Oct 06,2023 07:10

           తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పున:పంపిణీ చేయాలంటూ బ్రిజేష్‌ కుమార్‌ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌-2) ట్రిబ్యునల్‌కు అప్పగిస్తూ బుధవారంనాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి ముఖ్యంగా కరువు పీడిత రాయలసీమ ప్రజానీకానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జలాల వినియోగం, పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి కొన్ని నిబంధనలను, విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వీటి ప్రకారం పరిష్కరించాలని కెడబ్య్లుడిటి-2కి సూచించింది కానీ ఆ వివరాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపికి రాజకీయ ప్రయోజనం కలిగించడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న మాట సత్య దూరం కాదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. నదీజలాలు దేశ సంపద. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటినీ సమ దృష్టితో చూడాలి. కానీ మోడీ సర్కారుకు అది కొరవడింది. పైపెచ్చు మతాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న తలంపు ఎక్కువ. విద్వేష సృష్టి పరివారీయులకు వెన్నతో పెట్టిన విద్య. 'విభజించు-పాలించు' అన్న బ్రిటిష్‌ పాలకుల సూత్రాన్ని వారు తు.చ. తప్పక అమలు చేస్తుంటారు. ఇదీ అదే !
           అంతర్రాష్ట్ర నదీజల వివాద పరిష్కార చట్టం(1956) లోని సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలపై 2004లో కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు గెజిట్‌లో పబ్లిష్‌ కావలసిన సమయంలో 2014లో రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ సర్కారు తమకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు న్యాయసమ్మతంగా లేవని పేర్కొంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సిఫార్సులు గెజిట్‌లో ప్రచురితం కాకున్నా నికర జలాల కేటాయింపుల ఆధారంగా ఎ.పి 512 టిఎంసీలు, తెలంగాణ 299 టిఎంసీలు వినియోగించుకునేలా తాత్కాలిక ఏర్పాటు జరిగింది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణపై వివాదాన్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. దాన్ని ఉపసంహరించుకుంటే తగిన ఉత్తర్వులిస్తామని కేంద్ర జలశక్తి శాఖ చెప్పడంతో తెలంగాణ సర్కారు అలాగే చేసింది. ట్రిబ్యునల్‌ కాలపరిమితి ఉన్నంతవరకు ఈ ఒప్పందం అమలులో ఉండాల్సి ఉండగా, మధ్యంతరంగా మరోసారి కృష్ణా జలాల పున: పంపిణీకి కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయించడం ఓ వైచిత్రి.
            బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నికర జలాలు ప్రాజెక్టులు, సబ్‌ బేసిన్ల వారీగా రెండు రాష్ట్రాలు స్పష్టంగా పంచుకున్నాయి. ఇక మిగులు జలాలను ఉభయుల ప్రయోజనాలు నెరవేరేలా పంచుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కరువు పీడిత, వెనుకబడిన ప్రాంతాలకు తాగు, సాగు నీరందించడమే లక్ష్యంగా శాస్త్రీయమైన పద్ధతిలో పంపిణీ, అలాగే నీటి నిర్వహణా షెడ్యూళ్లను నిర్ణయించాలి. అయితే, నదికి చివరన ఉన్నది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కాగా ఈనాడున్నది విభజిత ఆంధ్రప్రదేశే! అలాగే అంతర్జాతీయ జల సూత్రమైన రైపేరియన్‌ రైట్స్‌ కూడా పరిగణన లోకి తీసుకోవడం అవసరం. కీలకమైన నీటి విషయమై రైతాంగం మొత్తుకుంటుంటే రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి మాదిరిగానే పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయే తప్ప వివాదం రాజేస్తున్న కేంద్ర బిజెపిని పల్లెత్తు మాట అనకపోవడం తీవ్ర ఆక్షేపణీయం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం వెంటనే ఏర్పాటు చేసి కృష్ణా జలాల విషయమై ఏకాభిప్రాయం సాధించాలి. కేంద్రం కుట్రల్ని తెలుగు ప్రజలు తిప్పికొట్టాలి. బిజెపి పాలకుల ఆపద మొక్కులు నమ్మరాదు.