
ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) అనుబంధ సంఘం యుఐటిబిబి ఆహ్వానం మేరకు అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి జులై 15 నుండి 19వ తేదీ వరకూ సోషలిస్టు దేశమైన క్యూబా రాజధాని హవానాలో పాల్గొన్నాం. మా పర్యటన సందర్భంగా క్యూబా కార్మికులు, ప్రజల పరిస్థితుల్ని రేఖామాత్రంగా చూశాం. పరిశీలించాం.
కొన్ని పెద్ద ద్వీపాలతోపాటు 250 చిన్న ద్వీపాలు కలిసున్న దేశం క్యూబా. వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు సగం, జనాభా ఒక కోటీ 13 లక్షలు. 1959వ సంవత్సరంలో ఫై˜డల్ కాస్ట్రో, ఎర్నెస్టో చేగువేరా, రావుల్ కాస్ట్రో లాంటి దిగ్గజాల నాయకత్వాన ఆ దేశంలో విప్లవం విజయవంతమైంది. వీరి నాయకత్వాన సోషలిస్ట్ క్యూబా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అనేక దేశాలకు వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలబడింది.
క్యూబా విప్లవ విజయాన్ని అమెరికా, బ్రిటన్ తదితర సామ్రాజ్యవాద దేశాలు సహించలేకపోయాయి. అమెరికా నాయకత్వాన ఉన్న సామ్రాజ్యవాద కూటమి క్యూబాను ఆర్థిక ఆంక్షలు, సైనిక చర్యల ద్వారా దిగ్బంధించడానికి 60 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉంది. క్యూబా ప్రజలు-కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన సోషలిస్ట్ విప్లవ చైతన్యంతో... సామ్రాజ్యవాద కుట్రలను, సవాళ్లను నేటికీ ఎదుర్కొంటున్నారు. ఉన్న పరిమిత వనరులు, కొన్ని మిత్ర దేశాల సహాయంతో అనేక పెట్టుబడిదారీ దేశాల్ని తలదన్నే రీతిగా చిన్నదేశమైనా పెద్ద సందేశం అనేక అంశాల్లో ప్రపంచానికి ఇస్తున్నది.
కరోనాని ఎట్లా ఎదుర్కొన్నారు?
కరోనా 2019 నుండి నేటికీ ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి. 203 దేశాల్లో కోట్లాది మంది ప్రాణాల్ని బలిగొన్నది. అనేక కోట్ల మంది దీని బారిన పడ్డారు. ప్రపంచ సామ్రాజ్యవాద నాయకుడిగా విర్రవీగే అమెరికాలోనే...లక్షలాది మంది పిట్టల్లా నేలకొరిగారు, ప్రజలకు వైద్యం అందక విలవిల్లాడారు. కానీ అమెరికాకు 90 మైళ్ల దూరంలో ఉన్న సోషలిస్టు క్యూబాలో 301 మందికి మాత్రమే కరోనా సోకింది. ఆరుగురే మరణించారు.
విప్లవానికి ముందు అంటువ్యాధులు చుట్టుముట్టేవి. చేగువేరా ప్రథమ దేశ ఆరోగ్యశాఖా మంత్రిగా వ్యాక్సిన్లపై 1962 సంవత్సరం నుండి కేంద్రీకరించారు. వ్యాక్సిన్లు అభివృద్ధి చేశారు. ప్రజలందరికీ అందించారు. ప్రజలకు రోగాలు సోకకుండా రెగ్యులర్‌గా డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మందులు, వైద్యం ఉచితం. ఇది ఈ దేశ ప్రత్యేకత. ప్రజలందరికీ హెల్త్‌కేర్ ప్రాథమిక హక్కుగా నిర్ణయించారు. ప్రతి 150 మంది జనాభాకు ఒక వైద్యుని బాధ్యతలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లో ఉన్నది. తలసరిన క్యూబా 830 డాలర్లు (71 వేలు) ఖర్చు పెడుతుంటే భారతదేశం సగటున తలకు రూ.1,600 మాత్రమే ఖర్చు పెడుతోంది. మన దేశ జీడీపీలో వైద్యానికి ఒక శాతం లోపే ఖర్చు పెడుతున్నారు. అందుకే మన దేశంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు శూన్యం. ప్రైవేట్ వైద్యం వైపు చూడాల్సి వస్తోంది.
