Jul 26,2023 18:23

శాంటియాగో : చిలీ ఉపాధ్యాయులు జీతాల కోతకు వ్యతిరేకంగా, పెన్షన్‌ పెంపు వంటి డిమ్లా సాధన కోసం రోడ్డెకెక్కనున్నారు. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ది చిలీయన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ బుధవారం దేశవ్యాప్త 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. మాజీ చిలీ అధ్యక్షుడు అగస్టో పినోచె ఉగార్టె (1973-1990) కాలంలో ఉపాధ్యాయుల జీతాలు తగ్గించబడ్డాయి. టీచర్స్‌ జీతాల కోతతో వారి పెన్షన్‌లపై కూడా ఆ ప్రభావం పడింది. ఉపాధ్యాయులకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని ఉపాధ్యాయ యూనియన్‌ డిమాండ్‌ చేస్తోంది. అలాగే పాఠశాలల్లో జరుగుతున్న హింసను ఎదుర్కోవడానికి, ఆలస్యమైన పదవీ విరమణ బోనస్‌ల చెల్లింపు, సెక్టార్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌లో మార్పులు, పనిభారం తగ్గించాలని, బోధనా దినం యొక్క సవరణ వంటి డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాలు సమ్మె చేయనున్నాయి. సమ్మెతోపాటు దేశవ్యాప్తంగా సభలు, విద్యా సంఘాలతో చర్చలు, ర్యాలీలు నిర్వహించాలని యూనియన్‌ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రచార సమయంలో రిపబ్లిక్‌ ప్రెసిడెంట్‌ గాబ్రియల్‌ ఈ డిమాండ్లను నెరవేరుస్తారని హామీ ఇచ్చారని టీచర్స్‌ యూనియన్‌ హెడ్‌ కార్లోస్‌ డియాజ్‌ మర్చంట్‌ గుర్తు చేసుకున్నారు.