
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో :తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. కౌంటింగ్‌కు నల్గండలోని గిడ్డంగుల సంస్థ గోడౌన్‌లో ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఇవిఎం) నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93.3 శాతం ఓటింగ్ నమోదైంది. గెలుపుపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.