Aug 25,2023 15:13

ప్రజాశక్తి- తెనాలి :డ్రెయిన్ల పూడిక తీయించి, పొలాలు ముంపుకు గురి కాకుండా చూడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధికారులను కోరారు. మండల పరిధిలోని గుడివాడ, అంగలకుదురు గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించి రెండు గ్రామాల మధ్య గల మినీ డ్రెయిన్‌ ను పరిశీలించారు. డ్రెయిన్లో గుర్రపు డెక్క, తూటి కాడ పూర్తిగా అల్లుకుపోయి నీటిపారుదల లేకపోవడాన్ని రైతులు ఆయన దఅష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గిరాల మండలం చిలువూరు నుంచి ప్రారంభమయ్యే డ్రెయిన్‌ కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు మీదుగా సంగం జాగర్లమూడి వద్ద తుంగభద్ర డ్రెయిన్లో కలుస్తుందన్నారు. అయితే గుర్రపు డెక్క, తూటికాలతో పూడుకు పోవడంతో నీటి ప్రవాహం లేదన్నారు. భారీ వర్షాలు కురిస్తే నీరు పొలాల్లోకి వస్తుందని, ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో డ్రెయినేజి అధికారులు తక్షణమే స్పందించి కాలువల పూడిక తీయించాలని కోరారు. విషయాన్ని డ్రెయినేజీ డిఈఈ అనిల్‌ దృష్టికి తీసుకెళ్లగా, సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సాంబిరెడ్డి చెప్పారు. ఆయన వెంట రైతులు బద్దులూరి సురేష్‌, కొలకలూరి అశోక్‌ కుమార్‌, కె మోహన్‌ రావు తదితరులున్నారు.