Oct 20,2023 10:31
  • కనిష్టం రూ.11,405, గరిష్టం రూ.13,062

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు 2023 అక్టోబరు నుంచి 2024 మార్చి 31 వరకు అమలు చేయాల్సిన కనీస వేతనాలను నిర్ధారిస్తూ అన్ని జిల్లాల కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ ఎం.వి. శేషగిరిబాబు రెండు రోజుల క్రితం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్వల్ప పెరుగుదలలో కనీస వేతనాలను నిర్ధారిస్తూ ఈ ఆదేశాలు ఇస్తుంటారని కార్మికశాఖ అధికారులు వెల్లడించారు. కనీస వేతనం రూ.600 ఇవ్వాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌ ఇంతవరకు అమలు నోచుకోవడంలేదు. సమాన పనికి సమాన వేతనం ప్రకారం కనీసవేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్న సుప్రీం తీర్పును కూడా ఇంత వరకు ప్రభుత్వం అమలు చేయడం లేదు. కార్మిక శాఖ కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం కనీస వేతనాల్లో కనిష్టం రూ. 11,405 ఉండగా, గరిష్టంగా రూ.13,062 మాత్రమే ఉన్నాయి. జోన్‌-1లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రేడ్‌-1 మున్సిపాలిటీలు, జోన్‌-2లో గ్రేడ్‌2 మునిసిపాలిటీలు, నగరపంచాయతీలు ఉంటాయి. కనీస వేతనాల అమలుకు సంబంధించి కార్మిక శాఖ జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు,కార్మిక శాఖ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

44