Jan 01,2023 06:40

దేశంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు కార్మిక వర్గం పట్ల అనుసరిస్తున్న విధానాల కారణంగా సంఘటిత, అసంఘటిత కార్మికుల జీవన పరిస్థితులు దారుణంగా దిగజారాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగటంలేదు. కార్మికులు, సాధారణ ప్రజానీకం జీవన పరిస్థితులపైనేకాక, వారి హక్కుల పైన దాడి చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా...సామాన్య ప్రజల, కార్మికుల హక్కులు కాపాడడం కోసం, ఉద్యోగ భద్రత నిలబెట్టటం కోసం సిఐటియు నిరంతర పోరు సాగిస్తున్నది.
సంఘటిత రంగానికి చెందిన కార్మికులు, ఉద్యోగుల సమస్యలపైనే కాక సిఐటియు కోట్లాదిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటాలను నిర్వహించింది. దాదాపు 4 లక్షల మంది ఉన్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు విఓఎ, సమగ్రశిక్ష, జాతీయ ఆరోగ్య మిషన్‌, ఉపాధి హామీ తదితర అన్ని ప్రభుత్వ పథకాలలోని కార్మికుల సమస్యలపై, ఉపాధి భద్రత కొనసాగింపుపై ఆందోళన నిర్వహించింది. వీరేకాక కోటికి పైగా ఉన్న భవన నిర్మాణం, హమాలీ, ఆటో, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు, బీడీ, సెక్యూరిటీ గార్డులు, క్వారీ, గనులు, ఆక్వా, జీడిపిక్కలు తదితర కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 3 లక్షల మందిగానున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, వర్క్‌ ఔట్‌సోర్సింగ్‌ తదితర ఉద్యోగుల ఆందోళనలకు బాసటగా నిలిచింది.
అంతేకాక కోవిడ్‌ కాలంలో కోట్లాది మంది వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో కాలినడకన స్వరాష్ట్రాలకు వెళుతున్న సమయంలో వారికి అనేక చోట్ల ఆహారాన్ని అందించింది. కరోనా వలన ఉపాధి కోల్పోయిన 1,60,649 కార్మికులకు దాతల సహాయంతో వస్తు, నగదు రూపేణ మొత్తం 3 కోట్ల రూపాయల విలువైన సహాయాన్ని మన రాష్ట్రంలో సిఐటియు ఎ.పి కమిటీ అందించింది. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలిచింది. రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీ రైతుల పోరాటానికి 21 లక్షల రూపాయల నగదు సహాయాన్ని సిఐటియు, సిఐటియు అనుబంధ సంఘాల ద్వారా వసూలు చేసి అందించింది. వివిధ పారిశ్రామిక ప్రమాదాలలో కార్మికులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు న్యాయమైన పరిహారం చెల్లించేలా, న్యాయం జరిగేలా కృషి చేసింది. బిజెపి మతోన్మాద దాడుల బాధితులను ఆదుకోవటానికి, పాలస్తీనా ప్రజలకు సంఘీభావ నిధిని అందించే కృషి చేసింది.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక జిల్లాల్లో అంగన్‌వాడీలు, ఆశాలు, విఓఏ లపై రాజకీయ వేధింపులు పెరిగాయి. అక్రమ తొలగింపులు జరిగాయి. దీనిని నిరసిస్తూ నిర్బంధాన్ని ఎదుర్కొని కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన ఆందోళనల వలన...అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు నష్టం కలిగించేలా ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా వేలాది మందితో ధర్నా, లబ్ధిదారులతో కలిసి నిరసనలను సిఐటియు నిర్వహించింది. కరోనా వ్యాక్సిన్‌ వికటించి మరణించిన ఆశా కార్యకర్తకు నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించడంతో ప్రభుత్వం రూ.50 లక్షలు చెల్లించింది. మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధికి ఎసరు పెట్టేలా ఈ పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు ఇవ్వాలనే నిర్ణయంపై పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ఎదుర్కొని ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం వర్కర్లను గ్రామాల్లో తొలగించబోమని ప్రకటించక తప్పలేదు. విఓఎ లు తమ ఉపాధి కొనసాగించాలని, 45 సంవత్సరాలకే రిటైర్‌ చెయ్యాలనే కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చెయ్యాలని వేలాదిగా 'చలో విజయవాడ' నిర్వహించారు. ప్రభుత్వం దాదాపు 5 వేల మందిని గృహ నిరంధం చేసినా, పోలీస్‌ స్టేషన్లో పెట్టినా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడారు. ఉపాధి నిలబెట్టుకున్నారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు వేతన పెంపు, విలీనం కోసం మిలిటెంట్‌ గా ఆందోళనలు నిర్వహించారు. గోపాల మిత్రలు 34 రోజుల సమ్మెతో తమ కొనసాగింపును సాధించుకున్నారు. 104 ఉద్యోగుల కొనసాగింపు, వేతన పెంపు, 108 ఉద్యోగుల వేతన పెంపు, కోవిడ్‌ మృతులకు నష్ట పరిహారం చెల్లించడం, రిమ్స్‌ కార్మికులు, మున్సిపల్‌ కార్మికుల సమస్యలపైన, వేతన పెంపు మరియు డి.ఎ రికవరీపై విఆర్‌ఎల పోరాటాలన్నింటిలో సిఐటియు కార్మికులకు బాసటగా నిలిచింది. ఇసుక క్వారీల మూసివేతకు, నష్టదాయకమైన ఇసుక పాలసీకి వ్యతిరేకంగాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించారు. లారీలు, ఆటోలు తదితర ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్మికులు తమకు నష్టదాయకమైన మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ సవరణకు వ్యతిరేకంగా జిల్లా రాష్ట్ర స్థాయిలలో ధర్నాలు నిర్వహించారు. ఈ పోరాటాలన్నీ సిఐటియు ఆధ్వర్యంలో జరిగినవే.
పోరాటాలు జరగనివ్వకుండా వైసిపి ప్రభుత్వం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. కార్మికులు సామూహికంగా చేసే ఆందోళనలను అణిచివేయటమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నది. అనుమతులు ఇవ్వలేదనే సాకుతో దౌర్జన్యంగా అరెస్టులు చెయ్యడం, మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రులు స్టేషన్లలో కూర్చోబెట్టడం, రైళ్ళ నుంచి దింపడం వంటి దుర్మార్గపు పద్ధతులను అవలంభించింది. అయినా స్కీం వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, పెద్ద ఎత్తున పోరాటాలలో భాగస్వాములయ్యారు. కార్మికులే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపిఎస్‌ ఉద్యోగులు కూడా ఈ నిర్బంధానికి గురౌతున్నారు. ఇటువంటి నిర్బంధాల మధ్య జరిగిన పోరాటాలన్నింటిలో సిఐటియు ముందు పీఠిన నిలిచింది. కార్మిక వర్గ ఐక్యతతో ముందుకు సాగుతున్నది.

naga

 

 

 

 

 

వ్యాసకర్త: సి.ఐ.టి.యు రాష్ట్ర కోశాధికారి ఎ.వి. నాగేశ్వరరావు, సెల్‌ : 9490098031