- పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వికెట్ కీపర్‌గా ఇషాన్
- మిడిలార్డర్‌పైనే దృష్టి
- టీమిండియా కోచ్ ద్రావిడ్
కొలంబో : ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ హోరాహోరీ పోరు తప్పదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌కు వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని, ప్రధానంగామిడిలార్డర్‌పైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చాడు. భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లోనూ టెన్షన్ నెలకొంటుందని, విశ్వవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపాడు. వికెట్ కీపర్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో రెండో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమన్నాడు. సంజు శాంసన్ కూడా జట్టుతో కలిసి శ్రీలంకకు చేరుకున్నా.. అతడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ఆడేది కష్టమేనని తెలిపాడు. టాప్-3 బ్యాటర్స్ తర్వాత ఇషాన్ మైదానంలోకి దిగనున్నాడని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడు శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా.. ఫస్ట్‌డౌన్‌లో విరాట్ కోహ్లి మైదానంలోకి దిగుతారని తెలిపాడు. మిడిలార్డర్‌లో ఇషాన్, సూర్యకుమార్, శ్రేయస్, తిలక్ వర్మలతో టీమిండియా బలంగా ఉందని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో జడేజా, హార్దిక్, అక్షర్ అందుబాటులో ఉన్నారని, పేస్ భారాన్ని బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తారన్న నమ్మకముందని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. అలాగే ఏకైక ఫుల్‌టైమ్ స్పిన్నర్ కుల్దీప్‌కు తుదిజట్టులో చోటు దక్కడం ఖాయమని పేర్కొన్నాడు.
ఒక్కో మ్యాచ్‌కు 67.8కోట్లు - డిజిటల్, టివి హక్కులు వయాకామ్-18 సొంతం
మహిళల ప్రిమియర్ లీగ్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ మీడియా హక్కులు దక్కించుకున్న వైకోమ్-18 తాజాగా భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) డిజిటల్, టివి హక్కులను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన వేలంలో డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా పోటీదారులను వెనక్కి నెట్టి వైకోమ్-18 చాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం రూ.5,963 కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్న ట్లు బిసిసిఐ తెలిపింది. స్వదేశంలో 2023-28 సీజ న్‌లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది. టివి ప్రసారాలు స్పోర్ట్స్-18లోనూ, జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అంతర్జాతీయంగా 88 ద్వైపాక్షిక మ్యాచ్‌లు ప్రసారం చేసే హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఇందులో 25టెస్టులు, 27వన్డేలు, 36అంతర్జాతీయ టి20లు ఉన్నాయి. ఈ-వేలంలో వయాకామ్‌కు సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.










