Oct 02,2023 07:27

నదుల పచ్చని ప్రవాహంలో పండిన
పంటల అన్నపూర్ణ
బంగారు గాజుల తల్లి
ఇప్పుడు ఇనుప గాజుల తల్లి
ఎంతో కీర్తి ఇంత చీకటి !
మంచీ చెడూలేదు, కేవలం ఆకలి
అడవులు, భూములు, రాళ్ళు, మట్టి
ఇంకా ప్రజల బతుకులు
ఎన్ని మింగినా తీరని రాక్షస ఆకలి
ఎవరో పుల్ల విరిచి నేలేస్తారు
ఎందుకింత ఆకలి అని ...
అంతే, ఐకమత్యం దారాన్ని
కులం ఎలుకతో కొరికిస్తారు తుండ్లుతుండ్లుగా
మనుషులుగా ఆలోచించటం ఒకటే
ఎలుకలబోనులాంటి పరిష్కారం
సంస్కారాన్ని తిట్ల సంతలోకి నెట్టినట్టుంది
నీ అనురాగంలో కీర్తించిన కవితల్లోని పదాలు
ఇప్పుడు చప్పగా అయిపోయాయి తల్లి
కన్నీటితో తడిసిన వర్తమానం
గతపు వెచ్చదనాన్ని తలచుకుంటోంది
ఇప్పుడు కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి
నోరువిప్పి మాట్లాడాలన్నా
తెలివైన కోతి, చెడు చూడకు, వినకు,
మాట్లాడకు అంటుంది
కళ్ళుండీ గాంధారి అవ్వడం
నోరుండీ మూగబోవడం అంత తేలిక కాదు!
ఏముంది, గుప్పెడు నిప్పుంది
బతుకులో లేచిన రాజకీయ రాచకురుపుంది
ఓటు పిన్నీసుతో కురుపును గుచ్చి ఈ కురుపు పగిలి
ఈ నొప్పి తగ్గడానికి ముందు
గరిష్టంగా ఎంత జీవితాన్ని పోగొట్టుకోవాలి
కాలం నుంచి ఇంపుగా వినడానికి ఏమీలేనపుడు
పాలన ఒక ఎండు మేఘాల ఆకాశం!
సమాజం గాజుబొమ్మలా జీవించడం నేర్పే వాళ్ళ
చేతికి రాళ్ళు ఇవ్వకండి
ఇంకా కుట్రల పొగ పైపైకి లేస్తున్న వేళ
ఒక పట్టరాని కోపం తప్పు కానేకాదు
ఇప్పటికైనా ప్రజల ఛాతీలు గుండె చప్పుళ్ళతో ఉబ్బి
వారి ఎంపిక మరియు నిర్ణయం
ఇదివరకటికంటే మెరుగ్గా ఉంటుందని
ఖచ్చితంగా ఉన్నారు
మార్పు యొక్క మట్టిని పిడికిళ్ళలో నింపుకొని
సమయం కోసం చూస్తో ...
 

- శాంతయోగి యోగానంద
9110770545