Nov 08,2023 12:30

రావల్‌వెల్లి (వనపర్తి) : 'నాన్నా ఇక నేను టీవీ చూడను'.. అంటూ.. లేఖ రాసి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యం తెలిపిన వివరాల మేరకు .... వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన కె.స్వామిగౌడ్‌, సరిత దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పాపిరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. వారికి కుమారుడు రవికుమార్‌, కుమార్తె దివ్య (21) ఉన్నారు. స్వామిగౌడ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రవికుమార్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దివ్య డిగ్రీ పూర్తిచేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఉద్యోగం చూసుకోకుండా ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో.... '' నాన్నా ఇక నేను టీవీ చూడను, ఫోన్‌ చూడను...చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను...ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు '' అని లేఖ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దివ్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.