
కరువు కోరలు చాస్తోంది. దేశ రైతాంగం కోటి ఆశలతో ఎదురుచూసే రుతుపవన వర్షాలు ఈ దఫా ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాదాపు ఆగస్టు మాసమంతా వానల్లేవ్. అడపాదడపా పడినా.. చేను పదునెక్కి విత్తనం వేసే స్థాయిలో కురవకపోవడంతో అన్నదాత కుదేలయ్యాడు. అదునులో విత్తు పడక, వేసిన పైర్లకు సకాలంలో తడులందని పరిస్థితుల్లో ఖరీఫ్ దిగుబడులు బాగా తగ్గిపోవచ్చన్న వాతావరణ, వ్యవసాయ రంగ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ధరాఘాతంతో సాగు పెట్టుబడులు పెరిగిపోయి ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వర్షాభావ పరిస్థితులు మరింత గడ్డుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వంటి ప్రధాన వ్యవసాయక రాష్ట్రాల్లో ఆగస్టులో దీర్ఘకాల సగటుతో పోల్చితే నైరుతి రుతుపవనాల వర్షపాతం లోటు 30 నుంచి 80 శాతంగా నమోదైంది. సెప్టెంబరులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే కరువు కరాళనృత్యం చేసే ప్రమాదముంది. ఎల్‌నినో సంవత్సరాల్లో 70 శాతం దాకా సెప్టెంబరులోనూ కనీసంలో కనీసం 10 శాతం వర్షపాతం లోటే తాండవించింది. అందువల్ల ఆగస్టులో ఏర్పడిన వర్షపాత లోటు పూడ్చే పరిస్థితి రాకపోవచ్చు. రాబోయే 45 రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే చేను, చెలకల్లో మిగిలేది కర్షకుల కన్నీటి ధారలే. దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం రుతుపవనాల వర్షాల మీదే ఆధారపడి ఉంది. ప్రధానంగా వరి, వేరుశనగ, సోయాబీన్, సజ్జలు వంటి తృణధాన్యాలకు తక్షణమే తడులందాల్సిన పరిస్థితి నెలకొంది. రుతుపవనాల లోటుతో పాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గిపోవడంతో ఆహార కొరతకు దారితీసే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము.
తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు ముగిసినా కూడా లక్షలాది ఎకరాలు విత్తనం పడక బీడుపడటం ఆందోళనకరం. ఇప్పటికి కావాల్సిన సాధారణ సాగులో 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల్లేక భూములు నెర్రెలిచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మూడొంతుల రాష్ట్రం తీవ్ర వర్షాభావం కోరల్లో చిక్కుకుంది. సగానికిపైగా మండలాలు డ్రైస్పెల్ (వర్షానికి వర్షానికి మధ్య అంతరం)లో మగ్గుతున్నాయి. సుదీర్ఘకాలం వానలు పడకపోవడంతో వేసిన పైర్లు బెట్టకొచ్చి తెగుళ్లు వ్యాపిస్తుండటంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. కరువుకు కేరాఫ్‌గా ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో వేసిన పైర్లు తొలగిస్తుండగా.. కాలువల ద్వారా సాగునీటి అవకాశాలున్న గుంటూరు, ఎన్‌టిఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల వంటి చోట్ల జలాశయాలు అడుగంటిన నేపథ్యంలో పైర్లను రక్షించుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ఏడాది వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సేద్యానికి నీరు ఇవ్వలేమని ప్రకటించడం బాధాకరం.
సీజన్‌లో మూడు నెలలు గడిచిపోగా ఇక సెప్టెంబర్ ఒక్క నెలే మిగిలిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే రైతులకు ఆశకిరణాలు. అరకొర అదునులో ఉన్నదంతా ఊడ్చి దుక్కిపాల్జేసిన రైతన్న ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుందామన్నా చేతిలో చిల్లిగవ్వ లేదు. దేశానికి, రాష్ట్రానికి కరువు, కాటకాలు కొత్తకాదు. కానీ దుర్భిక్ష పరిస్థితుల్లో కష్టజీవులను ఆదుకునేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి సారించడం లేదు. పంట నష్ట పరిహారమిచ్చే బాధ్యతను పాలకులు విస్మరిస్తున్నారు. కార్పొరేట్ బీమా కంపెనీలకు కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లిస్తున్నా ఇ-క్రాప్ వంటి సాంకేతిక అవరోధాలతో రైతుకు పరిహారం ఎగవేస్తున్నారు. వ్యవసాయ పనుల్లేని సమయంలో ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చడంతో పేద కార్మికులకు వలసలే శరణ్యమవుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండంటూ రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడంతోనే పాలకులు చేతులు దులిపేసుకోకుండా కరువు ప్రభావితానికి గురయ్యే కష్టజీవులందరినీ ఆదుకోవాలి. గంపెడు ఆశలతో విత్తులు, పైర్లు వేసి నష్టాలపాలైన అన్నదాతలకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలువాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక భత్యం చెల్లించాలి.