బద్వేలు : బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళితులు, పేదలు ఏళ్ల తరబడి సాగు చేసు కుంటున్న ప్రభుత్వ భూములకు అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి,శివకుమార్ వి.అన్వేష్, డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల ,బి కోడూరు గోపవరం, మైదుకూరు, బ్రహ్మం గారి మఠం, బి.కోడూరు మండలాల నుంచి పేదలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 సంవత్సరాల నుంచి దళితులు, పేదలు అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పట్టాలకు నోచుకోలేదని, ఏళ్ల తరబడి సొంత ఖర్చులతో సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని పేర్కొ న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న రైతు భరోసాలు బ్యాంకులలో పంట రుణాలు, బీమా, పరిహారం అందడలేదని వాపోయారు. వర్షాధార పంటలు వేస్తూ సకాలంలో పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసైన్‌మెంట్ కమిటీ సమగ్రంగా సాగులో ఉన్న పేదలందరికీ పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.జెడ్‌హెచ్‌డిసి లబ్ధిదారులైనా టి. చల్లగిరికిల, మడకవారిపల్లె నంద్యాలంపేట, ముత్తుకూరు రెవెన్యూ గ్రామాలలో 40 సంవత్సరాల నుంచి దళితులు ఎస్‌సి కార్పొరేషన్‌లో పన్ను కట్టుతున్నారని, వారి ప్రభుత్వ పరంగా ఎలాంటి రాయితీలు సంక్షేమ పథకాలు పంట నష్టపరిహారం ముందస్తు పెట్టుబడికి బ్యాంకులలో పంటల బీమా ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేశారు. పిపి కుంట వద్ద సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మూడు నెలల కిందట పేదలు స్థానిక ఆర్టీవోకు అర్జీలు సమర్పించినా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పిపి కుంట వద్ద ప్రభుత్వ భూములలో అనధికారికంగా ఇళ్ల ప్లాట్లు వేయటం విచ్చలవిడిగా వేస్తున్నారని అన్నారు. బద్వేల్ ఆర్డీవో అన్యకాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫల మయ్యారని విమర్శించారు. రీ సర్వేలో స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారే తప్ప ఎక్కడా ఒక ఎకరం భూమి స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు గ్రామీణ పేదలు వలసలు నివారించడానికి ప్రభుత్వ భూములు ఉండాలని డిమాండ్ చేశారు. ధర్నాలో శంకవరం రెవెన్యూ గ్రామం అక్కల్ రెడ్డిపల్లె, బొప్పాపురం, టి.చల్ల గిరిగల్ల, ఆకుల నారాయణపల్లె, వరికుంట్ల ఇటు కలపాడు, సావిశెట్టిపల్లె సోమిరెడ్డి పల్లె నర్సన్న పల్లె నంద్యాలంపేట, పిపి కుంట రెవెన్యూ గ్రామాల నుంచి దళితులు పేదలు పెద్ద ఎత్తున హాజర య్యారు. అనంతరం ఆర్డిఓ ఆకుల వెంకటరమణకు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.వీరయ్య ఎస్ గురువయ్య జిల్లా కమిటీ సభ్యులు రాయప్ప గోవిందు , సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, భూపారాట సాధన కమిటీ మండల కన్వీనర్ ఖాదర్ బాషా, కదిరయ్య కెవిపిఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్, ప్రజానాట్యమండలి కళాకారులు, నరసింహులు నరసయ్య, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి నాగార్జున, డివైఎఫ్‌ఐ నాయకులు మస్తాన్, షరీఫ్ ఆంజనేయులు, గురయ్య, సురేంద్ర ఐద్వా నాయకులు మోక్షమ్మ, ఆనంతమ్మ, గౌతమి, మస్తాన్‌బీ, వత్తిదారులు సుబ్బారాయుడు, గంపా సుబ్బారాయుడు, బాబయ్య, మస్తాన్ పాల్గొన్నారు.ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దళితులు, వ్య.కా.స నాయకులు










