
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. మైనార్టీ, బీసీలకు సెపరేట్ గా డిక్లరేషన్ ఇచ్చామన్నారు. మైనార్టీ డిక్లరేషన్ రూపొందించింది సల్మాన్ ఖుర్షిద్ అని తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం.. మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మైనార్టీలను బీసీలలో కలుపుతారా.. బుర్ర ఉందా అని మండిపడ్డారు. బీసీలలో 136 కులాల్లో వర్గీకరణ చేసి చట్టం చేశారన్నారు. బేసిక్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా ఇలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడరని ఆరోపించారు. మాదిగలకు మోసం చేసే ప్రయత్నం మోడీ చేశారని అన్నారు. డిసెంబర్ 4 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి.. మద్దతు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కండిషన్ లేకుండా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని తెలిపారు.
చట్టాలను తమ చేతిలోకి తీసుకుంటే కేసీఆర్.. కేటీఆర్ బయట తిరగలేరని రేవంత్ విమర్శించారు. రాజకీయ పార్టీలు చేసే పని.. పోలీసులు చేయకండని సూచించారు. మేము చేసే పనులు.. మీరు చేస్తే, డిసెంబర్ 9 తర్వాత.. మీరు చేసిన పనులపై విచారణ చేస్తామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకండని తెలిపారు. వచ్చే అసెంబ్లీ మొదటి సమావేశంలోనే కేసులు ఎత్తివేసే బిల్లు పెడతామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వ్యవసాయంకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్‌ఎస్ చెబుతుంది.. ఇవ్వడంలేదని నిరూపిస్తే అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయడానికి హరీష్ రావు, కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు. 6 నెలల నుండి 24 గంటల కరెంట్ ఇచ్చారో చూద్దామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్సేనని.. ఉచిత విద్యుత్ పై మాది పేటెంట్ హక్కు అని రేవంత్ రెడ్డి అన్నారు.