
ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటి మహిళకు ఎక్కడలేని ఆనందం. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే.. ఆమె ఎంతలా తల్లడిల్లిపోతుందో.. అలా తన ఇంట్లో అమ్మ, పిన్ని, నానమ్మ చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో మరణించడం పద్మజను తీవ్రంగా కలిచివేసింది. ప్రసవం జరిగి, బిడ్డ పుట్టిన ఆనందంలో ఉండగా.. అమ్మ మరణం ఆమెను ఎంతో వేదనకు గురిచేసింది. తను పడిన బాధలు తన పిల్లలు పడకూడదని ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నంగా ప్రకృతిసేద్యం వైపు అడుగులు వేశారు. ఆ అడుగులే నేడు దేశ రాజధాని వైపు పయనించేలా చేశాయి. జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీఓఏ) సంస్థ ప్రకృతి సేద్యంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రతి ఏడాది 'జైవిక్' పేరుతో అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది మన రాష్ట్రానికి ఈ అవార్డును ప్రకటించింది. అందులో ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు కేటగిరీలో బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిమటావారి పాలెంకు చెందిన 31 ఏళ్ల గనిపిశెట్టి పద్మజ సెప్టెంబరు 7న (నేడు) ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు.

దొడ్డా సాంబశివరావు, చిరంజీవి దంపతులకు పద్మజ తొలి సంతానం. 'వ్యవసాయ కుటుంబంలో పుట్టినా నాకు పెద్దగా వ్యవసాయ పనులు తెలియవు. తమ్ముడు, చెల్లితో ఆడుతూ పాడుతూ పెరిగాను. ఇంటర్‌లో ఉండగా పెళ్లి చేశారు. బాబు పుట్టిన కొన్ని రోజులకే అమ్మ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయింది. ఆమెకి అప్పటికే షుగర్ వుంది. 45 ఏళ్లు కూడా లేకుండా అమ్మ పోవడం నన్ను ఎంతో బాధించింది. నా చిన్నప్పుడే మా పిన్ని కూడా అనారోగ్య కారణాలతో 40 ఏళ్లకే చనిపోయింది. నేను 9వ తరగతి చదివేటప్పుడు నానమ్మకి క్యాన్సర్ సోకింది. నాన్నతో పాటు హాస్పటల్‌కి నేను కూడా వెళ్లాను. ఇతర కారణాలతో పాటు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుందని డాక్టరు ద్వారా తెలుసుకున్నాను. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిడ్డ పుట్టి ఆనందంలో ఉన్న నాకు, అమ్మ అవసరం బాగా ఉన్న ఆ రోజుల్లో ఆమె చనిపోవడంతో మళ్లీ డాక్టరు మాటలు మనసులో మెదిలాయి. అమ్మను తలచుకుని ఏడ్వని రోజు లేదు. అప్పటికి నాకు 18 ఏళ్లు. చెల్లి, తమ్ముడు ఇంకా చిన్న పిల్లలు' అంటూ పద్మజ చెబుతున్నప్పుడు భావోద్వేగంతో ఆమె గొంతు జీరబోయింది.
మొదటి ప్రయాణం ఇంటి నుండే
వరుస మరణాలతో కుదేలైన పద్మజ తన ఆరోగ్యంతో పాటు ఇంటిల్లిపాది ఆరోగ్యంపై కూడా శ్రద్ద పెట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ఇంటి పెరట్లో కాయ గూరలు, ఆకుకూరల మొక్కలు పెంచుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతి అవలంబిస్తారు. కానీ 2016లో ప్రకృతి వ్యవసాయంపై విస్తృత ప్రచారం సాగుతున్న రోజుల్లో గ్రామానికి వచ్చిన ప్రకృతి వ్యవసాయ ప్రచార కార్యకర్తలను పద్మజ కలిశారు. వారి ద్వారా సేంద్రియ వ్యవసాయ సాగు గురించి తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశారు.
90 శాతం పొలం పనులు ఒక్కదాన్నే..
'ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలు, పశువుల వ్యర్థాలతో పంటలు కూడా పండించవచ్చని అప్పటికే నేను విన్నాను. అయినా ఎలా చేయాలో తెలియదు. గ్రామానికి వచ్చిన కార్యకర్తల ద్వారా విశ్రాంత ఐఎఎస్ అధికారి విజరుకుమార్ గారు పరిచయమై ఆయన క్లాసులకు వెళ్లేదాన్ని. మొదట ఒక అర ఎకరం పొలంలో సేద్యం మొదలుపెట్టాను. అందుకు నా భర్త రామకృష్ణ కూడా అంగీకరించారు. ఆయన ఇచ్చిన మద్దతుతో ఆ ఏడాది బాగా కష్టపడి దిగుబడి సాధించాను. చిన్నప్పుడు పొలం వైపే చూడని నేను 90 శాతం పనులు ఒక్కదాన్నే చేసుకోవడం మొదలు పెట్టాను. మొదట నా కుటుంబం ఆరోగ్యం కోసం ఈ పని ప్రారంభించినా రానురాను అది ఊరందరికీ చేరింది. ఊళ్లో చాలామంది ఇప్పుడు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ సాగు పద్ధతిలో దిగుబడికి సంబంధించి పరిమితులు ఉన్నప్పటికీ- రసాయనిక ఎరువులు వాడకం లేకపోవడం ఒక మేలుగా రైతులు భావించారు.
మార్కెట్‌కి వెళి ్ల అమ్మింది లేదు..
అర ఎకరంతో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు రెండున్నర ఎకరాలకు చేరింది. ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేయడం వల్ల అధిక దిగుబడి కూడా వస్తోంది. సేంద్రియ పద్ధ తుల్లో పండించిన శనగలు, మొక్కజొన్న, ఆవాలు, కూరగాయలు, ఆకు కూరల పంటలను మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్మింది లేదు. కావాల్సిన వారు నేరుగా పొలానికి వచ్చి తీసుకుంటారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నా కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలు ఆరోగ్యంగా ఉండటంలో నేను కూడా భాగమవుతున్నాను' అంటూ తన ప్రయాణ విశేషాలను ఆమె పంచుకున్నారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టడం గర్వంగా ఉంది
'వ్యవసాయ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఈ అవకాశం అందరికీ దొరకదు. రైతు బిడ్డగా, రైతు మహిళగా పిలిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అమ్మ దూరమైన నాకు నేల తల్లే అమ్మ. నేలను పచ్చగా చూసుకుంటే ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది. వ్యవసాయం దండగ అనే వారు నేటికీ ఉన్నారు. కానీ, ప్రోత్సాహం ఉంటే నేలలో బంగారం పండించడం రైతులకే సాధ్యం. ఇప్పుడు చాలామందికి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించడం అలవాటైంది. ఇంటి పెరట్లో, మిద్దెపై అవకాశమున్న ప్రతి ఒక్కరూ ఇటువైపు వస్తున్నారు. భూమి లేకపోతే మనుషులు లేరు.. ఆరోగ్యకర పంటలు పండాలంటే నేల సారవంతంగా ఉండటం చాలా ముఖ్యం' అంటూ ఆమె చెబుతున్నప్పుడు వ్యవసాయంపై ఆమె మక్కువ కనపడుతోంది.
కుటుంబ ప్రోత్సాహంతోనే..
ఇంటి అవసరాల కోసం మొదలుపెట్టిన పద్మజ ప్రయాణంలో జాతీయ స్థాయి అవార్డు అందుకునే స్థాయికి ఎగబాకడంలో కఠోర శ్రమ దాగుంది. 'ఇదంతా ఒక్కరోజులో వచ్చింది కాదు. కుటుంబం, పిల్లలు సహకారంతోనే నేను ఇది సాధించాను. అవార్డు రావడంపై నాన్న ఎంతో సంబరపడి పోతున్నాడు' అంటూ తను సాధించిన ప్రగతిని కుటుంబ విజయంగా చెప్పడంతో ఆమెలో ఓ అమ్మ, కూతురు, భార్య కనిపిస్తోంది.
విత్తనాలను కూడా పద్మజ తనదైన శైలిలో భద్రపరుస్తున్నారు. మట్టి కుండల్లో విత్తనాలు వేసి పైన పల్చని వస్త్రంతో కప్పివుంచడం, పొడిబారిన నేలలో వేసే వీలుగా సీడ్ బాల్స్ చేయడం, జీవామృతం, ఘనామృతం తయారుచేయడం వంటివన్నీ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఆరు నెలలకు సరిపడా సేంద్రియ ఎరువును తయారు చేసుకుని కావాల్సిన వారికి కూడా పంపిణీ చేస్తున్నారు. తనతో పాటు, ఊరు, దేశం బాగుపడాలని కోరుకునే వ్యక్తులు రైతులే. ఇప్పుడు యువ రైతు పద్మజ చేస్తున్న ప్రయాణం కూడా అదే. ఈ మార్గంలో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.
- జ్యోతిర్మయి