నేడు ప్రపంచవ్యాప్తంగా 77 వేల మంది వైద్యులు యాభైకి పైగా దేశాల్లో వైద్య సేవలందిస్తున్నారు. కరోనాలో ఐదు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో పేద దేశాలకు క్యూబా ఉచితంగా అందిస్తోంది. ప్రపంచంలో అత్యధిక మంది ఉత్తమ సేవాతత్పరత కలిగిన వైద్యులను క్యూబా తయారు చేస్తోంది. కరోనాలో 50 దేశాలకు వైద్య బృందాల్ని, సిబ్బందిని పంపించింది. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాధినేతల మన్ననలను, పౌర సన్మానాలు పొందాయంటే ఆ వ్యవస్థ గొప్పదనం కాక మరేమిటి? 2010లో హైతి లో భూకంప బాధితులకు, కలరా బాధితులకు, 2014లో ప్రపంచాన్ని వణికించిన ఎబోలా దేశాలకు, ఆఖరికి తమని శతృవుగా ప్రకటించి, పరిగణించిన అమెరికా కత్రినా హరికేన్‌తో అతలాకుతలం అయినప్పుడు కూడా ఆపన్న హస్తాన్ని అందించిన విశాల దృష్టి క్యూబాది. ఇదే సోషలిజం ప్రత్యేకత.
అందరికీ విద్య - నూరు శాతం అక్షరాస్యత
విప్లవానికి ముందు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలు నిరక్షరాస్యతలో మునిగున్నారు. ప్రజల్ని అక్షరాస్యులను చేయకుండా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, సోషలిస్టు ఔన్నత్యం సాధ్యంకాదని భావించిన కమ్యూనిస్టు ప్రభుత్వం1959 లోనే 8 నెలలు విస్తృత అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టింది. పర్యవసానంగా ఆ దేశ అక్షరాస్యత నూరు శాతానికి చేరింది. పన్నెండు సంవత్సరాల ముందుగా స్వాతంత్య్రం పొందిన మన దేశంలో అక్షరాస్యత నేటికీ 70 శాతానికి మించలేదు. క్యూబా దేశ పౌరులకు 15 సంవత్సరాల వయస్సు వరకు నిర్బంధ విద్య. అనంతరం వారి అభిరుచి, అభిలాష కనుగుణంగా పై చదువులకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత. విద్య అందరికీ ఉచితమే.
అందరికీ ఉపాధి - కార్మికుల స్థితిగతులు
క్యూబా రాజ్యాంగంలో ఉపాధి ప్రాథమిక హక్కుగా ఉంది. ప్రభుత్వ మరియు స్వయం ఉపాధి ద్వారా కూడా ఆదాయానికి గ్యారంటీ చేయబడింది. ప్రభుత్వ ఆధీనంలోని మౌలిక వసతుల కల్పన, నిర్మాణం, ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడే ''ఎంప్రెస్సా కంటింజెంట్ బ్యాస్ రోకా'' ఫ్యాక్టరీని మేము సందర్శించాం. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతోను, కార్మికులతో, వారి యూనియన్ ప్రతినిధులతో మాట్లాడాం. 1650 మందిలో 1,166 మంది పురుషులు, మిగతావారు మహిళలు. అందులో 220 మంది టెక్నీషియన్లు, 967 మంది ఆపరేటర్లు, మిగిలినవారు ప్లానింగ్, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా నిర్మాణాలు చేపడతారు. ఇటువంటివి 16 కంపెనీలు ఉన్నాయి. రోడ్లు, భవనాలు, వంతెనలు, డ్యామ్‌లు, బ్రిడ్జిలు, ఫ్యాక్టరీలు, బహుళ అంతస్థుల భవనాలు, పార్కులు, వ్యక్తిగత ఇళ్ళ నిర్మాణం, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, రిసార్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ మొదలగు కార్యకలాపాలు జరుపుతాయి. ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివిధ కేటగిరీల్లో ఉపాధి పొందే వారి జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పురుషులకు 65 సంవత్సరాలు, మహిళలకు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్. రిటైర్ అయిన తరువాత పెన్షన్ గ్యారంటీ కల్పించింది. శారీరక దారుఢ్యం ఉండి విశ్రాంతి తీసుకోం. పని చేస్తామంటే ఉద్యోగం కల్పిస్తారు. పూర్తి జీతం చెల్లిస్తారు. పాత పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి ఫ్యాక్టరీకి కార్మికులేే యజమానులు. కార్మికులంతా ప్రజాస్వామ్యయుతంగా తమ ఫ్యాక్టరీ కమిటీలను ఎన్నుకుంటారు. స్థానిక మరియు ప్రాంతీయ ప్రజా కమిటీల నుండి ప్రజా అవసరాల కోసం వచ్చే విజ్ఞప్తులు, ప్రభుత్వం ఇచ్చే సూచనలను ఫ్యాక్టరీ యూనియన్ కమిటీ చర్చిస్తుంది. ప్లానింగ్ అమలు గురించి నిర్ణయిస్తుంది, అమలు జరుపుతుంది. అదే రీతిగా ఫ్యాక్టరీ అవసరాలు, కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కారానికి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇది కార్మిక ప్రజాస్వామ్యం.
