Nov 13,2023 08:21

అల్‌ షిఫా ఆస్పత్రిలో దయనీయ పరిస్థితులు
విద్యుత్‌ లేక నవజాత శిశువు మృతి, మరో 45మందీ అదే పరిస్థితి
గాజా :   
గాజాలో ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బాంబు దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో అనేక ఆస్పత్రుల్లో ఇంధన నిల్వలు హరించుకుపోవడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్‌ లేకపోవడంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రిలో అల్‌ షిఫా ఆస్పత్రిలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ''ఫలితంగా, ఇంక్యుబేటర్‌లోని మా నవజాత శిశువు కన్నుమూసింది. ఇంకా అక్కడ 45మంది శిశువులు వున్నారు.'' అని ఆరోగ్య శాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ కిద్రా తెలిపారు. కేవలం నిముషాల దూరంలోనే మృత్యువు పొంచి వుందని ఆస్పత్రి హెడ్‌ మహ్మద్‌ అబూ సాల్మియా వ్యాఖ్యానించారు. నిముషాల వ్యవధిలో రోగులు మరణిస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు.

శుక్రవారం కూడా ఆస్పత్రిపై క్షిపణి దాడులు జరిగాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ''ప్రాణాలు కోల్పోవడం ఆరంభమైందని మాత్రమే మేం చెప్పగలం. గాయపడినవారు కూడా సరైన చికిత్స లేక కన్నుమూస్తున్నారు. ఇంక్యుబేటర్లలో చిన్నారుల పరిస్థితి కూడా అలాగే వుంది. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న యువకుడు మరణించాడు. ఆస్పత్రి ఆవరణ మొత్తంగా చుట్టుముట్టారు. భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆవరణలో ఏ వ్యక్తి అయినా తిరుగుతుంటే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎవరినీ కదలనివ్వకుండా బయట ఇజ్రాయిల్‌ బలగాలు కాపలా కాస్తున్నాయి'' అని ఆయన చెప్పారు. మొత్తంగా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయయని అన్నారు. మృత్యువు అనివార్యంగా కనిపిస్తోందన్నారు.

అల్‌- షిఫా ఆస్పత్రికి సమీపంలో 50వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఆస్పత్రిలో విద్యుత్‌, ఇంటర్‌నెట్‌, వైద్య సరఫరాలు, ఔషధాలు అన్నీ అయిపోయాయని అధికారులు చెప్పారు. ఆస్పత్రిలోని దృశ్యాలు, పరిస్థితులు, వార్తలు చూస్తుంటే అత్యంత దిగ్భ్రాంతికరంగా, దయనీయంగా వున్నాయని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ కమిటీకి చెందిన రాబర్ట్‌ మార్టిన్‌ వ్యాఖ్యానించారు. భరించలేని రీతిలో వున్న అక్కడి పరిస్థితులను ఇంకా దిగజారకుండా తక్షణమే ఆపాలని కోరారు. జనరేటర్లు ఆపిన తర్వాత ఐదుగురు రోగులు చనిపోయారని అధికారులు తెలిపారు.

మాటలు కాదు, చేతలు కావాలి
గాజాపై చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అన్నారు. గాజాపై కేవలం మాటలు చెబితే సరిపోదు, తక్షణమే కార్యాచరణకు దిగాల్సిన ఆవశ్యకత నెలకొందని అన్నారు. రియాద్‌కు వెళ్లేముందు టెహరాన్‌ విమానాశ్రయంలో ఆయన మాట్లాడారు. ఇస్లామిక్‌ దేశాల ఐక్యత ఈనాడు చాలా ముఖ్యమన్నారు. కాల్పుల విరమణను అడ్డుకునేది అమెరికానే, యుద్ధ అవకాశాలను విస్తరిస్తున్నది కూడా అమెరికానే అని విమర్శించారు.

పాలస్తీనా హక్కుల ప్రాతిపదికనే పరిష్కారం వుండాలి
మూడు అంశాల ప్రాతిపదికన సమస్యకు పరిష్కారం కనుగొనాలని హమాస్‌ ప్రతినిధి ఒసామా హమ్దాన్‌ పేర్కొన్నారు. మొదటగా, పాలస్తీనియన్లపై మారణహోమాన్ని ఆపాలి, రెండవది, మానవతా సాయం, వైద్య సాయం, ఇంధనం ఆందచేయాలి, మూడవది, అత్యంత ముఖ్యమైన పాయింట్‌ అని, దీనిపై అందరూ ముక్తకంఠంతో మాట్లాడాలని అన్నారు. పాలస్తీనియన్ల హక్కుల ప్రాతిపదికనే పాలస్తీనా సమస్య పరిష్కారం కావాలన్నది మూడవ అంశమని హమ్దాన్‌ చెప్పారు.

