Aug 18,2023 07:11

సాధారణ వాడుకలో చెప్పాలంటే దళిత క్రైస్తవులనేది పరస్పర విరుద్ధమైన రెండు పదాల కలయికగా పరిగణించబడుతుంటుంది. క్రైస్తవ మతం కులాల తేడాను గుర్తించదు గనక హిందూ మతంలో దళితుడు... ఆ మతంలోకి మారిన వేంటనే దళితుడుగా వుండబోడన్న మాట. దళిత క్రైస్తవుల విషయంలో భారత ప్రభుత్వ కచ్చితమైన అభిప్రాయం ఇదే. మత మార్పిడి జరిగిన తర్వాత దళిత క్రైస్తవులకు సంబంధించిన వైకల్యాలన్నీ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని కేవలం క్రైస్తవులుగానే చూస్తోంది. దీంతో వారిని 'తరగతులవారీ విభజనల్లో అదృశ్యం' అనే కేటగిరీ లోకి నెట్టేస్తున్నారు.

         దళిత క్రైస్తవులకు షెడ్యూల్‌ కులం (ఎస్‌సి) హోదాను మంజూరు చేసేందుకు గల అవకాశాలను అధ్యయనం చేసేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ నేతృత్వంలో గతేడాది భారత ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవలే, ఇందుకు సంబంధించి 1950 నాటి రాష్ట్రపతి (ఎస్‌సి) ఉత్తర్వులను సవరిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. క్రైస్తవ మతానికి మారిన దళితులు ఎస్‌సి కోటా కింద రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందేందుకు అనుమతించాలంటూ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ (2007) సిఫార్సు చేసింది. 'దళిత క్రైస్తవులకు ఎస్‌సి హోదాను తిరస్కరించడాన్ని సమర్ధించేందుకు బలమైన సాక్ష్యాధారాలు లేవు' అని జాతీయ మైనారిటీల కమిషన్‌ నియమించిన దేశ్‌పాండే, బప్నా (2008)లు నిర్ధారించారు.
           ''అస్పశ్యులకు సంబంధించినంతవరకూ హిందూ మతం ఒక ఘోరాల కోట. (రచనలు, ప్రసంగాలు, వాల్యూమ్‌ 9, పేజీ 296)'' అని బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పారు. ఈ భయానకమైన వివక్ష నుండి తప్పించుకోవడానికే లక్షలాదిమంది హిందూ దళితులు క్రైస్తవంతో సహా మరింత సమానతతో కూడిన మతాలకు మారిపోయారు. హిందూ మతంలోని కులతత్వ సంకెళ్ళ బారి నుండి తప్పించుకుని, అటువంటి మతాలు హామీ ఇచ్చిన సమానత్వాన్ని అనుభవించాలనే ఆశతోనే వారు మారిపోయారు. హిందూ దళితులు క్రైస్తవానికి మారడానికి గల ప్రధాన కారణం - సమానత్వమనే ప్రాథమిక ఆశ - అయితే అది చాలా వరకు సాకారమవనే లేదు. ఇప్పుడు ఈ వ్యాసం యొక్క మౌలిక వాదన దాని గురించే. మతం మారిన ఫలితంగా వారి గుర్తింపునకు సంబంధించి అనేక వైరుధ్యాలు, అనిశ్చితులు, అస్పష్టతలు నెలకొన్నాయి. పైగా సామాజిక చలనశీలత క్రమంలో ఆశించినట్లుగా వారు పైకి ఎగబాకలేకపోయారు. శతాబ్దాల తరబడి ఆచరిస్తూ వచ్చిన సాంప్రదాయం అస్పృశ్యతను సమాజం నుండి పారద్రోలడానికి, దీన్ని చర్చిలోకి తీసుకురావడానికి సహ మతవాదులు, క్రైస్తవంలోకి మారిన దళితయేతరుల విముఖత కూడా ఇందుకు కారణంగా వుంది.
 