ప్రైవేటు రంగంలో ఉపాధి అంటే ఇటీవల కొన్ని రంగాల్లో ఇతర దేశాల కంపెనీలకు ప్రవేశం కల్పించారు. ఆ కంపెనీ కూడా పై నిబంధనలను పాటించాల్సిందే. టూరిజం క్యూబాకి ప్రధాన వనరుల్లో ఒకటి. ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు హోటళ్లలో దిగటానికి ఇష్టపడనివారికి క్యూబా స్థానికులు భోజన వసతులు కల్పించే అవకాశం ప్రభుత్వ లైసెన్సులు పొందిన వారికి ఉంటుంది. టూరిస్టుల కోసం కార్లు, స్థానికంగా ఆటోలు నడిపేవారున్నారు. స్వదేశీ, విదేశీ పౌరులకు అందుబాటులో ఉండే విధంగా చేతివృత్తుల ద్వారా తయారైన వస్తువులు, టీ, జ్యూస్ స్టాళ్లు మొదలగు వాటి ద్వారా స్వయం ఉపాధి పొందడానికి వ్యక్తులు నడిపే అవకాశం ఉంటుంది. వలస కూలీలు వందల, వేల మైళ్ళు కాలినడకన ఆకలితో మగ్గుతూ మరణాలు సంభవించిన పరిస్థితి మన దగ్గర వుంది. కానీ కాలే కడుపులు ఉండకూడదని ప్రతినబూనిన వ్యవస్థ సోషలిస్టు క్యూబా.
అందరికీ స్వచ్ఛమైన నీరు
జాతీయ నీటి సరఫరా విధానం ద్వారా నీటి ప్రాజెక్టులు రూపకల్పన చేయబడ్డాయి. శుద్ధి చేసిన నీరు ప్రజలకు-ప్రజావసరాలకు నేరుగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇటువంటివి దేశంలో వివిధ ప్రాంతాల్లో 15 పైగా ఉన్నాయి. 70 లక్షల మంది ప్రజలకు ఉచితంగా, మిగిలిన ఎస్టాబ్లిష్‌మెంట్లకు నామమాత్రపు చార్జీల ద్వారా సరఫరా చేయబడుతున్నది. మన దేశంలో మాదిరిగా కార్పొరేట్ కంపెనీలకు లాభాలిచ్చేలా లీటరు మినరల్ వాటర్ బాటిల్ రూ.20; 20 లీటర్లు క్యాన్‌ని డబ్బుపెట్టి కొనాల్సిన అవసరంగానీ, నీటికి మీటర్లు బిగించి అందుకయ్యే ఖర్చంతా ప్రజల నుండే వసూలు చేయాలనే కార్పొరేట్ సూత్రంగానీ క్యూబాలో వర్తించదు. వ్యవసాయానికి, పార్కులకు, పరిశ్రమలకు, నదులు, కాలువల నీటిని శుద్ధి చేసి స్ప్రింక్లర్ల ద్వారా అందిస్తున్నారు. దీనికి వేరే కంపెనీలు ఏర్పడి పని చేస్తున్నాయి. నీటికి మీటర్లుండవు. వాడకపు కొలతలు, వసూళ్లు ఉండవు. కాని నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తారు.
సోషలిస్టు క్యూబా నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. మరి చిన్న దేశం. పెద్ద సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నదా? లేదా? మన ప్రజలకు, కార్మికులకు ఆ వ్యవస్థ ఆదర్శం. అనుసరణీయం.
వ్యాసకర్త : సిఐటియు ఆలిండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు