Sep 30,2023 12:59

అమెరికా : ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో... భారత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడకూడదని అన్నారు.

                                                కొన్నేళ్లుగా కెనడాతో సమస్యలున్నాయి : మంత్రి జైశంకర్‌

ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా తమకు కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయని మంత్రి జై శంకర్‌ తెలిపారు. భారత్‌, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌లతో చర్చించాం అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌, ఆ దేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు. భారత్‌- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు.

                                                    వాక్‌ స్వాతంత్య్రం హింసకు దారితీయకూడదు : జై శంకర్‌

అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్‌ శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ .. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని స్పష్టం చేశారు. ' మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్‌ స్వాతంత్య్రం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు ' అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

                                                   కెనడాతో చర్చించేందుకు మేము సిద్ధం : మంత్రి జై శంకర్‌

కెనడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి జై శంకర్‌ అన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందని చెప్పారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం తమతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, తాము కూడా దానిని పరిగణనలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభ్యర్థనలకు కెనడా స్పందించలేదని తెలిపారు. తన విధానాల ప్రకారం భారత్‌ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్‌ స్పష్టం చేశారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదని తెలిపారు. ఒకవేళ నిజ్జర్‌ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్‌ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు.

                               కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడొద్దు : విలేకరుల ప్రశ్నకు జై శంకర్‌ స్పందన

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ' మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యాలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం' అని మంత్రి స్పందించారు.