Aug 11,2023 16:02

ప్రజాశక్తి -కాకినాడ :భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలో సీట్లు అమ్మొద్ధని పేదవారికి వైద్య విద్యను దూరం చేయొద్దని డిమాండ్‌ చేస్తూ జీవో నెంబర్‌ 107, 108 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ కోకిల సెంటర్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి కేటాయించిన వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐదు మాత్రమే కేటాయించి ఆంధ్రప్రదేశ్‌ పై బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మరొకసారి చాటి చెప్పిందని అన్నారు. కేటాయించిన ఐదు కాలేజీల్లో పేదవారికి వైద్య విద్యను దూరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో ఏర్పాటు చేసేటటువంటి మెడికల్‌ కాలేజీల్లో 50 శాతం సీట్ల లో 35 శాతం సీట్లను బి కేటగిరీ కింద సంవత్సరానికి 12 లక్షల రూపాయలు, 15 శాతం సీట్లు ఎన్నారై సి కేటగిరి కింద సంవత్సరానికి 20 లక్షల రూపాయలతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ లుగా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే విధంగా తీసుకొచ్చినటువంటి 107,108 జీవో ల వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారం లోకి రాకముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచిత విద్య ఇస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారికి వైద్య విద్యను దూరం చేస్తునారన్నారు. జీవో నెంబర్‌ 107, 108 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెడికల్‌ సీట్లను అమ్మవద్దని పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 107, 108 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను, విద్యార్థి సంఘాలను, ప్రజాసంఘాలను, మేధావులను, విద్యావేత్తలను కలుపుకుని ఐక్యంగా పోరాడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు సాహిత్‌, వాసు, తేజ, అభిషేక్‌, ఆదర్శ కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.