యస్‌ పునరుద్ధరించాలని సంఘాలు ప్రత్యేకించి యు.టి.ఎఫ్‌ అనేక పోరాటాలు చేసింది. ఒకవైపు రాజస్థాన్‌, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ మొదలగు రాష్ట్రాలలో సి.పి.యస్‌ రద్దు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సి.పి.యస్‌ స్థానంలో జి.పి.యస్‌ అనే నూతన విధానం అమలులోకి తెచ్చింది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జి.పి.యస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఒ.పి.యస్‌) పునరుద్ధరణ కోసం జరిగే పోరాటంలో యు.టి.ఎఫ్‌ ముందు భాగాన నడుస్తుంది.
 

                                                                     ఉపాధ్యాయుల ప్రయోజనాలు

యు.టి.ఎఫ్‌ 1974 ఆగస్టు 10న ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సమరశీల పోరాటాలు కొనసాగించి ఉపాధ్యాయులకు అనేక ప్రయోజనాలు సాధించి పెట్టినది. రీ గ్రూపింగ్‌ స్కిల్స్‌, పాత పెన్షన్‌ విధానం, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ విధానం, డీఎస్సీ పరీక్ష ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, అప్రంటిస్‌ విధానం రద్దు, సోషల్‌ ఇంక్రిమెంట్లు...మొదలగునవి యు.టి.ఎఫ్‌ కొనసా గించిన ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయి. 2009లో ఒకేసారి 40 వేల మంది ప్రమోషన్లు పొందటం యు.టి.ఎఫ్‌ ద్వారానే సాధ్యమైంది. 2007లో శాసనమండలిని పునరుద్ధరించిన తరువాత జరిగిన శాసన మండలి ఎన్నికలలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ స్థానాలలో 7 స్థానాలు యు.టి.ఎఫ్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందటం యు.టి.ఎఫ్‌కు ఉపాధ్యాయులలో ఉన్న అభిమానానికి నిదర్శనం. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా పి.డి.ఎఫ్‌ ఎమ్మెల్సీలుగా 2003 మార్చి వరకు ఐదుగురు కొనసాగటం యు.టి.ఎఫ్‌ పొందిన ఆదరణకు నిదర్శనం. ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రయోజనాలే పరమావధిగా యు.టి.ఎఫ్‌ రాజీలేని పోరాటాలు కొనసాగించింది. మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలతోపాటు గురుకుల పాఠశాలలు, కస్తూరిబా విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌ మొదలగు పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల కోసం అనేక పోరాటాలు, ప్రాతినిధ్యాలు చేసింది.
 

                                                                          ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యారంగంలో పెద్దఎత్తున ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరిగింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యారంగంలో ప్రపంచ బ్యాంక్‌ సంస్కరణలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుత వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొన్ని మౌలిక వసతులు కల్పించినప్పటికీ, ప్రైవేటీకరణ విధానాలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు. జీవో నెం.117 ద్వారా రేషనలైజేషన్‌ విధానాలు అవలంబిస్తూ ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తున్నారు. 3,4,5 తరగతులను హైస్కూళ్లకు తరలించటం వలన అనేక మంది పేదపిల్లలు 'డ్రాపౌట్‌' అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగు ప్రాధాన్యత ఇవ్వకుండా, టెక్నాలజీని పెంచే విధానాలు అనుసరిస్తున్నది. యునెస్కో ఇటీవల ప్రచురించిన నివేదికలో 'టెక్నాలజీ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాద'ని స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించటం మానివేసి నిరసన తెలిపే హక్కును అణచివేస్తున్నది.
            యు.టి.ఎఫ్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని, సామాజిక దృక్పథం కలిగి ఉంటామని, ఎన్‌.ఇ.పి-2020ని వ్యతిరేకిస్తామని, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాలు బలపరుస్తామని, ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడు కుంటామని, ఒ.పి.ఎస్‌ పునరుద్ధరణకు కృషి చేస్తామని, అందరికి సమానమైన విద్య, నాణ్యమైన విద్య అందేలా పోరాడతామని ప్రతిన పూనవలసి ఉన్నది.

/వ్యాసకర్త శాసన మండలి సభ్యులు,
సెల్‌ : 8309965083 /
కె.యస్‌.లక్ష్మణరావు

2