ప్రతి పది నిమిషాలకొక చిన్నారి బలి :  డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ వెల్లడి
న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయిల్‌ హంతక దాడుల్లో ప్రతి 10 నిమిషాలకొక చిన్నారి చనిపోతోంది. ఈ విషయం ఇజ్రాయిల్‌ అంటే గిట్టనివారు చెప్పింది కాదు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసస్‌ తెలిపారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. అక్టోబర్‌ 7 నుంచి గాజాలోని ఆరోగ్య కేంద్రాలపై దాదాపు 250 దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో సుమారు 100 మంది ఐరాస ఆరోగ్య కార్యకర్తలు మరణించారని ఆయన చెప్పారు. గాజాలో ఎవరూ సురక్షితంగా లేరని ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించారు. శనివారం ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని నాలుగు ఆసుపత్రులను చుట్టుముట్టాయి. అవి హమాస్‌ కేంద్రంగా ఉన్నాయని నిందించాయి. అల్‌ రాంటిసి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, అల్‌ నాసర్‌ హాస్పిటల్‌, గవర్నమెంట్‌ ఐ హాస్పిటల్‌ , మెంటల్‌ హెల్త్‌ సెంటర్లను సైన్యం చుట్టుముట్టింది.

కాల్పుల విరమణకు పాశ్చాత్య దేశాలు గొంతెత్తాలి
పాలస్తీనా రాయబారి పిలుపు

జెనీవా: ఐక్యరాజ్యసమితి (యుఎన్‌)లోని పాలస్తీనా రాయబారి ఇబ్రహీం ఖ్రైషి శుక్రవారం నాడిక్కడ దౌత్యవేత్తలు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణకు పాశ్చాత్య దేశాలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు గాజాలో ఇజ్రాయిల్‌ దాడుల్లో చనిపోయిన వేలాది మంది పౌరులకు, అసాధారణంగా చనిపోయిన ఐరాస సిబ్బందికి సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత ఇబ్రహీం ఖ్రైషి 40 మందికి పైగా రాయబారులతో కలిసి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ దళాల గాజా ఆక్రమణను అంతం చేయాలని ఖ్రైషి పిలుపునిచ్చారు సంక్షోభాన్ని పరిష్కరించడానికి మానవతా సహాయాన్ని అందించడం ఒక్కటే చాలదన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఇంతకుముందు చేసిన ప్రకటనను ఖ్రైషి ప్రస్తావించారు, గాజాలో పరిస్థితి మానవతా సంక్షోభ నిర్వచనాన్ని మించిపోయింది. ఇది మానవాళి ప్రాథమిక సూత్రాలనే సవాలు చేస్తోందని అన్నారు. . ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు ఉందని చెప్పడానికి పశ్చిమ దేశాలు ఎక్కడలేని ఆతృతను చూపుతున్నాయి. పౌర ప్రాణనష్టాలను తగ్గించడానికి జాగ్రత్త వహించాలని పిలుపునివ్వడానికే పరిమితమవుతున్నాయని ఖ్రైసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి మధ్యప్రాచ్య, ఆసియా ఆఫ్రికా దేశాలకు చెందిన రాయబారులే ఎక్కువగా హాజరయ్యారు. నెదర్లాండ్స్‌ మినహా మిగతా ఏ పశ్చిమ దేశ రాయబారి కూడా హాజరుకాకపోవడం గమనార్హం.గాజా సంక్షోభంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

అత్యవసరంగా సమావేశమైన అరబ్‌ నేతలు
ఇతర దేశాలకు విస్తరించకుండా ఈ ఘర్షణను ఇక్కడే అంతం చేయడానికి గల అవకాశాలపై చర్చించేందుకు శనివారం రియాద్‌లో అరబ్‌ నేతలు, ఇరాన్‌ అధ్యక్షుడు సమావేశమయ్యారు. గాజా, పాలస్తీనా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైన, అనూహ్యమైన పరిణామాలపై సమిష్టి వైఖరిని రూపొందించాల్సిన ప్రాముఖ్యతను ఈ చర్య తెలియచేస్తోందని అధికార సౌదీ పత్రికా సంస్థ వ్యాఖ్యానించింది. పాలస్తీనియన్లపై నేరాలకు ఇజ్రాయిల్‌దే బాధ్యత అని అరబ్‌ నేతలు స్పష్టం చేశారు. ఈ సదస్సులో ఇరాన్‌, టర్కీ, సిరియా అధ్యక్షులు, కతార్‌ రాజు పాల్గన్నారు. సౌదీ యువరాజు బిన్‌ సల్మాన్‌, ఇజ్రాయిల్‌ చర్యలను తీవ్రంగా ఖండించారు. తన చట్టబద్ధమైన, నైతిక బాధ్యతలను నిర్వహించడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందని కతార్‌ నేత వ్యాఖ్యానించారు.