Oct 04,2023 21:12

వాషింగ్టన్‌ : టెక్‌ దిగ్గజం మెటాలో మరోమారు ఉద్యోగుల తొలగింపులు ఉండొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా మాతృసంస్థ అయినా మెటా ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగులపై వేటు వేయనుందని సమాచారం. మంగళవారం జరిగిన సంస్థ అంతర్గత సమావేశాల్లో ఉద్యోగుల తొలగింపు అంశంపై చర్చకు వచ్చిందని రిపోర్టులు వస్తున్నాయి. మెటాకు చెందిన 'ఫాస్ట్‌' యూనిట్‌లోని 600 సిబ్బందిని ఇంటికి పంపించనున్నారని సమాచారం. ఈ విషయమై వారికి ఒక్కటి, రెండు రోజుల్లో సమాచారం అందించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన మెటా.. మిగిలిన 6వేల మంది ఉద్యోగులకు మే నెల చివర్లో ఉద్వాసన పలికింది. తాజాగా మరోమారు వేటుకు సిద్దం కావడంతో టెక్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.