                                                                         వర్గాలవారీ విభజన భారాలు

దళిత క్రైస్తవుల సమస్యను 'ఇంటర్‌సెక్షనల్‌ థియరీ' (అనేక వివక్షలు, ప్రతికూలతల వల్ల ప్రభావితమైన ఒక వ్యక్తి, సమూహం, లేదా సామాజిక సమస్యను గురించి ఒక అభిప్రాయాన్ని లేదా భావనను రూపొందించడమే థియరీ ఆఫ్‌ ఇంటర్‌సెక్షనాలిటీ) మరింత విస్తృతంగా చూపిస్తోంది. మతంతో కులానికి గల అవగాహనకు, దళితులుగా, మతపరమైన మైనారిటీ గ్రూపుగా దళిత క్రైస్తవులను చూసే సంక్లిష్టమైన అవగాహనకు అనుమతిస్తోంది. ఏకాకులైన కేటగిరీలకు చట్టపరమైన రక్షణను కల్పించే, దళిత క్రైస్తవులు వంటి వర్గాలు అతిగా వ్యాప్తి చెందుతున్న గ్రూపులకు వ్యతిరేకంగా వివక్షను ప్రదర్శించే భారత దేశ చట్టాల 'సింగిల్‌ యాక్సిస్‌ ఫ్రేమ్‌వర్క్‌' అసమర్ధతకు సంబంధించిన అవగాహనను కూడా ఇది వివరిస్తుంది.
            జాతి, లింగం, లైంగికత, సమర్ధత వంటి వివిధ అణచివేత వ్యవస్థలను మరొకదాని నుండి వేరుగా అర్ధం చేసుకోలేమని ఇది చెబుతోంది. ఇటువంటి అధికార వ్యవస్థలు పరస్పరం ఖండించుకుంటూ విలక్షణమైన వ్యక్తిగత సామాజిక అనుభవాలకు దారితీస్తున్నాయి. వివిధ వర్గాల మధ్య నెలకొన్న ఇటువంటి వివక్షకు సంబంధించిన పర్యవసానాలే ఈ వివక్షను ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నాయి. థియరీ ఆఫ్‌ ఇంటర్‌సెక్షనాలిటీకి ఆద్యులైన కింబర్లీ క్రెన్షా దీన్ని ప్రవేశపెట్టారు.
            ''మేపింగ్‌ ది మార్జిన్స్‌ : ఇంటర్‌సెక్షనాలిటీ, ఐడెంటిటీ పాలిటిక్స్‌, అండ్‌ వయొలెన్స్‌ అగైనెస్ట్‌ విమెన్‌ ఆఫ్‌ కలర్‌'' అన్న శీర్షికతో తన వ్యాసంలో ఆమె ఇలా రాశారు, ''తరగతుల వారీ గుర్తింపుల కారణంగా మహిళలు, నల్లజాతి మహిళలు వారి పరిధుల్లో పక్కకు నెట్టివేయబడుతున్నారు.'' దళితులు, క్రైస్తవులను, వ్యవస్థాగతంగా వర్గాల మధ్య వివక్షకు గురవుతూ తద్వారా సమాజం, చర్చి, ప్రభుత్వం నుండి వెలివేయబడుతున్న దళిత క్రైస్తవులుగా అధ్యయనం చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌గా ఇంటర్‌సెక్షనాలిటీ అవగాహనను ప్రాతిపదికగా చేసుకోవడానికి ఈ వ్యాఖ్యానం సహాయపడుతుంది.
         'గుర్తింపు అనేది సమాజంలో ఉనికిలో వున్న వివిధ సామాజిక తరగతులకు సంబంధించిన నిర్దిష్ట, ప్రత్యేక సామాజిక తరగతుల గుర్తింపులతో వ్యక్తికి వుండే సభ్యత్వం గురించి చెప్పుకోవడం. వాస్తవానికి స్వీయ గుర్తింపుల్లో ఇవి ఉపకరణాలుగా వుంటాయి.
            'నల్ల జాతి మహిళ' విషయంలో మాదిరిగానే దళిత క్రైస్తవుడు' అనే పదాన్ని కేవలం రెండు పదాల జోడింపుగా అర్ధం చేసుకోలేం. దాన్నొక విలక్షణమైన కేటగిరీగా గుర్తించాల్సి వుంది. ఎందుకంటే ఈ తరగతి బహుళ సామాజిక గుర్తింపుల ప్రత్యేక హైబ్రీడ్‌ సృష్టిగా వుంది. సాధారణ వాడుకలో చెప్పాలంటే దళిత క్రైస్తవులనేది పరస్పర విరుద్ధమైన రెండు పదాల కలయికగా పరిగణించబడుతుంటుంది. క్రైస్తవ మతం కులాల తేడాను గుర్తించదు గనక హిందూ మతంలో దళితుడు...ఆ మతంలోకి మారిన వేంటనే దళితుడుగా వుండబోడన్న మాట. దళిత క్రైస్తవుల విషయంలో భారత ప్రభుత్వ కచ్చితమైన అభిప్రాయం ఇదే. మత మార్పిడి జరిగిన తర్వాత దళిత క్రైస్తవులకు సంబంధించిన వైకల్యాలన్నీ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని కేవలం క్రైస్తవులుగానే చూస్తోంది. దీంతో వారిని 'తరగతులవారీ విభజనల్లో అదృశ్యం' అనే కేటగిరీ లోకి నెట్టేస్తున్నారు. అమర్త్యసేన్‌ దీన్ని 'సామూహిక' గుర్తింపులుగా వివరించారు. ఒక వ్యక్తి ఆ సమూహానికి చెందవచ్చు, ప్రత్యేక గుర్తింపు కల్పించవచ్చు, ఆ గుర్తింపు వివిధ సందర్భాల్లో వివిధ కాలానుగుణ్యతలకు తగ్గట్టుగా మారుతుంది. 'ఈ గుర్తింపులకు ఇచ్చే ప్రాధాన్యతలు తప్పనిసరిగా మన సమస్యకు అనుగుణంగా వుండాలని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి బహుళ గుర్తింపుల నుండి ప్రాధాన్యమైనదాన్ని ఒక వ్యక్తి ఎంపిక చేసుకుని, ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు.
 

                                                                        సింగిల్‌ యాక్సిస్‌ ఫ్రేమ్‌వర్క్‌

సూసై ఎట్‌సెట్రా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ అదర్స్‌ కేసు (1985)లో, చెప్పుల తయారీదారుడైన దళిత కేథలిక్‌ సూసై మద్రాసు ప్లాట్‌ఫారమ్‌ మీద తన బడ్డీని విస్తరించుకోవడం కోసం సుప్రీంను ఆశ్రయించాడు. హిందువులైన చెప్పుల తయారీదారులతో సమానంగా తనకు కూడా అవకాశం కల్పించాలని కోరాడు. కానీ కోర్టు ఆ కేసును కొట్టివేసింది. ''హిందూ మతంలోని సామాజిక వ్యవస్థలో ఇటువంటి కులానికి చెందినవారు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులన్నీ భిన్నమైన మతపరమైన కమ్యూనిటీలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయని నిర్ధారించడం అవసరం'' అని పేర్కొంది. అంటే సింగిల్‌ యాక్సిస్‌ ఫ్రేమ్‌వర్క్‌ దృక్పథాన్ని ఉపయోగించి సూసై దళితుడనే వాదన ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది.
          హిందూమతం, సిక్కుమతం, బౌద్ధమతంలో కూడా కులాలవారీ వివక్ష భావన నెలకొందని, అందుకే దళితులకు ప్రయోజనాలు అందించాలని భారత రాజ్యాంగం భావించిందని ఆశిష్‌ నాండే వాదించారు. కానీ, క్రైస్తవమనేది విదేశాల నుండి దిగుమతి అయిన మతం అన్న భావన ప్రాతిపదికన దళిత క్రైస్తవులను మినహాయించిందని, తద్వారా వారి ప్రజాస్వామ్య పౌరసత్వమనేది ప్రశ్నార్ధకమైందని అన్నారు.
అందువల్ల, దళిత క్రైస్తవులకు అనుకూలంగా చాలా సాక్ష్యాధారాలు వున్నప్పటికీ ప్రభుత్వం విముఖంగా వుండడంతో దళిత క్రైస్తవులను ఎస్‌సి జాబితాలో చేర్చడంలో చట్టంలోని సింగిల్‌ యాక్సిస్‌ ఫ్రేమ్‌వర్క్‌ విఫలమైంది. దళిత క్రైస్తవులను ఎస్‌సి జాబితాలోకి చేర్చాలంటే 1950 నాటి రాష్ట్రపతి (ఎస్‌సి) ఉత్తర్వులను సవరించడమే ప్రస్తుతం మన ముందున్న మార్గం.

(వ్యాసకర్త బ్రిటన్‌ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పని చేస్తున్నారు)
'ది హిందూ' సౌజన్యంతో
క్లెమెంట్‌ అరోకియా సామి

క్లెమెంట్‌ అరోకియా సామి