కమ్యూనిస్టులతోనే అభివృద్ధి : ప్రజారక్షణ భేరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

- అధికారం కోసమే వైసిపి, టిడిపి యాత్రలు
- పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్‌కు తియ్యగా అనిపిస్తోందా ?
- అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, విఒఎలకు సచివాలయ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలి
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : కమ్యూనిస్టులతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, విఒఎలకు సచివాలయ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వైసిపి చేపడుతున్న సామాజిక సాధికార యాత్ర, టిడిపి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కేవలం అధికారం కోసం ఆడుతున్న నాటకాలేనని విమర్శించారు. ఈ పార్టీలు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయాయన్నారు. ఈ రెండూ పార్టీలతోపాటు జనసేన పార్టీ కూడా రాష్ట్రానికి మోసం చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మోసాలను బయటపెట్టి, ప్రజలకు రక్షణగా నిలిచేందుకే సిపిఎం ఆధ్వర్యాన ప్రజా రక్షణభేరి యాత్ర నిర్వహిస్తున్నామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగుతున్న ఈ బస్సుయాత్ర రెండో రోజు మంగళవారం పార్వతీపురంలో ప్రారంభమై సీతానగరం మండలం చినబోగిలి, మక్కువ, సాలూరు మీదుగా మెంటాడ మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో శ్రీనివాసరావు మాట్లాడారు. మతం, కులం పేరుతో దేశ సమగ్రతను దెబ్బ తీయాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. అదానీ బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేయడం వల్లనే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడుతోందన్నారు. ఎపికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంటే సిఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించకపోగా ప్రధాని మోడీ భజనలో నిమగమయ్యారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించేందుకు మిగతా 5లో కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోందన్నారు. ఆంధ్రుల పౌరుషాన్ని మోడీ వద్ద ఈ మూడు పార్టీలూ తాకట్టు పెట్టాయని విమర్శించారు. ఎపికి బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. గతంలో పాచిపోయిన లడ్డూ అని విమర్శించిన జనసేనానికి ఇప్పుడు ఆ లడ్డూ తీపిగా ఉందా అని ఎద్దేవా చేశారు. ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన సిఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికలయ్యాక, బిజెపికి ఎక్కువ సీట్లు రావడం వల్ల తానేమీ చేయలేనంటూ చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అంగన్‌వాడీల కంటే ఎపిలో వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానన్న మాట కూడా తప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి సుభాషితాలు పలుకుతున్న టిడిపి... మోడీ ప్రభుత్వ అరాచకాల గురించి ప్రశ్నించడం లేదన్నారు. పాలకపార్టీలు బిజెపితో అంటకాగుతున్నంత కాలం రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి లేదని తెలిపారు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడే నీతివంతమైన పాలన అందుతుందని చెప్పారు. దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ఎంపి, ఎమ్మెల్యేపైనా అవినీతి కేసులు లేవన్నారు. ఎపిలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఉద్యోగాల పేరిట మోడీ మోసం : పుణ్యవతి
ఉద్యోగాల పేరిట దేశంలోని యువత, విద్యార్థులను, నిరుద్యోగులను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి విమర్శించారు. అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు చొప్పున ఇస్తానంటూ ఆశలు రేకెత్తించి ఆచరణలో రెండు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. పైగా, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడదీశారని విమర్శించారు. ఒక్క రైల్వే శాఖలోనే సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదన్నారు. రైల్వేలో ప్రయివేటీకరణ విధానాల వల్ల ప్రయాణికులకు భద్రత, పరిశుభ్రత కొరవడ్డాయన్నారు. తరచూ రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ ఘటనల్లో సాధారణ ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 67 శాతం ప్రజానీకం రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ మాత్రం మంచి రోజులొచ్చేశాయంటూ మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు పనికి తగ్గవేతనం ఇవ్వడం లేదన్నారు. వారికి గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామంటూ అధికారంలోకి వచ్చిన బిజెపి... సాగు ఖర్చులు పెరిగేలా చేసిందని, గిట్టుబాటు ధరలు, మార్కెట్ సదుపాయం లేకుండా రైతులను మోసగిందని విమర్శించారు. యాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, ఎ.అశోక్, మన్యం, విజయనగరం జిల్లాల సిపిఎం కార్యదర్శులు రెడ్డి వేణు, తమ్మినేని సూర్యనారాయణ ప్రసంగించారు. యాత్రలో సిపిఎం నాయకులకు ప్రజలు ఎక్కడిక్కడ ఘన స్వాగతం పలికారు. హారతిపట్టి తిలకం దిద్దారు. తమ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలంటూ స్కీమ్ వర్కర్లు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు యాత్ర రథసారథి శ్రీనివాసరావుకు వినతిపత్రాలు అందజేశారు.