Apr 16,2023 06:35

మానవజాతి ప్రగతికి ప్రతిబింబం...సంస్కృతి. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టు, బొట్టు, ఆహార వ్యవహారాలలో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న భారతీయ సంస్కృతి గొప్పది. దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా సాంస్కృతిక జీవన విధానంగా...దండలో దారంలా కొనసాగుతున్నది. ఏ దేశ సంస్కృతి అయినా/ ఏనాడూ కాదొక స్థిర బిందువు' అంటాడు తిలక్‌. వ్యవస్థ పునాదులను పటిష్ట పరచడానికి, దాని ఆధారంగా నూతన వ్యవస్థను రూపకల్పన చేసి భావితరాలకు అందించడానికి నిరంతరంగా సాగే ప్రక్రియ...సంస్కృతి. ఇది ఏదేని సమాజంలోని ప్రజల జీవనశైలికి అద్దం పడుతుంది. ఇది మానవాళికి వున్న అమూల్యమైన, విశిష్టమైన సంపద. ప్రతి ప్రాంతానికీ, ప్రతి దేశానికీ వాటికంటూ విశిష్ట లక్షణాలతో కూడిన సంస్కృతి వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే...ఒక జాతి జీవన విధానమే సంస్కృతి. సమాజంలో జరిగే సాంప్రదాయిక భావ ప్రసరణ అనేది సంస్కృతికి సంబంధించిన ప్రధానమైన అంశం. అదేవిధంగా... మనం అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు, పండుగలు, కళలు, సాహిత్యం, సంగీతం, శిల్పకళ, మతం, శాస్త్రీయ విజ్ఞానం, జీవనశైలి, జీవితానికి సంబంధించిన సామాజిక దృక్పథం కూడా ఇందులో భాగమే. ఒక జాతి సంస్కృతి అనువంశికంగా సాగుతుంటుంది. దీనినే వారసత్వం అంటారు. 'భారతీయ సాంస్కృతిక వారసత్వం అనేది దేశంలో నిలదొక్కుకోవడానికి వచ్చిన విభిన్న సంస్కృతుల మేళవింపు' అంటారు గాంధీజీ. భారతీయ సంస్కృతి వైవిధ్యభరితమైనది. విభిన్న సంస్కృతుల సంశ్లేషణం. భిన్నత్వంలో ఏకత్వం దీని ప్రధాన లక్షణం. కాల గమనంలో ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా... తొణకకుండా నిరంతరాయంగా కొనసాగుతుంటుంది.
సంస్కృతికి అర్థం విస్తృతమైనది... సమగ్రమైనది. ఒక లెక్క ప్రకారం...దీనికి రెండు వందల నిర్వచనాలు వున్నాయి. 'ప్రపంచంలో రెండు విభిన్న సంస్కృతులు వున్నాయి. ఒకటి సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ సంస్కృతి, రెండోది సోషలిస్టు సంస్కృతి' అంటారు మక్సీం గోర్కీ. 'పెట్టుబడిదారీ వ్యవస్థలో సంస్కృతి అంతర్జాతీయ సరుకుగా మారిపోయింది' అంటారు జయతీ ఘోష్‌. 'హిందూ దేశ ఏర్పాటుకు సంబంధించిన మతతత్వ పథకానికి అనుగుణంగా సుసంపన్న సంస్కృతి వైవిధ్యాన్ని మతతత్వం హైజాక్‌ చేస్తున్నది. దానితోపాటుగా చరిత్రను కుదించి వక్రీకరిస్తున్నారు' అంటారు ప్రొఫెసర్‌ ఫణిక్కర్‌. దేశంలోని కీలకమైన సాంస్కృతిక, మేధో సంస్థలన్నిటినీ కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులతో నింపుతూ... ప్రస్తుత పాలకులు దేశాన్ని మతోన్మాదం వైపునకు నడిపిస్తున్నారు. ఆహారం, ఆహార్యం, భాష...అన్నిటిపైనా ఆంక్షలు, వక్రీకరణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తూ...అసలైన భారతీయ సంస్కృతికి, సాంస్కృతిక వికాసానికి కొత్త అర్థాలను చెబుతున్నారు. 'కాశ్మీర్‌ ఫైల్స్‌' వంటి సినిమాలే దీనికి ఉదాహరణ. సంస్కృతిని సరుకుగా మార్చుతూ...సామ్రాజ్యవాదానికి మతం తోడైతే ఎంత ప్రమాదమో సంఫ్‌ుపరివార్‌ రుజువు చేస్తోంది. ఒక దేశం, ఒక మతం, ఒకే సంస్కృతి వంటి తప్పుడు సూత్రీకరణలు చేస్తున్నారు. మన దేశంలో సంస్కృతి అంటే-'కులం లేదా వర్ణాశ్రమ ధర్మాలే' అనే ప్రచారం బాగా జరుగుతోంది. స్థూలంగా చెప్పాలంటే...మన జీవన విధానంలోని తినే తిండి దగ్గర నుంచి మాట్లాడే భాష, వేసుకునే బట్టలు, పాడే పాటలు, ఆడే ఆటలు, మన ఉత్పత్తి విధానం వరకూ సంస్కృతిలో భాగమే. బహుళ భాషలు, అనేక జాతులున్న సమాజంలో ఒక్కటే సంస్కృతి ఎన్నటికీ వుండదు. ఇక్కడ భిన్నజాతులు, విభిన్న సంస్కృతులు ఎప్పుడూ వుంటాయి. అవి కలిసిమెలిసి వుండాలి.
సంస్కృతికి బాహ్యరూపం నాగరికత. దీనికి మూలం- భూమి, శ్రమ. శ్రమపై ఆధారపడిన సాంస్కృతిక విశేషాలను, దేశీయమైన సామాజిక విశిష్టతలను, విభిన్న కులాలు, మాతాల సాంస్కృతిక వారసత్వాన్ని పదిలంగా కాపాడుకోవాలి. సంస్కృతీ వికాసంలో ఇది కీలకమైనది. మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. 'మతం వేరైతేను యేమోయి?/ మనసులొకటై మనుషులుంటే' అనే గురజాడ లౌకిక భావజాల స్ఫూర్తిని దేశమంతా నినదించాలి.