Oct 14,2023 09:40

            ఆ రోజు బాంధవి ఏడ్చుకుంటూ పోలీస్‌స్టేషనుకు వెళ్లింది. ఎందుకొచ్చావని, ఏం జరిగిందని పోలీసులు అడిగారు? సమాధానం చెప్పలేదు. అదేపనిగా ఏడుస్తూ ఉంది. ఎవరైనా ఏమైనా అన్నారా? స్కూల్లో, చుట్టుపక్కల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారా? అని ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడం లేదు. ఏడుస్తూనే ఉంది. ఎంత సేపో బుజ్జగించాక అసలు విషయం చెప్పింది. 'మా ఇంటి పక్కనే ఉండే షాపులో క్రితం రోజు నేను ఓ పుస్తకం కొన్నాను. ఆ పుస్తకం తీసుకుని స్కూలుకు వెళితే దాన్ని చాలా తక్కువ ధరకే కొన్నామని నా స్నేహితులు చెప్పారు. షాపు యజమాని నాకు రూ.85 ఎక్కువకి అమ్మాడు. నేను వెంటనే వెళ్లి అడిగాను. పుస్తకం అసలు ధర కంటే అతను తీసుకున్న ఎక్కువ డబ్బులు ఇవ్వమని నిలదీశాను. కానీ యజమాని ఒప్పుకోలేదు. పుస్తకం తిరిగి ఇచ్చేస్తా, నా డబ్బులు ఇచ్చేయమన్నాను. కుదరదని కసురుకున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు' అని వెక్కిళ్లు పడుతూ చెప్పింది.
           రూ.85 కోసం ఆ పాప ఎందుకంతలా ఏడ్చిందంటే.. ఉత్తరప్రదేశ్‌ హరదోయిలో రోజు కూలీ చేసుకునే తండ్రి, తన భార్య, ఐదుగురు సంతానంతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు. బాంధవి అతని నాలుగో సంతానం. సంపాదన తక్కువైనా పిల్లలను బడి మాన్పించకుండా చదివించుకుంటున్నాడు ఆ తండ్రి. 9వ తరగతి చదువుతున్న బాంధవి పుస్తకం కోసం డబ్బులు అడిగిన రోజు, అతను కొన్ని గంటలు అదనంగా పనిచేశాడు. ఆ పిల్లలకు తండ్రి కష్టం తెలుసు. అందుకే తక్కువ ధర ఉన్న పుస్తకాన్ని షాపు యజమాని ఎక్కువ ధరకు అమ్మాడని తెలిసి బాంధవి తట్టుకోలేకపోయింది. షాపు యజమానిని నిలదీసింది. అతను ససేమిరా అనడంతో పోలీసులను ఆశ్రయించింది. చదువు విలువతో పాటు తండ్రి కష్టం తెలిసిన బాంధవి, పోలీసులను ఆశ్రయించడం, వారి సాయంతో షాపు యజమానిని నిలదీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.