Oct 17,2023 10:00

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు, సవరించే ప్రక్రియకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని సిపిఎం, సిపిఐ, ఎస్‌పి డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరుకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్‌పి ఎంపిలు రాంగోపాల్‌ యాదవ్‌, జావిద్‌ అలీఖాన్‌తో కూడిన నేతల బృందం వినతిని అందజేసింది. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా 2023 జనవరి 6న, 2023 అక్టోబరు 27న ప్రచురించే ఓటరు జాబితాలతో పాటు ఓటరు జాబితాలో పేర్లు చేర్పులు, తొలగింపులు, సవరించడానికి సంబంధించి రాజకీయ పార్టీలకు అందజేసి, పేర్ల జాబితాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 'లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్‌ (పోలింగ్‌ స్థలం) ఓటరు జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రచురించారు. 2023 జనవరి 6 నుంచి 2023 అక్టోబరు 27 వరకు ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో పేర్లు చేర్చారు. చాలా పేర్లు తొలగించారు. కొన్ని పేర్లు సవరించారు. తొలగించిన పేర్లను ఇంటింటికీ వెళ్లి ధ్రువీకరించడం చాలా ముఖ్యం, దీని కోసం తొలగించబడిన పేర్ల జాబితా డ్రాఫ్ట్‌ రోల్‌ / మదర్‌ రోల్‌, ఓటరు జాబితాలో చేర్చబడిన పేర్లతో పాటు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలి.' అని పేర్కొన్నారు.
           ఓటరు జాబితాలో చేర్చిన పేర్ల జాబితా, తొలగించిన పేర్ల జాబితా, సవరించిన పేర్ల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చారని, ఇఆర్‌ఒ ముద్రించకూడదని నిబంధనలు, సూచనలు ఇచ్చారని, ఇది దారుణమని అన్నారు. 'లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయ పార్టీల సమావేశం, చర్చలు లేకుండానే ఎలక్టోరల్‌ రోల్స్‌ 2023 మార్చిలో (పత్రం-10, ఎడిషన్‌-2) కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మాన్యువల్‌ను విడుదల చేసింది. ఓటరు జాబితాలో చేర్చిన, సవరించిన, తొలగించిన పేర్లను మేము కోరుతున్నాము. అన్ని రాజకీయ పార్టీల పేర్లను చేర్చాలి. ఇది పార్టీలకు అందుబాటులో ఉంచాలి. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు-2024 స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడేలా పై సవరణలు, కొత్త నిబంధనలను రద్దు చేయాలి' అని కోరారు.