
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేయనుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్ తెలిపారు. విశాఖ ఆశీల్‌మెట్టలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎంపిగా తనను గెలిపించాలని కోరారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా తాత్కాలికంగా అడ్డుకున్నామని తెలిపారు. విశాఖ నగర వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కంపెనీల ఏర్పాటు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.4 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించలేదని చెప్పారు. బిజెపి నాయకులు జివిఎల్.నరసింహారావు విశాఖ నుంచి ఎంపిగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారని, ఈ ప్రాంతంతో సంబంధంలేని వ్యక్తికి నగర వాసులు ఓట్లు వేయొద్దని కోరారు. దేశంలో బిజెపి పాలన దారుణంగా తయారైందని, ముస్లిములు, క్రిస్టియన్లపై ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించకపోగా ప్రధాని మోడీ ప్రోత్సహిస్తుండడంపై మండిపడ్డారు. తన పార్టీకి ఎపిలో అధికారాన్ని ఇస్తే చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అప్పులన్నింటినీ తీరుస్తామని హామీ ఇచ్చారు.