
మనిషి రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండటమే మధుమేహం (సుగర్). శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏర్పడే ఒకానొక అసమానత ఇది. సాధారణంగా రక్తంలో గ్లూకోస్ 100 మి.గ్రా ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లుగా భావించాలి. ఆహారం శరీరంలో జీర్ణంకాబడి గ్లూకోస్‌గా మారుతుంది. ఈ గ్లూకోస్ కణజాలంలోకి గ్రహింపలేకపోవడంతో రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. గ్లూకోస్ కణాలలోకి గ్రహించబడాలంటే ఇన్సులిన్ అనే హార్మోను క్లోమగ్రంధి నుంచి స్రవించబడాలి. ఇన్సులిన్ తక్కువగా స్రవించినా, సరిపడా స్రవించకపోయినా రక్తంలోని గ్లూకోస్ కణాల్లోకి గ్రహించబడదు. వ్యాధిగ్రస్తులకు శరీరంలోని జీవకణాలకు దీర్ఘకాలం శక్తి అందక వివిధ అవయవాలు అనారోగ్యనికి గురౌతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్య స్థితి పట్ల అప్రమత్తులుగా ఉండి తగు జాగ్రత్తలు పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
సమతుల ఆహారంతో అదుపు చేయొచ్చు
నిరంతర వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే మధుమేహం వ్యాధిని నియంత్రించొచ్చు.డయాబెటిస్, మధుమేహం, షుగర్, చెక్కర వ్యాధి... ఇలా అనేక పేర్లతో పిలుస్తున్నారు. తమకు షుగర్ వచ్చినా చాలామందికి తెలియటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన దేశాన్ని ప్రపంచ మధుమేహ వ్యాధి రాజధానిగా అభివర్ణించింది. ప్రపంచంలో అత్యధికంగా షుగర్ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు. షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. టైప్-1, టైప్-2 డయాబెటిస్, ఇప్పుడు టైప్-2 డయాబెటిస్ ఎక్కువగా ఉంది.
షుగర్ వ్యాధి ఎలా వస్తుందంటే..
ప్రతిఒక్కరికీ తమ దైనందిన జీవితానికి శక్తి కావాలి. శరీరం, మనస్సు పని చేయాలంటే కొంత శక్తి ఖర్చు అవుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ఆ శక్తి తయారవుతుంది. మనం తినే ఆహారం జీర్ణమైన తరువాత చక్కెర లేదా గ్లూకోజ్‌గా మార్పు చెందుతుంది. శరీరంలో అన్ని కణాలకు ఈ గ్లూకోజ్ చేరితేనే వాటికి తద్వారా మనకు శక్తి వస్తుంది. వివిధ కణాలను చేరేందుకు ఈ గ్లూకోజ్ రక్త ప్రసరణలోకి చేరుతుంది. రక్తప్రసరణలోనికి చేరుకున్న గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించి శక్తిని ఇవ్వడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరమవుతుంది. ఈ ఇన్సులిన్ జఠరరసం ప్యాంక్రియాస్ అనే గ్రంధిలో ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ ఉంటేనే కణ ద్వారాలు తెరుచుకొని గ్లూకోజ్ కణంలోకి వెళ్లే వీలవుతుంది. ఇన్సులిన్ కణ ద్వారాలను తెరిచే తాళం చెవి లాంటిదన్నమాట. తగినంత ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించలేక రక్త ప్రసరణలోనే అధిక మొత్తం గ్లూకోజ్ ఉండిపోతుంది. ఇలా రక్తంలో చక్కెర ఎక్కువైతే చక్కెర వ్యాధి వస్తుంది. పెద్ద మోతాదులో రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతూ శరీర కణాలు ఉపయోగించుకోలేని చక్కెర మూత్రంతో కలిసి బయటకు వెళ్తుంది.

వేగంగా వ్యాధి విస్తరణ ఇలా..
