Oct 21,2023 22:02

తొలిసంతకం చేసిన సిఎం స్టాలిన్‌
చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతోంది. అధికార డిఎంకె శనివారం రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభించింది. డిఎంకె అధ్యక్షుడు, సిఎం ఎంకె స్టాలిన్‌ తొలి సంతకం చేశారు. నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. నీట్‌ పరీక్ష రాసి అర్హత సాధించని సుమారు 22 మంది తమిళ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో డిఎంకె ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఇది ఉందని విమర్శించింది. పట్టణ విద్యార్థులు, కోచింగ్‌ సెంటర్‌లకు అనుకూలంగా ఉన్న నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. తమిళనాడుకు నీట్‌ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును రాష్ట్రపతికి పంపింది. ఈ బిల్లు ఆమోదం కోసం డిఎంకె ప్రభుత్వం ఎదురుచూస్తోంది.