Oct 28,2023 10:44
  • తుమ్మల, పొంగులేటి, రాజగోపాల్‌ రెడ్డి తదితరులకు అవకాశం
  • ఇప్పటివరకు వంద స్థానాలకు ప్రకటన
  • 19 స్థానాలకు పెండింగ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 45 మందితో తెలంగాణలో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేసింది. అనేక చర్చలు, అనేక భేటీల తరువాత ఎట్టకేలకు శుక్రవారం కాంగ్రెస్‌ రెండో జాబితాను విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ నెల 15న 55 స్థానాలతో మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌, శుక్రవారం మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 19 స్థానాలకు అభ్యార్థుల ఖరారు పెండింగ్‌లో ఉంది. ఇందులో నాలుగు స్థానాలు వామపక్షాలకు కేటాయించనున్నారు. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే జాబితా ప్రకటించనున్నారు.
            రెండో జాబితాలో ఇటీవలి బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు కేటాయించారు. అలాగే శుక్రవారమే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మునుగోడు కేటాయించారు. ఎల్‌.బి.నగర్‌ నుంచి మధుయాష్కీ గౌడ్‌, జూబ్లీహిల్స్‌ నుంచి ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌, హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌, సికింద్రాబాద్‌ కంటోన్నెంట్‌ నుంచి జీ.వి. వెన్నెల (గద్దర్‌ కుమార్తె), ఖైరతాబాద్‌ నుంచి పి. విజయారెడ్డి, వరంగల్‌ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేయనున్నారు.
 

                                                          తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి పలువురి నాయకులు చేరారు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌, బిజెపిలకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరికొందరు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎంపి, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, కపిలవాయి దిలీప్‌ కుమార్‌, టి.సంతోష్‌కుమార్‌తో పాటు పటాన్‌చెరుకు చెందిన బిఆర్‌ఎస్‌ నేత నీలం మధు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.