Jan 03,2023 15:13

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌(తిరుపతి) : పెన్షన్‌ వారోత్సవాలలో భాగంగా వడమాల పేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ''వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక'' పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆర్‌ కే రోజా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ను అందజేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని, గతంలో పింఛన్‌ మంజూరు కావాలంటే పింఛన్‌ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే గాని, క్రొత్త వారికి పింఛన్‌ ఇచ్చేవారు కాదని నేడు అర్హులందరికీ పింఛన్‌ అందిస్తున్నామని తెలిపారు. వడమాలపేట మండలంలో 5099 మందికి 1.41,77,750 రూపాయలు పెన్షన్‌లు ఇస్తుండగా, కొత్తగా 183 మందికి 5,11,000 రూపాయలు పెన్షన్ల నిమిత్తం మంజూరు చేశారని చెప్పారు. మండలంలో ప్రస్తుతం మొత్తం 5,282 మందికి 1,46,88,750 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , ఎమ్మార్వో, ఎంపీపీ. విజయలక్ష్మి., వైస్‌ ఎంపీపీలు, . బోర్డు మెంబర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.