Oct 16,2023 11:00
  • ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించండి - గవర్నర్‌ను కోరిన మణిపూర్‌ పార్టీలు

ఇంఫాల్‌ : మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండను నివారించేందుకు అర్థవంతమైన శాంతి చర్చలు జరగడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన పది ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో శాంతి స్థాపనలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో, బాధితులకు అవసరమైన సహాయ పునరావాస చర్యలు చేపట్టడంలో సాయపడాలని గవర్నర్‌ అనుసూయా ఊకేకు విజ్ఞప్తి చేశాయి. ప్రతిపక్ష పార్టీలు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందించాయి. రాష్ట్రంలో ఐదు నెలలకు పైగా సంక్షోభం కొనసాగుతోందని, అయినప్పటికీ నేటి వరకూ కుకీలు, మైతీలతో అర్థవంతమైన శాంతి చర్చలు ప్రారంభం కాలేదని ఆ వినతిపత్రంలో తెలియజేశాయి. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో జోక్యం చేసుకోరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయని, పైగా సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. వినతిపత్రాన్ని అందజేసిన పార్టీల్లో కాంగ్రెస్‌, ఐక్య జనతాదళ్‌, సీపీఐ, సీపీఐ (ఎం), తృణమూల్‌ కాంగ్రెస్‌, అమ్‌ఆద్మీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎన్సీపీ, శివసేన (ఠాక్రే), ఆర్‌ఎస్‌పీ ఉన్నాయి. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాష్ట్రంలో పరిపాలన లేకపోవడంతో స్థానిక పౌర సమాజాలు వివిధ రకాల ఆందోళనలు సాగిస్తూ ప్రకటనలు చేస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. ప్రాథమిక హక్కులను వినియోగించుకోకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిషేధ చర్యలకు పూనుకుంటోందని మండిపడ్డాయి. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి లాంటిదంటూ ప్రధాని మోడీ గొప్పగా చెబుతున్నప్పటికీ ఇలా జరుగుతోందని విమర్శించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను వెంటనే తొలగించి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ప్రతిపక్షాలు కోరాయి. బాధితులకు అందజేస్తున్న సహాయ ప్యాకేజీ ఏ మాత్రం సరిపోదని తెలిపాయి. హింసాకాండలో చనిపోయిన వారి మృతదేహాలను ఆయా కుటుంబాలకు అందజేయాలని కోరాయి.