Jul 01,2023 06:50

            తమిళనాడు గవర్నరు ఆర్‌ఎన్‌ రవి వ్యవహారశైలితో గవర్నర్ల వ్యవస్థ మరోమారు చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీని డిస్మిస్‌ చేయడం, విమర్శలు రావడంతో అదే రోజు అర్ధరాత్రి తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవడం గంటల వ్యవధిలో జరిగిపోయాయి. డిస్మిస్‌ చేసే అధికారం మీకెక్కడిది అంటూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ నిలదీయడం, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించడంతోనే గవర్నర్‌ రవి దిగిరావాల్సివచ్చింది. ఈ విషయంలో అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారని, అటార్నీ జనరల్‌ సలహా తీసుకోవాల్సివున్నందున సెంథిల్‌ డిస్మిస్‌ను తదుపరి ఉత్తర్వుల వరకూ నిలిపేస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అర్ధరాత్రి రాజ్‌భవన్‌ నుంచి లేఖ వెళ్లింది. అంటే డిస్మిస్‌ చేయడం, విరమించుకోవడం అంతా అమిత్‌ షా కనుసన్నల్లోనే జరిగాయన్నమాట !
          ఎన్నికైన ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే వ్యక్తిగా అత్యంత వివాదస్పద వ్యక్తిగా ఆర్‌ఎన్‌ రవి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఆయన వ్యవహారశైలి ఫక్తు సంఫ్‌ుపరివార్‌ బంటును తలపిస్తుంటుంది. రాజ్యాంగ పదవిలో ఉన్నాన్న స్పృహ కూడా ఉండదు. తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించడం రాజ్‌భవన్‌లో కాలుమోపిన నాటి నుంచీ కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2016 నాటి పాత కేసులో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసిన బాలాజీకి ఈ నెల 21న శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఏకంగా రాష్ట్ర సచివాలయంలోకి చొరబడి ఇడి సోదాలు జరిపిన నేపథ్యంలో సెంథిల్‌ గుండెపోటుకు గురయ్యారు. పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను కూడా ఇలానే చూస్తారా? అంటూ దేశవ్యాప్తంగా మోడీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు గురిచేసి లబ్ది పొందాలనేది బిజెపి ఎత్తుగడ. ప్రజాకోర్టులో పాచికలు పారకపోవడంతోనే గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసి పంతం నెగ్గించుకోవాలనే బిజెపి ఇంతటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది.
           బిజెపియేతర ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ల తీరు ఇలాగే వుంటోంది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆధిపత్య ధోరణితో రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నిధులను నిరాకరిస్తోంది. రాష్ట్ర పరిధిలోని అంశాల్లోకి దొడ్డి దారిన చొరబడి హక్కులను కాలరాస్తోంది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్రం రూపుదిద్దుకుంటుందన్న సహజ సూత్రాన్ని సైతం విస్మరించి ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలను వివిధ రూపాల్లో వేపుకుతింటోంది. వినాశకరమైన ఈ విధానాలను ప్రతిఘటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అక్కడి గవర్నర్ల ద్వారా నిత్యం ఘర్షణలు రాజేస్తూ ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్‌ ఖూనీ చేస్తోంది.
          ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యేలా చూడటం, ముఖ్యమంత్రి నియామకం, ఆయన సలహా మేరకు కేబినెట్‌ కూర్పు ఇవన్నీ గవర్నరుకు రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులే. కానీ గవర్నరు నిమిత్తమాత్రుడే. మంత్రులను నియమించడం లేదా తొలగించడం.. అన్నీ ముఖ్యమంత్రి సలహా ప్రకారమే చేయాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవారిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు ఇటీవలే తేల్చి చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను ఏమాత్రం లెక్కచేయకుండా, కనీసం పరిగణలోకి కూడా తీసుకోకుండా రాజ్‌భవన్‌ పాలనాధీశులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బిజెపియేతర ప్రభుత్వాలున్న ప్రతిరాష్ట్రంలోనూ గవర్నర్లు అక్కడి ప్రజా ప్రభుత్వాలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న ఆర్‌ఎన్‌ రవి ఆ రాజ్యాంగ బద్ధ పదవికి అనర్హుడు. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి. కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారకుండా గవర్నర్ల వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.