Oct 18,2023 07:42

గాజా : గాజా నగరంలో ఘోర ఘటన జరిగింది. మంగళవారం సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించలేదు. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా ? కాదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

                                               3 రోజులు సంతాప దినాలు : పాలస్తీనా అధ్యక్షుడు ప్రకటన

ఈ దారుణ ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్‌ నయీం చెప్పారు.

                                                       ఈ దాడి అత్యంత రక్తపాత సంఘటన : పాలస్తీనా

గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడి అత్యంత రక్తపాత సంఘటనగా పాలస్తీనా పేర్కొంది. యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ ఇజ్రాయెల్‌ను సందర్శించిన తర్వాత ఈ వైమానిక దాడి జరిగింది. గాజాలోని హమాస్‌ ప్రభుత్వంలోని ఆసుపత్రిలో ఊచకోత కోశారని ఆరోగ్య మంత్రి మై అల్కైలా ఆరోపించారు. ఈ దాడిలో 500 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ 11 రోజుల బాంబు దాడిలో 3,000 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు చెప్పారు.

                                                               ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడి...

ఉత్తర గాజాను విడిచిపెట్టి, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లను ఆదేశించిన ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం అదే దక్షిణ గాజాపై భీకర స్థాయిలో వైమానిక దాడులు చేసింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌ యూనిస్‌ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఆస్పత్రి పరిసరాలన్నీ భయానకంగా మారిపోయాయి. ఆస్పత్రిలోని హాళ్లు దగ్ధమయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                            దక్షిణ గాజాపై అందుకే దాడులు చేశాం : ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి

ఇజ్రాయెల్‌ ఒకవైపు ఉత్తర గాజాపై భూతల దాడులకు సన్నాహాలు చేస్తూనే... మరోవైపు దక్షిణ గాజాపై హఠాత్తుగా వైమానిక దాడులు చేసింది. హమాస్‌ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ చెప్పారు. హమాస్‌ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ వెల్లడించారు.