1970లో 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చే షుగర్ వ్యాధి ఇప్పుడు 30, 40 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. వ్యాధి పీడితుడు శక్తి సామర్థ్యాలు తగ్గి ఆర్ధిక, ఆరోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దేశంలో 1990 నుంచి ఏటేటా షుగర్ వ్యాధి బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. షుగర్ వ్యాధి రావడానికి అనుకూలమైన ప్రదేశాన్ని మనుషులే సృష్టిస్తున్నారు. శుభకార్యాల్లోనూ, పుట్టిన రోజుల్లో, పర్వదినాల్లోనూ, శుభాకాంక్షలు తెలిపే సమయాల్లోనూ విపరీతమైన ఖర్చు చేసి స్వీట్లు, కూల్ డ్రింక్లు సేవిస్తున్నారు. దీంతో ఈ వ్యాధి వేగంగా వస్తుంది. ఇలాంటి సమయాల్లో పండ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకుంటే మంచిది. వీటి ద్వారా షుగర్ వ్యాధి రాదు. పెళ్లిళ్లు చేసేటప్పుడు అతిథులకు బాగా మర్యాద చేయాలనే తపనలో అధికంగా వంటకాలతో భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఆ భోజనాలు చేయడంతో షుగర్, బిపి, గుండెపోటు, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉండే పండ్లు, కాయగూరలతోనే భోజనం చేయడం మంచిది.
మంచి ఆహారపు అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం..
షుగర్ వచ్చింది కదా అని నిరుత్సాహ పడాల్సిన పని లేదు. జాగ్రత్త పడి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యవంతంగా జీవిస్తారు. ప్రధానంగా పాలిష్ పట్టిన బియ్యం తినకూడదు. ముడి బియ్యం తినాలి. పీచుతో ఉన్న గోధుమపిండిని వాడాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న తీపి పదార్థాలను తినరాదు. సంప్రదాయబద్ధమైన స్వీట్లు అంటే బూరెలు తదితరాలు తినాలి. మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. స్థూలకాయాన్ని నివారించాలి. పప్పు, పులుసు, ఇగురు కూరలు తీసుకోవాలి ఉప్పు, నూనె వాడకాన్ని బాగా తగ్గించాలి.
శారీరక శ్రమ ఉత్తమమార్గం..
శారీరక శ్రమను నిత్య జీవితంలో ఒక భాగం చేయాలి. అవకాశమున్నప్పుడు సైకిల్ తొక్కేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వారే చేసుకోవాలి. టీవీ చూసేటప్పుడు రిమోట్ సంస్కృతి విడనాడాలి. ప్రతి రోజూ వ్యాయామంలో మొదట యోగా ఉత్తమమైనది. తర్వాత సైకిల్ తొక్కడం, ఈత, డ్రిల్లు, నడక తదితరాలు వీలును బట్టి చేస్తే మంచిది. అవకాశమున్న వారు ఇంట్లో మొక్కలు, కాయగూరలు పెంపకం చేపట్టాలి. దీంతో శారీరక శ్రమ లభించడంతో పాటు మంచి కూరగాయల్ని తినొచ్చు.
షుగర్ వ్యాధి లక్షణాలు ఇవీ..
పాస్‌క్రియాస్ గ్రంథిలో రాళ్లున్న వారు, గర్భిణులకు, స్థిరాయిడ్ ఎక్కువకాలం వాడిన వారికి ఈ వ్యాధి సంక్రమించొచ్చు.
వ్యాధి లక్షణాలు : విపరీతమైన దాహం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, మసక మసకగా కనబడటం, ఎక్కువ ఆకలిగా ఉండటం, గాయాలు తేలికగా మానకపోవడం, నిస్సత్తువ బరువును కోల్పోవడం వంటివి.
దుష్పరిణామాలు : చక్కెర వ్యాధిని నియంత్రించడంలో లోపం జరిగితే అది శరీరంలోని అన్ని ముఖ్య అవయాలకు ఒక విషంలాగా పనిచేస్తుంది. తల నుండి పాదాల వరకు సమస్య ముఖ్య అవయాలకు శాశ్వతంగా కీడు చేస్తుంది.
కంట్రోల్ లేకుంటే : మూత్రపిండాలు, కళ్లు, నరాలు, గుండె రక్తనాళాలు, పాదాల్లో వచ్చే గాయాలు, దంతాలకు, పుట్టబోయే బిడ్డలకు హాని కల్గిస్తుంది.
- డాక్టర్ బి.అనిల్ కుమార్
షుగర్ వ్యాధి వైద్య నిపుణులు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.