
- కనీస ధర రూ.15 ఇవ్వాలి
- రైతులను దోచేస్తున్న దళారీ వ్యవస్థ
- నేడు కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : కొబ్బరి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సరైన ధర లేక రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొబ్బరి రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సు జరుగనుంది. కొబ్బరి రైతుల సమస్యలపై ఆ సదస్సులో పలు తీర్మానాలు చేయనున్నారు.
కొబ్బరి ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగుతోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోవడంతో ఎకరా కొబ్బరి సాగుకు రూ.40 వేలు వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. చెట్టు నుండి కాయలు తీసి గుట్టగా వేసేందుకు ఒక్కో కాయకు రూ.3 ఖర్చవుతోంది. కొబ్బరి కాయకు వ్యాపారులు రైతులకు ఇచ్చే ధర ఆరేడు రూపాయలకు మించడం లేదు. ఇది చాలదన్నట్లు వంద కొబ్బరికాయలు కొనుగోలు చేస్తే పది కాయలు ఉచితంగా తీసుకునే సంప్రదాయం నడుస్తోంది. ఎకరా విస్తీర్ణంలో 60 వరకు కొబ్బరి చెట్లు ఉంటాయి. గతంలో ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో చెట్టుకు రూ.600 నుంచి రూ.700 మాత్రమే ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరాకు రూ.60 వేలు ఆదాయం రాగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. మోడీ సర్కార్ విదేశీ కొబ్బరి దిగుమతులకు అవకాశం కల్పిస్తోంది. కొబ్బరి మార్కెట్ పూర్తిగా వ్యాపారుల కంబంధహస్తాల్లోనే నడుస్తోంది. కొబ్బరికాయ ధర కనీసంగా రూ.15 ఉంటే రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుందని రైతులు కోరుతున్నారు. శనివారం జరగబోయే కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సులో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉంది. కొబ్బరి సాగయ్యే అన్ని జిల్లాల్లో నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ ద్వారా కొబ్బరి పంటను కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.