Nov 07,2023 08:27

ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి
సుప్రీంకోర్టు వరకు ఈ విషయాల్ని లాగొద్దు
గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి
గవర్నర్లు ప్రజాప్రతినిధులు కారు
గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదన్న విషయాన్ని మరచిపోకూడదు
గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కాదన్న విషయాన్ని మరచిపోకూడదని సూచించింది. పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ''రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన బిల్లుల విషయంలో గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. బిల్లులకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలి. బిల్లుల అంశాన్ని కోర్టు వరకు లాగొద్దు. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి. తెలంగాణ విషయంలోనూ ఇలానే జరిగింది. గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు ప్రజాప్రతినిధులు కాదనే విషయాన్ని తెలుసుకోవాలి'' అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పంజాబ్‌ గవర్నర్‌ తీసుకున్న చర్యలపై తాజా స్థితి నివేదికను సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది.
పంజాబ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఆర్థిక, విద్యా సంబంధిత చట్టాలతో సహా ఏడు కీలకమైన బిల్లులపై గవర్నర్‌ పురోహిత్‌ ఆమోదాన్ని నిలుపుదల చేశారని నొక్కి చెప్పారు. బిల్లులను వాయిదా వేసే అధికారం గవర్నర్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. గవర్నర్‌ తరపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ అన్ని బిల్లులు పరిశీలనలో ఉన్నాయని గవర్నర్‌ ఇప్పటికే స్పష్టం చేశారని, అయితే నిర్ణయం ఇంకా తెలియజేయలేదని చెప్పారు. దీనికి సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును శుక్రవారం కోర్టుకు తెలియజేస్తామని తెలిపారు. గవర్నర్‌ తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలు స్పష్టం చేశారు.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం ఇవ్వడంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ జాప్యం చేస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ తరపున మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావించారు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రెండేళ్లుగా రాష్ట్ర బిల్లులను నిలిపివేసినట్లు తెలిపారు. ''ఈ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత, 'మేము సుప్రీంకోర్టులో పోరాడుతాము' అని గవర్నర్‌ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి'' అని వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేస్తూ అదే రోజు కేరళ, తమిళనాడు గవర్నర్లపై దాఖలు చేసిన పిటిషన్లు కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఇదిలావుండగా, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది కీలక బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే విధమైన పిటిషన్‌ను దాఖలు చేసింది. 5 బిల్లులపై గవర్నర్‌ పురోహిత్‌ నిర్ణయం తీసుకోలేదని పంజాబ్‌ ప్రభుత్వం పిటిషన్‌ చేయగా, 12 బిల్లులపై గవర్నర్‌ రవి తన ఆమోదాన్ని నిలుపుదల చేశారని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు పురోహిత్‌ ఆమోదం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో సిఎంకు గవర్నర్లకు ఉన్న వైరంలాగే పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ కు మధ్య వైరం నెలకొంది. ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదానికి గవర్నర్‌ తాత్సారం చేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. నవంబర్‌ 1న పురోహిత్‌.. భగవంత్‌ మాన్‌కు లేఖ రాసిన కొన్ని రోజుల తర్వాత, మూడు ద్రవ్య బిల్లులలో రెండింటికి ఆమోదం తెలిపారు. సభలో ద్రవ్య బిల్లులు పెట్టాలంటే గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి. అయితే, అక్టోబరు 19న సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ మూడు ద్రవ్య బిల్లుల ఆమోదాన్ని నిలిపేశారు. వాటిల్లో పంజాబ్‌ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (సవరణ) బిల్లు-2023, పంజాబ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సవరణ) బిల్లు - 2023, ఇండియన్‌ స్టాంప్‌ (పంజాబ్‌ సవరణ) బిల్లు -2023 ఉన్నాయి. బడ్జెట్‌ సెషన్‌కు పొడిగింపుగా అక్టోబర్‌ 20-21న నిర్వహించిన సెషన్‌ చట్టవిరుద్ధమని గవర్నర్‌ గతంలో వ్యాఖ్యానించారు.