
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... అన్నట్టు కేంద్ర ప్రభుత్వ తీరు ఉంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన కేంద్రప్రభుత్వమే సమావేశాలకు అడ్డంపడటం ఆందోళనకరం. మోడీ ప్రభుత్వం రెండోసారి ఎన్నికైన 2019 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన ఓ సాధారణ అంశంగా మారిపోయింది. ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రయత్నించే ప్రతిపక్షాలను నిలువరించేందుకు అధికారపక్షం ఎత్తులు.. జిత్తులు సాధారణమయ్యాయి. 2021 వర్షాకాల సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్‌పై చర్చకు మొండిగా తిరస్కరించి పార్లమెంటు ప్రతిష్టంభనకు కారణమైంది. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అదానీ కుంభకోణాలకు సంబంధించి ఇచ్చిన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ విషయంలోనూ ఇదే పరిస్థితి. దేశ సంపద కార్పొరేట్ దిగ్గజానికి కట్టబెట్టిన క్రోనీ క్యాపిటలిజంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగినా పార్లమెంట్‌లో ప్రధాని సమాధానం చెప్పలేదు.
తాజాగా మణిపూర్ మంటల్లో దేశం పరువు మంటగలుస్తున్నా ప్రధాని మొసలి కన్నీరు కార్చడానికి 79 రోజులు పట్టింది. మే 3న అల్లర్లు చెలరేగిన కొద్ది సేపటికే కాంగ్‌పోక్సి గ్రామంలో ఇద్దరు కుకీ గిరిజన మహిళలను వివస్త్రలను చేశారు. వారిలో ఒకరు కార్గిల్ యుద్ధ వీరుడి భార్య. రెండున్నర నెలల తరువాత వెలుగుచూసిన ఈ వీడియోతో దేశం నివ్వెరపోయింది. నిరసనలతో హోరెత్తింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పని తాము చేయకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించిన తరువాత ప్రధాని పార్లమెంట్ బయట స్పందించారు. మణిపూర్ మత విద్వేష హింసాకాండపై తాజాగా వెలుగుచూస్తున్న కథనాలు మరింత హృదయవిదారకంగా ఉన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఇంటిలో బంధించి సజీవ దహనం చేసిన కాషాయ గూండాల కర్కశాన్ని చెప్పడానికి మాటలు చాలవు.
విద్వేషాలను విత్తడం, విభజించడం, పండించడం, అధికారాన్ని కాపాడుకోవడమే కాకుండా కార్పొరేట్ గుత్తాధిపత్యంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం అన్న మోడీ - అమిత్ షా, సంఫ్‌ు పరివార్ వ్యూహంలో భాగంగానే ఈ మారణకాండ సాగింది. ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల పర్యటనల్లో ఈ అంశంపై నిరసనలు చెలరేగినా మోడీ నోట మాట పెగలలేదు. అన్నదమ్ముల్లా కలసిమెలసి బతికిన కుకీలు, మెయితీలు బద్ధ శత్రువులయ్యారు. మెయితీ మహిళలుసైతం కుకీ యువతులను కాషాయ గూండాలకు అప్పగించారని వస్తున్న కథనాలు వారి మెదళ్లలో సంఫ్‌ు వాట్సాప్ అబద్ధాల ఫ్యాక్టరీ రగిల్చిన విద్వేషాన్ని చాటిచెబుతున్నాయి. కుకీల హింసాకాండను నియంత్రించకపోగా, పెంచి పోషించిన సిఎం బీరేన్‌సింగ్‌ను కొనసాగించి మోడీ సర్కారు ఏమి సందేశం ఇస్తోంది? చదువు, ఉపాధి వెతుక్కుంటూ లోయలకు వెళ్లిన కుకీలను అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు. వ్యాపారం, పనుల కోసం అటవీ ప్రాంతాల్లో నివాసముంటున్న మెయితీలు పారిపోయారు. కీలకమైన సరిహద్దు రాష్ట్రంలో జరుగుతున్న ఈ మారణహోమం దేశ ప్రజలందరినీ కలచివేస్తోంది. అందుకే మూలమూలనా నిరసన కార్యక్రమాలు వెల్లువలా సాగుతున్నాయి.
మణిపూర్ దురాగతాలపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా అడ్డుకునేందుకు మోడీ సర్కారు నానా ఎత్తులు వేస్తోంది. పార్లమెంట్‌లో ఇతర కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి రూల్ 267 కింద మణిపూర్ మారణహోమంపై పూర్తిస్థాయిలో చర్చించాలని, పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు భిన్నంగా రూల్ 176 కింద రెండు లేదా రెండున్నర గంటల్లో చర్చ ముగించి, డబుల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం యత్నించడం దుర్మార్గం. దేశ అత్యున్నత చట్టసభలో ఇంతటి కీలకమైన అంశంపై చర్చను నిరోధించడం, దాటవేయడం ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనం. ప్రతిపక్షాలు సమన్వయంతో పార్లమెంటులో సాగిస్తున్న ఐక్య ప్రతిఘటన మరింత శక్తివంతంగా ముందుకెళ్లాలి. మోడీ సర్కారు మెడలు వంచి, మణిపూర్‌పై చర్చ జరపాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి.