
దేశంలోని సగం సంస్థలపై ఏడాదిలో దాడులు
'సోఫోస్' అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : వైద్య సంస్థలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గత 12 నెలల కాలంలో దేశంలో 60 శాతానికి పైగా హెల్త్‌కేర్ సంస్థలు సైబర్ దాడులకు గురయ్యాయి. ఇందులో 75 శాతం దాడుల్లో ఆ సంస్థల డేటాను తస్కరించగలిగారు. ఇంగ్లండ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలోని దాదాపు 60 శాతం హెల్త్‌కేర్ సంస్థలపై ఏడాది కాలంలో జరిగిన దాడుల్లో 75 శాతం దాడుల్లో డేటా చోరీ చేశారని సోఫోస్ అధ్యయనం తెలిపింది. గత మూడేళ్లలో అత్యధిక డేటా తస్కరణ రేటు ఇదేనని పేర్కొంది. గత ఏడాది డేటా తస్కరణ రేటు 61 శాతంతో పోలిస్తే ఈ రేటు పెరిగిందని తెలిపింది. 24 శాతం హెల్త్‌కేర్ సంస్థలే సైబర్ దాడుల్లో డేటా బయటకు వెళ్లకుండా అడ్డుకోగలిగాయి. గత ఏడాది 34 శాతం హెల్త్‌కేర్ సంస్థలు సైబర్ దాడుల్లో తమ సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకోగలిగాయి.గత ఏడాది నవంబర్ 30న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెబ్‌సైట్‌పై 24 గంటల వ్యవధిలో సుమారు ఆరు వేల సార్లు సైబర్ దాడులకు యత్నాలు జరిగాయి. దీనికి ఒక వారం రోజుల ముందు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఐదు సర్వర్లను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు ఎయిమ్స్ తన సొంత డేటానే ఓపెన్ చేసుకోలేకపోయింది. ఈ ఏడాది అక్టోబర్ 31న ఐసిఎంఆర్‌లో ఉన్న సుమారు 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్లు వార్తలు వచ్చాయి.
హెల్త్‌కేర్ సంస్థలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
సైబర్ నేరగాళ్లు హెల్త్‌కేర్ సంస్థలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇలాంటి సంస్థల్లో కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం, పాత కంప్యూటర్లను వినియోగించడం, సైబర్ సెక్యూరిటీ కోసం తగినన్ని నిధులు కేటాయించకపోవడం వంటివి ప్రధాన కారణాలని ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.