- ఎనిమిదిమంది సైనికుల మృతదేహాలు లభ్యం
గ్యాంగ్‌టక్ : సిక్కిం వరదల్లో గల్లంతైన ఎనిమిదిమంది సైనికుల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. 'సిక్కిం వరదల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన 23 మంది సైనికులలో ఒకరిని అప్పట్లో సహాయక సిబ్బంది రక్షించారు. ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. 14 మంది సైనికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని రాజ్‌నాధ్‌సింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో శనివారం పోస్ట్ చేశారు. శనివారం మరో ఏడు మృతదేహాలను గుర్తించడంతో సిక్కిం వరదల్లో మరణించిన వారి సంఖ్య 30కు చేరుకుంది. వరదల్లో గల్లంతైన వారిలో 62 మందిని శనివారం భద్రత సిబ్బంది గుర్తించి రక్షించారు. దీంతో గల్లంతైన వారి సంఖ్య 81కి తగ్గింది. ఈ వివరాలను సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ శనివారం సాయంత్రం వెల్లడించింది. తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని జిల్లాలు నేటికీ ఇబ్బందులు పడుతున్నాయి. 1,320కి పైగా నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని సిక్కిం ప్రభుత్వం తెలిపింది. తీస్తా వీ హైడ్రో పవర్ స్టేషన్‌కు దిగువన ఉన్న బ్రిడ్జిలన్ని ధ్వంసమయ్యాయి. కొన్ని వంతెలు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయాయి. సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆదివారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుందని కేంద్ర మంత్రి అజరుకుమార్ మిశ్రా గ్యాంగ్‌టక్‌లో తెలిపారు. ఈ నెల 4న తెల్లవారుజామున తీస్తా నదిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శనివారం ఉదయం మంగన్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సందర్శించారు. సైన్యం, స్థానిక అధికారులు నిర్వహిస్తున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలో 3 వేల మందికి పర్యాటకులు చిక్కుకుని పోయారని, వీరంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.










